కాంగ్రెస్‌లో తన్నులాట.. ఫిర్యాదుల పర్వాలు కొత్తేమీ కాదు. అలాంటి పార్టీలో ఆయన్ను ఎవరైనా విమర్శించాలి అంటే వెనకా ముందు ఆలోచిస్తారు. ఆ జిల్లాలో మాత్రం ఏకంగా ఆయన్ని నానా మాటలు అనేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో పెరిగిపోతోంది.
వీహెచ్‌ను అడ్డుకున్న ప్రేమ్‌సాగర్‌రావు వర్గం..!
వరి రైతుల సమస్యలపై తెలంగాణలో వరసగా ఉద్యమిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టి.. కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. అలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంచిర్యాల వెళ్లారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. అక్కడ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధం కాగా.. VH, రాములు నాయక్‌లను.. మరో కాంగ్రెస్ నేత ప్రేమ్‌సాగర్‌రావు వర్గం అడ్డుకుంది. అంతేకాదు.. సొంత పార్టీ నాయకులను దూషించిందట.
పార్టీ ఇంఛార్జ్ ఠాగూర్‌కు ఫోన్‌లో వీహెచ్ ఫిర్యాదు..!
సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే.. పోలీసులు అడ్డుకోవడం చూస్తాం. కానీ.. అక్కడ మాత్రం సొంత పార్టీ నాయకులను కాంగ్రెస్‌లోని మరో వర్గం అడ్డుకోవడం విశేషం. ఈ పరిస్థితి చూసి VH, రాములు నాయక్‌లకు చిర్రెత్తికొచ్చిందట. అక్కడి నుంచే AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారట. VH, రాములు నాయక్ ఇద్దరూ వెంట వెంటనే ఫోన్ చేసి గట్టిగానే మాట్లాడినట్టు సమాచారం.
ఠాగూర్ నుంచి ఫోన్లు రావడంతో రేవంత్ అలర్ట్..!
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన వర్గంతో.. నచ్చని వారిపై దాడులు చేయిస్తున్నారన్నది కాంగ్రెస్ హైకమాండ్‌కు వెళ్లిన ఫిర్యాదు. సమస్య తీవ్రతను గుర్తించారో.. లేక సమస్య ముదురు పాకాన పడకుండా చూడాలనుకున్నారో కానీ.. వెంటనే పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారట ఇంఛార్జ్ ఠాగూర్. మంచిర్యాలలో ఏం జరిగిందో వాకబు చేయాలని కోరారట. ఈ రగడపై ఠాగూర్‌కు వరసగా ఫిర్యాదులు వెళ్లడంతో రేవంత్ సైతం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే వీహెచ్‌కు ఫోన్ చేసి మాట్లాడారట.
ప్రేమ్‌సాగర్‌రావు అండ్ కోపై చర్యలకు వీహెచ్ పట్టు..!
ప్రేమ్‌సాగర్ రావుపైనా.. ఆయన వర్గంపైనా చర్యలు తీసుకోవాలన్నది AICCకి అందుతున్న ఫిర్యాదుల సారాంశం. అసలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కానీ.. అక్కడి నేతలపై ఫిర్యాదులు ఎక్కువే. ఇప్పటికే ప్రేమ్‌సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. ఆ పంచాయితీలు కొలిక్కి వస్తున్న తరుణంలో నేరుగా వీహెచ్‌తోనే గొడవ పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్‌రావు. పైగా.. ఈ గొడవను వీహెచ్ ఇక్కడితో వదిలిపెట్టేలా లేరు. ప్రేమ్‌సాగర్‌రావుతోపాటు.. నాటి ఆందోళనలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని PCCపై గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారట.
బీసీ, ఎస్టీలను అడ్డుకోవడం తప్పుడు సంకేతాలు పంపుతుందని వాదన..!
మంచిర్యాలలో రైతులకు మద్దతుగా నిరసనలు చేయడానికి బీసీ, ఎస్టీ నాయకులు వెళ్లినప్పుడు.. వారినే అడ్డుకోవడం.. దూషించడం తప్పుడు సంకేతాలు పంపుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారట. అందుకే ఆందోళన చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారట. మరి.. మంచిర్యాల రగడకు పార్టీ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
