తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. పీసీసీ వస్తుందని.. ఇన్నాళ్లూ కాన్ఫిడెన్స్‌తో ఉన్న వెంకన్నకి అధిష్ఠానం హ్యాండ్ ఇచ్చింది. ఆయన బరస్ట్ అయ్యారు కూడా. మరి.. రాజకీయంగా అన్నదమ్ముల దారెటు? ఇద్దరూ ఒకేవైపు అడుగులు వేస్తారా.. ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా?
కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు?
తెలంగాణ PCC నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన…ఎయిర్‌పోర్టులో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పదవులు అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలు బయట పెడతానని చెప్పారాయన. పార్టీ కార్యకర్తలు తన రాజకీయ పయనాన్ని నిర్దేశిస్తారని కూడా ఓ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు అన్న చర్చ మళ్లీ ఊపందుకుంది.
కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని గతంలోనే రాజగోపాల్‌రెడ్డి కామెంట్
పార్టీ మారే ఆలోచనలో ఎంపీ కోమటిరెడ్డి ఉన్నట్టు ప్రచారం ఈసారి కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఆయన సోదరుడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ పయనంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో, దేశంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని గతంలోనే ప్రకటించి సంచలనం రేపారాయన. కాకపోతే పీసీసీ నియామకం తర్వాత వెంకటరెడ్డి వైఖరికి భిన్నంగా స్పందించారు సోదరుడు. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా పార్టీ ప్రకటించిందన్నది రాజగోపాల్‌రెడ్డి కామెంట్. ఇందులో వివాదం ఏదీ లేదని తెలిపారు. PCCపై అన్నదమ్ములిద్దరూ భిన్నంగా స్పందించినా.. వారి రాజకీయ భవిష్యత్‌పై చర్చ ఆగడం లేదు. బీజేపీలోకి వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే అనుకున్నా.. అది ఎప్పుడన్నది క్లారిటీ లేదు.
మళ్లీ ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి.. పార్టీ పెద్దలను కలుస్తారా?
ఎంపీ వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాలేదన్న కోపంలో ఉన్నారు. తన ఆవేదనంతా మీడియా ముందు వెళ్లగక్కారు. సోనియా, రాహుల్ గాంధీలను ఏమీ అనను అని చెబుతూనే.. ఇంఛార్జ్ ఠాగూర్‌తోపాటు.. పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూస్తోన్న KC వేణుగోపాల్‌పై రుసరుసలాడారు. ఇవన్నీ చూసిన వారికి .. పొలిటికల్ లైఫ్‌పై వెంకటరెడ్డి ఇంకా క్లారిటీకి వచ్చినట్టు లేదని తెలుస్తోంది. మళ్లీ ఢిల్లీ వెళ్లి రెండురోజులు అక్కడే ఉంటారాయన. ఇప్పటికే AICC ప్రముఖులు వెంకటరెడ్డితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. AICCలో ఆయనకు పదవులు ఆఫర్ చేస్తున్నారట. అయినప్పటికీ ఎంపీ సంతృప్తి చెందడం లేదని టాక్. పైగా ఢిల్లీ టూర్‌లో కాంగ్రెస్ పెద్దలను కలుస్తారో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ పర్యటన తర్వాత వెంకటరెడ్డి స్పష్టత ఇస్తారా?
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారన్నది కొందరి అభిప్రాయం. వెంకటరెడ్డి మాత్రం దానికి అవునని కానీ.. కాదని కానీ స్పందించడం లేదు. ఢిల్లీ పర్యటన తర్వాత స్పష్టత ఇవ్వొచ్చని అనుకుంటున్నారట. ఢిల్లీలో జాతీయ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్న తర్వాత తన ఆలోచనలను కార్యకర్తలకు చెప్పే అవకాశం ఉందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదమ్ములిద్దరూ కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరన్న సంగతిని గుర్తించిన పార్టీ పెద్దలు డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారట. మరి.. అధిష్ఠానం వెంకటరెడ్డిని ఒప్పిస్తుందో లేక ఆయనే తేల్చుకుంటారో చూడాలి.
