ఆ జిల్లాలో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదట. అదేపనిగా ఆరోపణలు.. చర్యలు కామనైపోయాయి. ఒకప్పుడు చిన్న మెమో ఇస్తేనే గిల్టీగా ఫీలయ్యే సిబ్బంది.. ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు?
నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై ఆరోపణలు!
నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో పది స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న SIలు, CIలు, కానిస్టేబుళ్లపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. వేటు పడటం ఈ మధ్య సాధారణమైపోయింది. కొందరిని సస్పెండ్ చేస్తే.. ఇంకొందరిని ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తున్నారు. మరికొందరిని వీఆర్‌కు పంపుతున్నారు. నెలరోజుల వ్యవధిలోనే నలుగురు అధికారులపై ఆరోపణలు రావడంతో ఈ సబ్ డివిజన్‌లో అసలేం జరుగుతుందన్న చర్చ స్టార్ట్ అయింది.
అక్రమ దందాలకు ఊతం!
అక్రమ వసూళ్ల ఆరోపణలపై మర్రిగూడ SI క్రాంతి కుమార్‌ను ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. గతంలో ఆయన నేరేడుగొమ్ములో పనిచేస్తున్నప్పుడు సబ్సిడీ గొర్రెల అక్రమ రవాణాకు సహకరించారని విమర్శలు రావడంతో సస్పెండ్ చేశారు. ఇదే స్టేషన్‌లో SIగా పనిచేసిన నరేష్.. జంట హత్యలు.. అంతకుముందు జరిగిన ఘర్షణల్లో సరైన చర్యలు తీసుకోలేదని ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఆయనకంటే ముందు పనిచేసిన SI రవీందర్.. అక్రమ దందాలకు సహకరిస్తున్నారని అదేవిధంగా యాక్షన్ చేపట్టారు.
లాక్‌డౌన్ సమయంలో డబ్బుల వసూళ్లు?
కొండమల్లేపల్లి SIగా పనిచేసిన శ్రీనునాయక్.. అక్రమ వసూళ్లకు ఊతమిచ్చారనే ఆరోపణలు.. నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నారనే విమర్శలు రావడంతో సస్పెండ్ అయ్యారు. చింతపల్లిలో SI నారాయణరెడ్డిని వీఆర్‌కు పంపడానికి అక్కడ ఆయన చేసిన సెటిల్‌మెంట్లే కారణమట. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సిబ్బందిపై వేటు వేశారు. డిండి పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి SI కూర్మయ్యను వీఆర్‌కు పంపారు.
వాటాల పంపిణీపై సిబ్బంది మధ్య చర్చ?
ఈ విధంగా చాలా మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటూ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. కొందరు సీఐలు తమ పరిధిలోని SIల విధుల్లో తలదూరుస్తారట. CIa ఆధిపత్య ధోరణే దీనికి కారణంగా చెబుతారు. అలాంటి ఒక CI బదిలీకి రంగం సిద్ధమైందని పోలీస్‌వర్గాల్లో టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో కొందరు అధికారులు సాగించిన అక్రమ దందాలు.. వాటాల పంపిణీపై సిబ్బంది కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.
తీసుకుంటున్న చర్యల డోస్ సరిపోవడం లేదా?
ఉమ్మడి నల్లగొండ జిల్లా సిబ్బందిపై పోలీస్ బాస్ కన్ను!
జిల్లాలోని చుండూరు SI ఉపేందర్‌రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. నిడమానూరు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి.. ఇసుక దందాకు సహకరిస్తున్నారని వేటు వేశారు. ఇక్కడో గమ్మత్తు ఉంది. సిబ్బందిపై ఆరోపణలు వస్తే SP అస్సలు ఉపేక్షించడం లేదు. నిజానిజాలు తెలుసుకుని వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ చర్యల డోస్ సరిపోవడం లేదో.. లేక రాజకీయ నేతల అండ ఉందన్న ధీమానో కానీ కొందరు పోలీసుల తీరు మారడం లేదని టాక్. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గీత దాటిన అధికారులపై పోలీస్ బాస్‌ల కన్ను పడిందట. ఒక ఛాన్స్ ఇద్దాం. మారితే సరి..! లేదంటే ఏం చేయాలో అదే చేద్దామని అనుకుంటున్నారట. మరి.. సిబ్బంది దారికొస్తారో.. తమదారి అడ్డదారే అని రుజువు చేస్తారో చూడాలి.
