Site icon NTV Telugu

ఎమ్మెల్యే చెవిరెడ్డి చెవిలో పూలు పెట్టి కోట్లు కొట్టేసిన అధికారులు…

పేదలకు పట్టాల పంపిణీ.. ఆ నియోజకవర్గంలోని అధికారులకు అక్షయపాత్రగా మరిందట. భారీగానే నొక్కేసి.. వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాసులు దండుకుని.. ఎమ్మెల్యేకే చెవిలో పువ్వులు పెట్టారని పవర్‌లో ఉన్న పార్టీ కేడర్‌ చికాకు పడుతోందట. వారెవరో.. ఏం చేశారో.. ఈ స్టోరీలో చూద్దాం.

చంద్రగిరిలో 150 ఎకరాలు సేకరించిన అధికారులు!

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దఎత్తున భూసేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతోపాటు డీకేటీ భూముల నష్ట పరిహారానికి ఏ,బీ,సీ అని 3 కేటగిరీలుగా విభజించింది. భూమిలో లబ్ధిదారుడు ఉండి, డాక్యుమెంట్ క్లియర్‌గా ఉంటే ‘ఏ’ కేటగిరి కింద ఎకరాకు 69 లక్షలు చెల్లించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి రెవెన్యూ అధికారులు. అన్నదమ్ముల తగాదాలు, కోర్టు లావాదేవీలు, ఆన్‌లైన్‌ కరెక్షన్స్ ఉంటే ‘బీ’ కేటగిరి కింద ఎకరాకు 50 లక్షలు.. డీకేటీ ఉల్లంఘనలు ఉంటే పట్టా మార్చుకోవడం, సుదీర్ఘ అనుభవ పట్టాలేక పోవడం, పట్టా ఉన్న భూమి ఇతరులకు విక్రయించడాన్ని ‘సీ’ కేటగిరిలో చేర్చి ఎకరాకు 25 నష్టపరిహారం ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో 748 ఎకరాల్లో.. 25 వేల 630 మందికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఒక్క చంద్రగిరి మండలంలోనే 150 ఎకరాల భూమిని 232 మంది రైతుల నుంచి సేకరించారు. ఇక్కడే అధికారులు తమ బుర్రకు పదును పెట్టారట.

‘సీ’ కేటగిరి భూములకు ‘ఏ’ కేటగిరిలో పరిహారం చెల్లింపు?
హోదాను బట్టి రూ.కోట్లు.. రూ.లక్షలు వెనకేసుకున్నారట!
పిచ్చినాయుడుపల్లిలో రూ.2 కోట్లు బహుమతిగా ఇచ్చిన కాంట్రాక్టర్‌?

‘సి’ కేటగిరికి చెందిన లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకుని ‘ఏ’ కేటగిరి కింద నష్ట పరిహారం చెల్లించారట. అలా వచ్చిన మొత్తాన్ని సైలెంట్‌గా వాటాలు వేసుకుని పంచేసుకున్నారట. అధికారులు, ఉద్యోగుల హోదాను బట్టి కోట్లు.. లక్షలు వెనకేసుకున్నారని రెవెన్యూ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. పిచ్చినాయుడుపల్లిలో 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ బడా కాంట్రాక్టర్‌కు ఎంజాయ్మెంట్ ఇచ్చేశారట. ప్రతిఫలంగా 2 కోట్లు బహుమతిగా ఇచ్చారట ఆ కాంట్రాక్టర్‌. ఎకరాకు కోటి రూపాయలు వెచ్చించి ప్రభుత్వం డీకేటీ భూములను విక్రయిస్తుంటే.. ఏకంగా 25 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టడంతో స్థానిక వైసీపీ నేతలు కంగుతిన్నారట.

ఎం.కొత్తపల్లిలో అటవీ భూమినే ప్రభుత్వానికి అమ్మేశారు?

ఎం.కొత్తపల్లిలోని డీకేటీ భూములకు ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్‌ను కూడా కలిపి ప్రభుత్వానికే అమ్మేశారట. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అటవీ అధికారులు షాకయ్యారట. ఎమ్మెల్యే చెవిలో పడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. ఇక లాభం లేదనుకొని అవినీతి అధికారుల చిట్టా తెప్పించుకుని వారిపై చర్యలకు ఉపక్రమించారట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఈ స్కామ్‌లో ఒక డిప్యూటీ తాహశీల్దార్‌పై వేటు పడినా.. మిగలిన అధికారులు తమకేం కాదని చాలా ధీమాగా ఉన్నారట.

ఆకాశరామన్న పేరుతో రెవెన్యూ సిబ్బంది బాగోతాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

ఆ మధ్య ఇళ్ల పట్టాల పంపిణీ టైమ్‌లో చంద్రగిరి తహశీల్దార్‌ చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. ఇచ్చిన పట్టాలు తీసుకోవాలని లేదంటే వెనక్కి ఇచ్చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై స్థానికులు ఫైర్‌ అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారుల అక్రమాలపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయట. ఆకాశరామన్న పేరుతో పెద్దసంఖ్యలో ఉత్తరాలు రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారుల తీరుపై ప్రజలతోపాటు వైసీపీ కేడర్‌ కూడా విసుగెత్తిపోయిందట. ఎమ్మెల్యే చెవిరెడ్డికి చెప్పుకొని లబోదిబోమంటున్నారట. ఎంతైనా భూముల కిటుకులు తెలిసిన రెవెన్యూ అధికారులు భారీగా గుటకేశారని చెబుతున్నారు. మరి.. వారిని పట్టుకునే ప్రయత్నాల్లో చెవిరెడ్డి ఏ మేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.

Exit mobile version