గ్రేటర్‌లో ఆ మేడమ్ స్పెషల్. మాములు స్పెషల్ కాదు.. వేరీ వేరీ స్పెషల్. బదిలీ అయినా.. గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్పించుకోగల ‘పవర్’ ఉందని నిరూపించారు. మరోసారి ఉద్యోగవర్గాల్లో చర్చగా మారారు ఆ అధికారి. ఉన్నచోటు నుంచి సీటు కదలకుండా పావులు కదిపిన ఆ మేడమ్ ఎవరు?
బదిలీ ఆగడానికి .. టీజీవో ప్రెసిడెంట్ పోస్టా? ఇంకేదైనా ఉందా?
వి. మమత. GHMCలో జోనల్ కమిషనర్. ఈ హోదా కంటే.. ఉద్యోగవర్గాల్లో మమత మరోరకంగా పాపులర్. తెలంగాణ గెజిటెడ్ సంఘం.. TGO అధ్యక్షురాలు. ఉద్యోగవర్గాల్లో మేడమ్ పవర్ ఫుల్ అని చెవులు కొరుక్కుంటారు కానీ.. ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసినా.. ఆ ఉత్తర్వులు మార్పించుకోగలరని తాజాగా మరోసారి నిరూపించి చర్చల్లోకి వచ్చారు. ఇందుకు TGO అధ్యక్షురాలు అన్న హోదా కారణమా.. లేక ఇంకేదైనా ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
మమత బదిలీ ఆగడంతో ఒక్కటే చర్చ..!
GHMCలో నాలుగు జోన్ల కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం 795 జీవో ఇచ్చింది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న మమతను ఎల్బీ నగర్ జోన్‌కు బదిలీ చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఏమైందో ఏమో.. సాయంత్రానికి మరో 797 నెంబర్ జీవో బయటకు వచ్చింది. మమతను కూకట్‌పల్లిలోనే కొనసాగిస్తూ.. ఇక్కడకు రావాల్సిన పంకజ అనే మరో ఆఫీసర్‌ను ఎల్బీనగర్‌కు పంపారు. అంతే అప్పటి వరకు ట్రాన్స్‌ఫర్లు కామన్ అనుకున్నవారు కాస్తా.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆసక్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.
గతంలోనూ ఒకసారి ట్రాన్స్‌ఫర్‌పై రగడ..?
TGO ప్రెసిడెంట్‌గా అధికార, ఉద్యోగవర్గాల్లో మమత గురించి చర్చించుకున్నా.. ఈ దఫా మాత్రం బదిలీ ఆగడం ద్వారా ప్రత్యేక చర్చల్లోకి వచ్చారామె. బదిలీ ఆగడం.. కొత్త జీవోపై ప్రభుత్వ వర్గాల ఇచ్చే వివరణ ఉద్యోగులకు పెద్దగా కనెక్ట్ కావడం లేదట. ఎవరైనా ఈ మాట ప్రస్తావిస్తే.. ఇంకోమాట చెప్పండి.. అని సెటైర్లు వేస్తున్నారట. గతంలో కూడా డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నప్పుడు చందానగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు బదిలీ చేస్తే అక్కడికి వెళ్లలేదట మమత. వెంటనే శేరిలింగంపల్లికి బదిలీ చేయించుకోవడంతో కొంత చర్చ జరిగింది. ఇప్పుడు మాత్రం అప్పటి చర్చను మించి చెవులు కొరుక్కుంటున్నారు ఉద్యోగ వర్గాలు.
కావాలని కుర్చీ కదిలించారా?
మేడమ్.. చాలా పవర్‌ఫుల్. ట్రాన్స్‌ఫర్ ఆగడానికి ఎక్కడ స్విచ్ నొక్కాలో బాగా తెలుసని ఒక్కటే గుసగుసలు. అంతా బాగానే ఉన్నా.. తెలిసి తెలిసి మమత కుర్చీని కదిల్చే ప్రయత్నం చేసింది ఎవరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరా పనిచేసింది? అన్నది చర్చగా మారింది. రొటీన్ బదిలీ అయితే ఫర్వాలేదు. కానీ.. విషయం తెలిసి కూడా కుర్చీ కదిలించే ప్రయత్నం చేశారని బయట పడితే మాత్రం.. కొత్త చర్చ ఖాయమని ఒక్కటే చెవులు కొరుకుడు. మరి..ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగుతుందో.. ఇంకా మలుపులు తిరుగుతుందో చూడాలి.
