రెండు పదవులు.. రెండు డజన్ల ఆశావహులు. పాలమూరు జిల్లాలో హీట్ రాజేశారు. ఆ ఇద్దరికే మళ్లీ ఛాన్స్ ఇస్తారా.. లేక కొత్తవారికి అవకాశాలు దక్కుతాయా? పార్టీ ఈక్వేషన్స్ చెబుతున్నదేంటి?
ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇస్తారా?
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలిచారు. కూచుకుళ్ల తర్వాతి కాలంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇద్దరూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన వారే. ఒకటే సామాజికవర్గం. ఇద్దరిలో ఒక్కరికి మళ్లీ ఛాన్స్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని పార్టీలో చర్చ..!
ఎమ్మెల్సీగా కంటే ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్టు కల్వకుర్తిలో ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక దామోదర్‌రెడ్డి తనకు కాకుండా తన కుమారుడికి అవకాశం కల్పించాలని కోరుతున్నారట. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరే సమయంలో టీఆర్ఎస్ పెద్దలు తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌కు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారట కూచుకుళ్ల. ఈ విషయంలో తాజా మాజీల లెక్కలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్సీలుగా ఈ దఫా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది.
లోకల్ బాడీలో టీఆర్ఎస్‌కు 1,049 మంది ఓటర్లు..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు 1455 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్‌కు చెందిన లోకల్ ప్రజాప్రతినిధులే ఒక వెయ్యి 49 మంది. సింహభాగం ఓటర్లు అధికారపార్టీకి చెందినవాళ్లే కావడంతో రెండు స్థానాల్లో గెలుపు తమదే అనే ధీమా గులాబీ పార్టీలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో నిలిస్తే మాత్రం ఓటు హక్కు కలిగిన స్థానిక ప్రజాప్రతినిధులకు డిమాండ్ పెరుగుతుంది.
ఉద్యమ సమయం నుంచీ టీఆర్ఎస్‌లో ఉన్నవారు ఎదురుచూపులు..!
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లకు ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నుంచి పదవీయోగం దక్కని.. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వర్గాలు.. నాయకులు తమకు సీట్లు కేటాయించాలని కోరుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఉమ్మడి జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య , బాదామి శివకుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మక్తల్ నుంచి దేవరి మల్లప్ప, గద్వాల జిల్లా నుంచి గట్టు తిమ్మప్ప, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి తదితరులు ఆశావహులుగా ముందుకొస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు నిధులు, విధులు లేక అసంతృప్తితో ఉండటంతో ఆ వర్గాలను సంతృప్తి పర్చేందుకు వారిలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరి.. ఆశావహుల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.
