Site icon NTV Telugu

ప్రసాదరావు వైఖరిలో వచ్చిన మార్పుపై వైసీపీ వర్గాల్లో చర్చ…

ఆ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు దాటింది. ఏడాదికాలం కరోనా ఖాతాలో కలిసిపోయింది. మిగిలిన టైమ్‌లో ఆయన యాక్టివ్‌గా ఉన్నది తక్కువే. ఉలుకు లేదు.. పలుకు లేదు. సీన్‌ కట్ చేస్తే గేర్‌ మార్చి.. స్పీడ్‌ పెంచారు. ఓ రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు. గెలిచినప్పటి నుంచి కామ్‌ ఉన్న ఆయన ఎందుకు వైఖరి మార్చుకున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

అప్పట్లో మంత్రి పదవి రాలేదని అలిగినట్టుగా ప్రచారం

ధర్మాన ప్రసాదరావు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన రూటే సెపరేటు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన స్ట్రాటజీ ఎప్పుడూ శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమే. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ధర్మాన ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మొదట్లో మంత్రి పదవి రాకపోవడం వల్లే అలిగారని అందరూ చెవులు కొరుక్కున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. తన పనేదో చేసుకుంటూ.. జిల్లా కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతేడాది కరోనా ఎంట్రీ తర్వాత పూర్తిగా క్యాంప్‌ ఆఫీస్‌కే పరిమితం. సీఎం జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో తళుక్కుమని మళ్లీ కామైపోయారు. కరోనా సెకండ్ వేవ్‌లో మా ఇంటికి మీరు రావొద్దు.. మీ ఇంటికి నేను రానంటూ ఏకంగా క్యాంప్‌ ఆఫీస్‌కు తాళాలు వేశారు.

కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా పర్యటనలు

నిన్న మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న ధర్మాన ఇప్పుడు ఒక్కసారిగా టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నియోజకవర్గ పరిధిలో కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా పర్యటనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ జనాలకు దూరంగా ఉన్న ఆయన.. కర్ఫ్యూ ఆంక్షలను సడలించడంతో వారం రోజులుగా అందరినీ చుట్టేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న పరామర్శలు.. మొదలుపెట్టాల్సిన అభివృద్ధి పనులు.. ఇలా అన్నింటి దగ్గరా ప్రత్యక్షమవుతున్నారు ధర్మాన. కొబ్బరికాయలు కొట్టడం.. శంకుస్థాపననలు.. ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా మారిపోయారట.

కేబినెట్‌ రేస్‌లో ఉన్నట్టు సంకేతాలిస్తున్నారా?

ధర్మానను ఈ స్పీడ్‌లో చూస్తున్నట్టు కేడర్‌ ఉబ్బితిబ్బిబ్బు అవుతోందట. సడెన్‌గా దూకుడు పెంచడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడున్న కేబినెట్‌కు రెండున్నరేళ్ల గడువు దగ్గర పడుతుండటంతో.. తాను మంత్రివర్గ రేస్‌లో ఉన్నట్టు సంకేతాలిస్తున్నారా అని కొందరు అనుమానిస్తున్నారట. ప్రస్తుతం కేబినెట్‌లో ప్రసాదరావు అన్నయ్య ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే.. ప్రసాదరావును పరిగణనలోకి తీసుకుంటారని అనుకుంటున్నారట.

ధర్మాన దూకుడు వెనక లెక్కలు ఉన్నాయా?

కారణం ఏదైనా.. రెండేళ్లుగా కామ్‌గా ఉన్న ధర్మాన ప్రసాదరావు జనాల్లోకి రావడం మాత్రం చర్చగా మారింది. అయితే శ్రీకాకుళం టౌన్‌లో పట్టుచిక్కడం లేదని భావించి.. పట్టణంలో గ్రిప్ కోసం వేగంగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ రాజకీయవేత్తగా ముద్రపడి ప్రసాదరావు.. ఏ అడుగు వేసినా ఎన్నో లెక్కలు ఉంటాయని.. ఇప్పుడీ దూకుడు వెనక కూడా బలమైన కారణం ఉంటుందని భావించే వారి సంఖ్య తక్కువేం లేదు. మరి.. ధర్మాన అంతరంగం ఏంటో.. టాప్‌ గేర్‌లో ఎందుకు వెళ్తున్నారో చూడాలి.

Exit mobile version