అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటారు అధికారులు. కుదరదని అడ్డంగా కూర్చుంటారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఏం చేయాలో.. ఎవరికి సర్దిచెప్పాలో తెలియక తలపట్టుకుంటున్నారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. మున్సిపాలిటీల నుంచి ఫోన్లు వస్తే ఎమ్మెల్యేలకు హడల్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ధర్నాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి, నస్పూర్, చెన్నూరు, ఆదిలాబాద్, ముథోల్‌లలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. రూల్ బుక్ ముందు పెట్టుకుని ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లకు చిర్రెత్తుకొచ్చింది. ఏకంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇలా అధికారపార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు ఆందోళనకు దిగడంతో చర్చగా మారుతోంది. ఈ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు నచ్చ జెప్పలేక.. అధికారులను కాదనలేక నలిగిపోతున్నారట ఎమ్మెల్యేలు. అదే ఉమ్మడి జిల్లాలో చర్చగా మారింది.
సమస్యను తేల్చలేక ఇబ్బందిపడుతున్న ఎమ్మెల్యేలు!
బెల్లంపల్లిలో 31 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయడానికి అధికారులు స్పాట్‌కు చేరుకోగానే.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిల్ మొత్తం వచ్చి ధర్నా చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది. కొన్నిచోట్ల మనకెందుకు వచ్చిందిలే అని అధికారులు వెనక్కి తగ్గుతుంటే.. ఇంకొన్నిచోట్ల అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య కూల్చివేతలు గ్యాప్ తీసుకొస్తున్నాయి. అక్కడ కొత్త గొడవలు తెరపైకి వస్తున్నాయట. అటు తిరిగి ఇటు తిరిగి ఈ పంచాయితీలు చివరకు స్థానిక ఎమ్మెల్యేల దగ్గరకు చేరుకుంటున్నాయి. అక్కడ కూడా ఏం తేల్చలేకపోతున్నారట శాసనసభ్యులు.
అక్రమ కట్టడాలను ప్రోత్సహించిన వారే కూల్చివేతలను అడ్డుకుంటున్నారా?
కొందరు ఎమ్మెల్యేలు.. చట్టం చట్టమే.. అధికారుల విధులకు అడ్డురావొద్దని గట్టిగా చెబుతుంటే.. మరికొందరు.. ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు వత్తాసు పలుకుతున్నారట. అధికారులు ఇవాళ ఉంటారు.. రేపటి రోజున ట్రాన్స్‌ఫరై వెళ్లిపోతారు. స్థానిక ప్రజాప్రతినిధుల సపోర్ట్ లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదనే లెక్కలు వేసుకుంటున్న ఎమ్మెల్యేలు కూల్చివేతలకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. అక్రమ కట్టడాలను ప్రోత్సహించిన వారే.. ఇప్పుడు వాటి కూల్చివేతలను అడ్డుకుంటున్నారని వైరిపక్షాలు చురకలు వేస్తున్నాయి.
అధికారులకు అస్త్రంగా మారిన కొత్త రూల్స్!
కొత్త మున్సిపల్ చట్టం.. అధికారులకు అస్త్రంగా మారితే.. ప్రజాప్రతినిధులకు శాపంగా పరిణమించిందని ఎమ్మెల్యేల దగ్గర వాపోతున్నారట కౌన్సిలర్లు. అయితే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే రోడ్డెక్కి ధర్నాలకు దిగడంతో పార్టీ పెద్దలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారట ఎమ్మెల్యేలు. అందుకే ఈ సమస్య నుంచి ఎప్పుడు బయట పడతామా అని ఎదురు చూస్తున్నారట.
