Site icon NTV Telugu

రేవంత్‌, మల్లారెడ్డి మధ్య సవాళ్లు ఉత్తవేనా ?

ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్టు.. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరు. స్టేట్‌మెంట్స్‌ చాలా విచిత్రంగా ఉంటాయి. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ మధ్య సవాళ్లూ ఆ కోవలోకే చేరతాయా? రాజీనామాలపై వారి ప్రకటనలు నమ్మొచ్చా.. లేక రాజీడ్రామాలా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్‌ సీన్‌ ఇదే. అసలే మంత్రి మల్లారెడ్డి. పక్కా నాటు. ఆయన్ని కెలికారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌. ఇంకేముందీ మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.. సవాళ్లు విసిరారు మంత్రిగారు.

రాజీనామాలపై సవాళ్లు ఓ ఫ్యాషన్‌..!

మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ల మాటల యుద్ధం సవాళ్ల వరకు వెళ్లింది. రాజీనామా చేయ్‌.. ఎవరి సత్తా ఏంటో చూసుకుందామని ఛాలెంజ్‌ చేశారు మంత్రి. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజీనామా డిమాండ్‌పై ఎవరు ముందుకు వస్తారు. ఎవరు వెనకడు వేస్తారు అన్నది ప్రశ్న. సందర్భం ఏదైనా.. పొలిటికల్‌గా మైలేజ్‌ వస్తుంది అనుకుంటే రాజీనామా చేస్తాననడం లీడర్స్‌కు ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయింది. ఒకప్పుడు ఎంతో వెయిట్‌ ఉన్న ఆ మాట నాయకుల చీప్‌ ట్రిక్స్‌ కారణంగా పెద్ద జోక్ అయ్యింది.

నాటు భాషలో మల్లారెడ్డి నాటు కొట్టుడు!

మూడుచింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేసింది కాంగ్రెస్‌ పార్టీ. అదే వేదిక నుంచి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపై చర్చకు సిద్ధమా..? లేదంటే రాజీనామా చేస్తారా…! అంటూ సవాల్ విసిరారు పీసీసీ చీఫ్‌. రెండో రోజు దీక్ష విరమణ సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డిపై భూ దందా ఆరోపణలు చేయడం.. జొకర్లు… బ్రోకర్లు అని కామెంట్స్‌ చేశారు. వీటికి మంత్రి మల్లారెడ్డి కౌంటర్‌ అటాక్‌ చేశారు. నాటు భాషలో నాటు కొట్టుడు కొట్టారు. దానికి కొనసాగింపుగా రాజీనామాల అంశాన్ని ఆయన తెర మీదకు తెచ్చారు. ఆపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రాజకీయాలు హీటెక్కాయి.

విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నేతలు ఫోకస్‌!

రెండు పార్టీల నేతల సవాళ్ల ఫలితంగా మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో మొదలైన రాజీనామాల పర్వం.. గజ్వేల్‌ వరకు వెళ్లింది. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు తప్పితే.. మాటపై నిలబడతారో లేదో జనాలందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నాయకులు వాడుతున్న పదజాలమే వెగుటు పుట్టిస్తోంది. తెర మీదకు వచ్చిన అంశాలను పక్కదారి పట్టించేందుకు ఎవరికి వారు కారణాలు వెతుక్కోవడం తప్పితే రాజీనామాలు చేయడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు.

రాజీనామాలు వెనక్కి.. కౌంటర్‌ అటాక్‌లపైనే నజర్‌!

ప్రస్తుతం టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల్లోని మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి టీమ్‌లు విమర్శలకు.. ఎలా కౌంటర్లు ఇవ్వాలన్నదానిపైనే ఫోకస్‌ పెట్టాయి. రాజీనామాపై ఎవరైనా ప్రశ్నిస్తే.. భలేవాడివి బాసూ.. అంత అమాయకంగా ఎలా ఉన్నావు అన్నది ఆ శిబిరాల నుంచి వచ్చే మాట. మరి.. రాజీనామా డిమాండ్‌పై ఒకరినొకరు ఫిక్స్‌ చేసుకునేలా ఎత్తుగడలు వేస్తారో లేక.. తొడలు కొట్టి.. రాజకీయాలను రక్తి కటిస్తారో చూడాలి.

Exit mobile version