Site icon NTV Telugu

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగేది ఎవరు? బలమైన వ్యక్తి అనుకున్న నేత చేతులు ఎత్తేశారా? పార్టీ గాలం వేసిన వ్యక్తి కారెక్కేశారా? ప్రధానపక్షాలు క్లారిటీతో ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి? అభ్యర్ధిని తేల్చుతుందా.. నాన్చుతుందా?

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?

హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు పార్టీలు సిద్ధం. ప్రచారం హోరెత్తిపోతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. అనేక వడపోతల తర్వాత TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్‌ను బరిలో నిలిపింది టీఆర్‌ఎస్‌. ప్రధాన పోటీదారులు ఎవరన్నది క్లారిటీ వచ్చేసింది. ఇక అభ్యర్థిని ప్రకటించాల్సింది కాంగ్రెస్సే. ఇంద్రవెల్లి సభతో ఊపులో ఉన్నా.. హుజురాబాద్‌ అభ్యర్థి ఎంపికలో మాత్రం కాంగ్రెస్‌ కన్ఫ్యూజన్‌లో ఉంది. ఎవరిని బరిలో నిలపాలి? సరైన అభ్యర్థి ఎవరు? అనే లెక్కలు తేగడం లేదు.

2023 నాటికి ఓ నేతను పరిచయం చేయాలన్నదే లక్ష్యమా?

కాంగ్రెస్‌ పార్టీ నుంచి హుజురాబాద్‌ ఉపఎన్నిక ఇంఛార్జ్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితి లేదన్నది గాంధీభవన్‌ వర్గాలు చెప్పేమాట. కానీ.. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను నిలబెట్టుకోవాలి. 2023 నాటికి ఒక నాయకుడిని హుజురాబాద్‌కు పరిచయం చేయడానికి ఉపఎన్నికను వేదికగా చేసుకోవాలనే ఆలోచనైతే ఉందట.
కాంగ్రెస్ నుండి కౌశిక్ రెడ్డిని బహిష్కరించిన తర్వాత అభ్యర్థి కోసం సెర్చింగ్‌ మొదలైంది.

ఇద్దరు మాజీ మంత్రులు కుటుంబాలపై కాంగ్రెస్‌ కన్ను!

ఈ దఫా బై ఎలక్షన్‌లో ఓ NRIని పోటీ దించాలని చూస్తోంది కాంగ్రెస్‌. ఆయన ఇంకా అవుననీ.. కాదని సమాధానం లేదట. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలో దింపడంతో కాంగ్రెస్‌ రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ పెట్టిందట. హుజురాబాద్‌కే చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడి కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అది వర్కవుట్‌ అవుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. మరో మాజీ మంత్రి కుటుంబం నుంచి క్యాండిడేట్‌ను వెతికే పనిలో పడింది. ఆ మాజీ మంత్రి కుటుంబం అధికారపార్టీలో ఉన్నప్పటికీ వారితో సంప్రదింపులు మొదలయ్యాయట. ఉపఎన్నికకు కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ అభ్యర్థిపై ఫోకస్‌ చేయడం లేదు. పీసీసీ చీఫ్ చూసుకుంటారనే లెక్కల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఓటు బ్యాంక్‌ చెదిరిపోకుండా కాంగ్రెస్‌ వ్యూహం!

దుబ్బాక ఉపఎన్నికలో.. బలంలేని చోట హడావుడి చేయడం వల్ల కాంగ్రెస్‌కు ఎక్కువ డ్యామేజీ అయిందనే అభిప్రాయంలో రేవంత్‌ ఉన్నారట. అందుకే హుజురాబాద్‌లో ఎక్కువ సందడి చేయకుండా.. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడానికే ఫోకస్‌ పెట్టబోతున్నట్టు సమాచారం. అక్కడ ఆర్థికంగా.. అంగబలం పరంగా టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఢీకొట్టే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నది సుప్పష్టం. అందుకే కాంగ్రెస్‌కు సంప్రదాయంగా వచ్చే ఓటు బ్యాంక్‌ను చెదిరిపోకుండా చూడాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చాకే అభ్యర్థిపై కాంగ్రెస్‌ ప్రకటన చేయొచ్చని అనుకుంటున్నారు. మరి.. కాంగ్రెస్‌ రచిస్తున్న ఈ వ్యహం ఎంత వరకు ఆ పార్టీని హుజురాబాద్‌లో నిలబెడుతుందో చూడాలి.

Exit mobile version