Site icon NTV Telugu

ఉత్తరాదికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌లను ఏపీకి తీసుకొస్తున్నారా?

పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఏపీ పరిపాలనలో ప్రస్తుతం ఆ రుచులపైనే చర్చ జరుగుతోంది. ఉత్తరాది వారి హవా ఎక్కువగా ఉందనే చర్చ జోరందుకుంది. IAS, IPSలతోపాటు.. కీలక పదవుల్లో సైతం రిటైరైన ఉత్తారాది అధికారుల పేర్లే వినిపిస్తున్నాయట. అదేలాగో ఇప్పుడు చూద్దాం.

నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ అంశంపై ఏపీలో ఆసక్తికర చర్చ

పరిపాలనలో నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ అనేది గతంలో ఉంది.. ఇప్పుడూ ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాలు లేదా ఫోకస్‌ ఉండే శాఖల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులే ఎక్కువగా ఉంటారని.. తెలుగువాళ్లు తక్కువగా ఉంటారనే చర్చ ఎప్పుడూ హాట్‌ టాపిక్కే. ముఖ్యమైన శాఖలు.. పదవులు విషయంలో పోటీ నెలకొంటే తప్ప ఈ తరహా చర్చ జరిగేది కాదు. ఆ విధంగా కొంత ఫోకస్‌ వచ్చేది. అయితే ఏపీలో ఇప్పుడు ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీటీడీ ఈవో పోస్ట్‌పై పెద్దగా చర్చకు ఆస్కారం ఇవ్వని సీఎం జగన్‌!

గతంలో చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవో పోస్టు భర్తీ సందర్భంలో ఇదే తరహా చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న అనీల్‌ కుమార్‌ సింఘాల్‌ నాడు ఈవోగా పనిచేశారు. టీటీడీ లాంటి కీలక పదవులను ఉత్తరాది వారికే దక్కేలా ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు లాబీయింగ్ చేసి వారి పంతం నెగ్గించుకునే వారనే టాక్‌ నడిచింది. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత టీటీడీ ఈవో స్థానాన్ని భర్తీ చేసే సమయంలోనూ ఈ చర్చ తప్పలేదు. అయితే అది మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సీఎం జగన్‌. ఎక్కవ చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే తెలుగువాడైన సీనియర్‌ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని నియమించేశారు.

తెలుగేతరులే ఎక్కువగా ఉంటున్నారని చర్చ!

ఇప్పుడు కొత్తరకం చర్చ జరుగుతోంది. సర్వీస్‌లో ఉండగా దక్కించుకునే పోస్టులు, శాఖలే కాకుండా.. రిటైర్‌ అయ్యాక తీసుకునే పదవుల్లోనూ తెలుగేతరులే ఎక్కువగా ఉంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని కీలక పోస్టులను వారే దక్కించుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు అధికారులు. సీఎస్‌గా పనిచేసిన నీలం సాహ్ని ప్రస్తుతం SECగా ఉన్నారు. సీఎస్‌గా ఆమె పదవీకాలం ముగిశాక రెండుసార్లు సర్వీస్‌ పొడిగించారు. మరో సీనియర్‌ ఐఏఎస్‌ ఫరీదాను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ను చేశారు. ఇంకో రిటైర్డ్‌ ఐఏఎస్‌ వీణాఈష్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ అయ్యారు. ఇంకొన్ని సంస్థలకు కూడా రిటైరైన అధికారులను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఉత్తరాదికి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌లను ఏపీకీ తీసుకొస్తున్నారా?

ఏపీకి చెందిన వారిలో రిటైర్‌ అయ్యాక అజేయ కల్లాం, శామ్యూల్‌ వంటి వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. సర్వీస్‌ ముగిశాక వైసీపీకి అనుబంధంగా పని చేస్తుండడంతో వీరి విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ మధ్య పోలీస్‌ కంప్లయిట్స్‌ అథారిటీ ఛైర్మన్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించారు. అయితే లేటెస్ట్‌గా నార్త్‌ సౌత్‌ అనే చర్చ మొదలుకావడానికి కారణం ఉందట. మరికొందరు రిటైరైన ఉత్తరాది అధికారులను ఏపీకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అందుకే IAS వర్గాలు ఈ అంశంపై గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయి.

Exit mobile version