Site icon NTV Telugu

పోటీ లేక పదో.. పాతికో రాకుండా పోయాయా…?

ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక ఆ జిల్లాలోని లోకల్‌ బాడీ ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లిందా? ఇతర జిల్లాల్లోని క్యాంపులు ఈర్ష్యగా మారాయా? పోటీ లేకపోవడంతో పదో.. పాతికో రాకుండా పోయాయని వాపోతున్నారా? వాళ్ల నారాజ్‌కు కారణం ఇదేనా?

పోటీ ఉంటే పదో.. పరకో వస్తుందని ఆశించారట..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండుకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోటీలేకుండా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గులాబీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లయిన.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ… కౌన్సిలర్లు మాత్రం నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌.. బీజేపీలు పోటీలో లేకపోవడం, స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించి విత్‌డ్రా చేయించేశారు. దీంతో పదో.. పరకో వస్తుందనుకున్న ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తమకు డిమాండ్ పెరగకపోగా.. పలకరించే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారట.

క్యాంపుల్లో ఓటర్ల రాజభోగాలు చూసి ఈర్ష్య..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటి ఉన్నచోట నడుస్తున్న క్యాంప్ రాజకీయాలు.. గోవా, బెంగుళూరుల్లో వారు చేస్తున్న హంగామా వీడియోలు చూసి.. తమకా అదృష్టం లేదని ఫీలవుతున్నారట. ఇక్కడ కూడా పోటీ ఉండి ఉంటే గోవా, బెంగళూరు కాకపోయినా.. ఏదో ఒక ఆలయానికి వెళ్లేవాళ్లమని ఎంపీటీసీ సర్కిళ్లలో చర్చ జరుగుతోందట. జిల్లాలో మొత్తం 1445 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది అధికారపార్టీకి చెందినవాళ్లే. ఎంపీటీసీలే సింహభాగం. విధులు, నిధులు లేవని తీవ్ర అసంతృప్తితో ఉన్నారంతా. ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ డిమాండ్లను ముందుపెట్టి.. తమలో ఒకరిని బరిలో నిలిపేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. విషయం పసిగట్టిన ఎమ్మెల్యేలు.. వారిని నిలువరించారు. పార్టీ చెప్పినట్టు నడుచుకోవాలని తలంటేశారట. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో తమకొచ్చే చారానో.. బారానో రాకుండా పోయాయని ఎమ్మెల్యేలకు చెప్పి బాధపడినట్టు తెలుస్తోంది.

ఉడతా భక్తిగా ఏదైనా చేయడానికి ఎమ్మెల్సీలు ససేమిరా..!

ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉడతా భక్తిగా ఏదైనా చేద్దామని ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి లైట్‌ తీసుకున్నట్టు సమాచారం. దీంతో తమ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని సంకట స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఎంపీటీసీలు.. ఇతర ఓటర్లు.. ఎమ్మెల్సీలపై గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. తమ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్లు ముఖం చాటేయడంపై నిప్పులు చెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ సెగలను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎలా చల్లారుస్తారో చూడాలి.

Exit mobile version