ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయ్. ఎప్పుడూ రాజకీయాలు, ఎత్తుగడలు మాట్లాడే ఆయన.. ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచీ. అంతర్మథనంలో ఉన్న సామాజికవర్గానికి దిక్సూచిగా మారాలనే ఆలోచన ఉందా? లేక రాజకీయాల్లో చురుకైన పాత్రకు వేసిన వ్యూహమా?
గంటా చూపు జనసేన వైపు అని పుకార్లు షికారు..!
గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నరేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం ఎక్కడుంటే గంటా అక్కడ ఉంటారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో జరిగే చర్చ. అందుకు భిన్నంగా ఈసారి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. వాస్తవానికి గంటా వైసీపీలో చేరతారనే గట్టి ప్రచారం చాలాకాలం నడిచింది. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ఆయన బహిరంగంగానే స్వాగతించారు. పరిపాలనా రాజధానిగా విశాఖకు తప్ప మరో నగరానికి ఆ అర్హత లేదని చెప్పుకొచ్చారు. గంటా కామెంట్స్‌పై అప్పట్లో టీడీపీలో చర్చ జరిగింది. ఆ తర్వాత గంటా చూపు జనసేనవైపు అని పుకార్లు షికారు చేశాయి.
టీడీపీలో యువ నాయకుడి ఆధిపత్యం భరించలేకపోతున్నారట..!
చిరంజీవితో అనుబంధం.. జనసేనకు పటిష్టమైన నాయకత్వం అవసరమనే కోణంలో ఆయన జనసైనికుడు అవుతారని టాక్ వినిపించింది. గంటా సైతం సన్నిహితుల అభిప్రాయాలు తీసుకోవడంతో ఇక జనసేనలో చేరికకు ముహూర్తమే ఆలస్యం అనేస్ధాయికి చర్చ వెళ్లింది. అయితే వాళ్లు వద్దనుకున్నారో.. ఈయనే వెళ్లలేదో ఆ ప్రయత్నాలు ఫలించ లేదు. అలాగని, గంటా టీడీపీలోనూ యాక్టివ్‌గా లేరు. చంద్రబాబు ఆదేశాలను తప్ప పార్టీలో మరే నాయకత్వాన్ని గౌరవించాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయంగా చెబుతారు. పరోక్షంగా పార్టీలో యువనాయకుడి ఆధిపత్యం భరించడం కష్టమై గంటా దూరంగా ఉంటున్నారనేది అంతర్గత చర్చ.
రంగా విగ్రహావిష్కరణ సభలో కాపులంతా ఏకం కావాలని పిలుపు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో గంటా పేరు మార్మోగింది. తర్వాత ఏమైందో ఏమో మళ్లీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జరిగారు. టీడీపీలో ఉండీ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సమయంలోనూ గంటా ప్రజెన్స్ లేకుండా పోయింది. తాజాగా మరో బహిరంగ వేదికపైకి వచ్చారు గంటా. అది కూడా వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ సభతో. కాపు సామాజికవర్గం భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని గంటా శ్రీనివాస్ ఆ సభలో చెప్పారు. కాపులంతా ఏకం కావాలని.. రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి.. బలోపేతం కావడానికి తాను కృషి చేస్తానని అన్నారు. పాయకరావుపేట మండలం గుంటపల్లిలో జరిగిన ఈ సభ వేదిక నుంచి ఆయన చేసిన కామెంట్స్ రాజకీయాల్లో చర్చగా మారాయి.
హైదరాబాద్‌లో కాపు ముఖ్యనేతలతో భేటీ..?
ఈ చర్చకు కొనసాగింపుగానే హైదరాబాద్‌లో ముఖ్య కాపునేతలతో సమావేశం నిర్వహించారు గంటా. మాజీ మంత్రి ఎత్తుగడల వెనక వ్యూహం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వ్యాఖ్యలు చేయడం.. అదే వేదికను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడు అనే ముద్ర వేసుకోవడం ద్వారా రాజకీయాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. గంటా ఎటువెళ్తే నాయకులు అటు మళ్లుతారనే అభిప్రాయం కలిగించడానికి ఆ ప్లాట్‌ఫార్మ్‌ను ఆయన ఎంచుకున్నారనే చర్చ నడుస్తోంది.
కొత్త ఏడాది రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారా?
వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేస్తారా?
నూతన సంవత్సరంలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని గంటా నిర్ణయించుకున్నట్టు సమాచారం. రొటీన్‌కు భిన్నంగా ఈ దఫా ఆయన పోటీచేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీ చేయడం రెండొందశాతం ఖాయమని మాజీ మంత్రి సన్నిహిత వర్గాల టాక్. అయితే ఏ పార్టీ నుంచి అనేది గోప్యత పాటిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పొత్తులు ఉదయిస్తాయని అనుకుంటున్నారు. ఆ పొత్తుల లాభనష్టాలను ముందే పసిగట్టిన గంటా.. కులం వ్యవహారం భుజానకెత్తుకున్నారని తెలుస్తోంది. వివిధ కారణాలతో రాజకీయంగా స్తబ్ధతగా ఉన్న నాయకులతో ఆయన సమావేశం కావడం చర్చగా మారింది. ఇదంతా ఉనికి కోసం చేసే ప్రయత్నమా? లేక నిజంగానే సామాజికవర్గానికి పెద్దదిక్కుగా మారాలనే ఆలోచన గంటా శ్రీనివాసరావులో ఉందా అనేది తేలాలి.
