Site icon NTV Telugu

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను ఊరిస్తున్న కేబినెట్‌ బెర్త్‌…!

ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్‌ బెర్త్‌ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వాలంటే కీలకంగా మారే సమీకరణాలేంటి? ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నవారిని కదుపుతారా? ఇంతకీ ఏంటా జిల్లా?

ఈసారి కేబినెట్‌లో చోటు కోసం నేతలు గట్టి ప్రయత్నాలు

రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చెప్పారు ఏపీ సీఎం జగన్‌. ఇప్పుడా సమయం సమీపిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలలో కదలికలు.. చర్చలు మొదలయ్యాయి. కేబినెట్‌ నుంచి ఎవరు ఔట్‌.. ఎవర్‌ ఇన్‌ అనే చర్చ ఆసక్తి కలిగిస్తోంది. హామీలు పొందినవారి సంఖ్య అధికార పార్టీలో ఎక్కువగానే ఉంది. ఇక సీనియర్ల మాట సరేసరి. అప్పుడెలాగో ఛాన్స్‌ మిస్‌ అయింది. ఇప్పుడు వదులుకోకూడదని గట్టి పట్టే పడుతున్నారట. అయితే జిల్లాల్లో ఉన్న సమీకరణాల వల్ల ఎవరూ గట్టి నమ్మకానికి రాలేకపోతున్నారట నాయకులు. ఆ కోవలోకే వస్తుంది నెల్లూరు జిల్లా.

సేఫ్‌ జోన్‌లో ఉన్న మంత్రులు అనిల్‌, గౌతంరెడ్డి!

అనిల్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి కేబినెట్‌లో ఉన్నారు. వీరిద్దరూ సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిని మార్చకుండా కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తారా? అలా ఇస్తే ఎవరికి పదవీయోగం ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నవారిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు.

మొదటి నుంచి జగన్‌కు మద్దతుగా ఉండటం కాకాణికి కలిసొస్తుందా?

తొలివిడతలోనే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కాకాణి. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ దఫా తప్పకుండా కేబినెట్‌లో చోటు కల్పిస్తారని కాకాణి వర్గం ఆశలు పెట్టుకుందట. పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలు.. ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే శైలి.. మొదటి నుంచి జగన్‌కు మద్దతుగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా లెక్కలేసుకుంటున్నారట.

సామాజిక సమీకరణాలపై సంజీవయ్య ఆశలు

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎస్సీ కోటాలో మంత్రి పదవి తప్పకుండా వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారట. మేకపాటి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ విషయంలో అక్కరకు వస్తాయని అనుకుంటున్నారట. ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో సూళ్లూరు పేట నుంచి భారీ మెజారిటీ రావడం.. మున్సిపల్‌ ఎన్నికల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలక సంఘాల్లో వైసీపీ జెండా రెపరెపలాడించడం కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నారు సంజీవయ్య.

సీనియర్‌ కోటాలో పిలుపు వస్తుందని ఆనం ఆశ!

ఆ మధ్య సంచలన కామెంట్స్‌తో పార్టీలో కాక పుట్టించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం కేబినెట్‌ రేస్‌లో ఉన్నారు. వచ్చే రెండున్నరేళ్లూ వైసీపీకి రాజకీయంగా కీలకం కాబట్టి సీనియర్‌ అయిన తమ నేతకు తప్పకుండా పిలుపు వస్తుందని ఆనం శిబిరం ఆశతో ఉంది. అయితే గతంలో ఆనం చేసిన కామెంట్స్‌ను పక్కన పెట్టి మంత్రిని చేస్తారా అనే అనుమానం పార్టీలో ఉందట.

ఈ దఫా బెర్త్‌ ఖాయమని ప్రసన్నకుమార్‌రెడ్డి వర్గం ప్రచారం

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వైసీపీ ఏర్పడిన తర్వాత మొదటి ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మకాగా.. రెండో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి. అయితే వైసీపీని మొదటి నుంచి అంట్టిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్యే కావడంతో ఈదఫా కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఉన్నవారిని కదల్చకపోతే .. కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తారా?

ఇప్పటికే జిల్లా నుంచి కేబినెట్‌లో ఉన్నవారిని కదల్చకపోతే.. కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అన్న అనుమానాలు ఉన్నాయట. అనిల్‌ అటు ప్రతిపక్షంలో ఉండగా.. ఇటు అధికారం వచ్చిన తర్వాత కూడా టీడీపీని ఏకిపారేయడంలో ముందు ఉంటున్నారు. మొదటిసారే అయినప్పటికీ భారీ నీటిపారుదల శాఖ ఇచ్చినా వివాదాలు లేకుండా చేసుకుపోతున్నారు. ఈ లెక్కలు వేసుకుంటూ తొలిగించే 90 శాతంలో ఆయన ఉండటం అనుమానే. ఇక గౌతంరెడ్డి. నెల్లూరులో రెడ్డి మంత్రి తప్పనిసరి. ఆయన్ను తప్పిస్తే ఇంకో రెడ్డికే ఛాన్స్‌ ఉంటుంది. మరి ఆ రెడ్డి.. ఏ రెడ్డో..!

కొన్ని జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ లెక్కను పరిగణనలోకి తీసుకుంటే.. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒకరికి ఛాన్స్‌ ఉండొచ్చు. అయితే నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. పదిమంది ఎమ్మెల్యేలలో 3 బెర్త్‌లు ఇస్తారా? అయితే ఆ లక్కీ ఛాన్స్ ఎవరిదన్నది చూడాలి.

Exit mobile version