తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కొందరు తమ్ముళ్లు సరిగా పనిచేయలేదా? అలాంటి నాయకులపై చంద్రబాబుకు నివేదిక చేరిందా? ఎవరి పనితీరుపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది? పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి నాయకులు ఎందుకు టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు?
రైతుల సభను పట్టించుకోని టీడీపీ నేతలపై కేడర్ గుర్రు..!
తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభను చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన కసరత్తు అంతా ఇంతాకాదు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలకు శక్తి ప్రదర్శన ద్వారా సమాధానం చెప్పాలని అనుకున్నారట. కానీ.. జిల్లాకు చెందిన కొందరు పార్టీ నేతల స్పందించిన తీరే పార్టీ కేడర్‌కు.. అధినాయకత్వానికి మింగుడుపడలేదని సమాచారం. తిరుపతిలో సూపర్‌హిట్ కావాల్సిన సభను జస్ట్ హిట్ చేశారని పసుపు శిబిరంలో చర్చ జరుగుతోందట. దీనికి కారణమైన నాయకులపై పార్టీ కేడర్ గుర్రుగా ఉందట.
తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నేతలు కాడి పడేశారా?
రైతుల సభకు నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి టీడీపీ కేడర్ పెద్ద సంఖ్యలోనే వచ్చిందట. నగరి ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్, చంద్రగిరి ఇంఛార్జ్ పులివర్తి నానిలకు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పార్టీ నేత నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి సహకరించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి గౌరవప్రదంగా టీడీపీ శ్రేణులు… జనం తరలి వచ్చారని టాక్. అదే టైమ్‌లో సభ జరిగిన తిరుపతి, ఈ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడుల నుంచి నేతలు పూర్తిగా కాడి పడేసినట్టు టీడీపీ శిబిరంలో విమర్శలు ఉన్నాయి.
ఆ మూడు నియోజకవర్గాల నేతలపై పార్టీ పెద్దలు సీరియస్?
తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నుంచి టీడీపీ కేడర్ తూతూ మంత్రంగానే వచ్చినట్టు పార్టీ నేతలు గుర్తించారట. తిరుపతి, సత్యవేడు నేతలైతే చేతులు ఎత్తేసినట్టు కేడర్ టాక్. ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బొజ్జల సుధీర్‌రెడ్డి, జేడీ రాజశేఖర్‌లపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సభకు పాతికవేల మంది వస్తేనే మంచి స్పందన వచ్చిందని.. ఈ మూడు నియోజకవర్గాల నేతలు ఇంకా పనిచేసి ఉంటే సభ గ్రాండ్ సక్సెస్ అయ్యేదని.. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. తిరుపతి నుంచి ఎంత మంది వచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తే.. నాయకులు బిక్క ముఖం వేశారట.
గ్రూపు కట్టి పార్టీని బలహీనపరుస్తున్నారని చంద్రబాబు నివేదిక..!
రైతుల సభే కాకుండా.. అమరావతి రైతుల ర్యాలీ సమయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ నేత నరసింహ యాదవ్ ఇతర నాయకులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబుకు ఒక నివేదిక ఇచ్చారట. వీళ్లవల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా.. గ్రూపులతో పార్టీని బలహీన పరుస్తున్నారని ఆ రిపోర్ట్‌లో ప్రస్తావించారట. గతంలో జరిగిన అంశాలు.. రైతుల ర్యాలీ, సభల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆ నివేదికలో ప్రస్తావించినట్టు టాక్. ఆ విషయం తెలిసినప్పటి నుంచి టీడీపీ వర్గాలు ఆసక్తిగా చర్చించు కుంటున్నాయి. నివేదిక ప్రకారం.. రైతుల సభపట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా? లేక ఎప్పటిలా నాన్చుతారో చూడాలి.
