Site icon NTV Telugu

ఆ పార్టీలో ఆ ఇద్దరి మధ్య స్నేహం సాధ్యమేనా…?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నాయకుల మధ్య దోస్తీ సాధ్యమా? ఆ ఇద్దరినీ కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కుస్తీకే ప్రాధాన్యం ఇచ్చి.. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారా? అందరి ఫోకస్‌ ఆ ఇద్దరిపైనే ఎందుకు ఉంది?

రేవంత్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు!

తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఇంద్రవెల్లి నుండి ప్రారంభమైన దండోరా.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభకు ప్లాన్ చేసింది. సభకు సంబంధించి పనులు కూడా మొదలుపెట్టింది రేవంత్ టీమ్‌. సభస్థలి పరిశీలన కూడా పూర్తయింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు పంచాయితీ కాంగ్రెస్‌లో మిగిలే ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మల్‌రెడ్డి రంగారెడ్డిది. పార్లమెంట్ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిధిలోనిది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రేవంత్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి.

14న వెంకటరెడ్డి ఇంటికి రేవంత్‌?

రేవంత్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాక.. ఈ ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకున్నది లేదు. వెంకటరెడ్డిని కలిసేందుకు పీసీసీ చీఫ్‌ ప్రయత్నించినా.. నో.. రావొద్దు అనేశారట ఈ భువనగిరి ఎంపీ. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోరా సభ ఉండటంతో.. ఈ ఇద్దరు నాయకుల మధ్య పంచాయితీ చర్చల్లోకి వస్తోంది. ఇద్దరి మధ్య సఖ్యతకు కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆ పనిని మల్‌రెడ్డి రంగారెడ్డి భుజానకెత్తుకున్నట్టు సమాచారం. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సైతం వెంకటరెడ్డిని కలుపుకొని వెళ్లారని సూచించారట. దాంతో ఈ నెల 14న వెంకటరెడ్డి ఇంటికి వెళ్లాలని డిసైడ్‌ అయ్యారట రేవంత్‌.

ఇబ్రహీంపట్నం సభ కంటే ముందే భేటీ?

14న జరిగే మీటింగ్‌లో ఏదో విధంగా మైత్రీ కుదిర్చి.. సమస్యను సర్దుబాటు చేస్తామనే నమ్మకం కాంగ్రెస్‌ నాయకుల్లో కనిపిస్తోంది. అయితే వెంకటరెడ్డి దానికి ఒప్పుకొంటారా అన్నది డౌటే. పైగా ఇబ్రహీంపట్నం సభ తేదీని మార్చాలని వెంకటరెడ్డి కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రేవంత్‌ టీమ్‌ డైలమాలో పడిందట. 18న సభ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. తేదీ మార్చమడం వారికి రుచించడం లేదట. అందుకే సభ కంటే ముందే భువనగిరి ఎంపీ ఇంటికి వెళ్లి సమస్య సెటిల్‌ చేసుకుంటే మంచిదని పార్టీ నేతలు రేవంత్‌కు సూచించారట. ఆ విధంగా 14 ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.

ఇద్దరి మధ్యా మైత్రికి మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవ!

రేవంత్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. భేటీ అయ్యే వరకు సస్పెన్సే. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇద్దరూ భేటీ అయితే కాంగ్రెస్‌లో అదో పెద్ద పరిణామం. మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ దిశగా ఎంత వరకూ సక్సెస్‌ అవుతారో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ కూడా జరుగుతున్న పరిణామాలపై సీరియస్‌గా ఉన్నారట. భువనగిరి లోక్‌సభకు జగ్గారెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఇబ్రహీంపట్నానికి సంబంధించిన సమాచారం ఆయనకు ఇంకా ఇవ్వలేదట. వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు పని విభజన చేసి.. కీలక సభల సమాచారం ఇవ్వకపోతే ఎలా అన్నది వారి వాదన. పైగా తమను ఉత్సవ విగ్రహాలుగా చూస్తున్నారా అన్నది జగ్గారెడ్డి ప్రశ్న. ఇంద్రవెల్లి సభకు జ్వరం పేరుతో జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఇబ్రహీంపట్నం సభ సమాచారం ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణంగా చర్చ జరుగుతోంది.

ఇంద్రవెల్లి సభకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతల మధ్య పంచాయితీ నడిచింది. దానిని పీసీసీ చీఫ్‌ అధిగమించారు. అందుకే ఇబ్రహీంపట్నం సభ ముందు ఎదురవుతున్న సవాళ్లను ఆయన ఎలా ఓవర్‌టేక్‌ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. మరి.. కాంగ్రెస్‌లో ఈ గిల్లికజ్జాలకు ముగింపు ఎప్పుడో?

Exit mobile version