Site icon NTV Telugu

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు….

కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీసులకు వివిధ వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాలో మాత్రం కొందరు చేస్తున్న పనులు డిపార్ట్‌మెంట్‌కు మింగుడు పడటం లేదట. మరక తెస్తున్న బ్లాక్‌షీప్‌లను పట్టుకునే పనిలో పడ్డారట ఉన్నతాధికారులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

సిబ్బంది తీరుతో అధికారులకు తలనొప్పి!

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అక్కడి అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఒకదాని వెనక ఏదో ఒక విమర్శలు రావడం.. ఆరోపణలు వచ్చినవారిపై వేటు వేయడం పరిపాటిగా మారిపోయిందని చెబుతున్నారు. కరోనా సమయంలో మిగిలిన ప్రదేశాల్లో పోలీసులు మంచిపేరు తెచ్చుకుంటే.. ఇక్కడ మాత్రం ఈ తలనొప్పి ఏంటని ఉన్నతాధికారులు తలపట్టుకున్న సందర్భాలు ఉన్నాయట.

నిందితుడికి రాచమర్యాదలు చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు

నెలరోజుల కిందట హస కొత్తూరు గ్రామంలో సిద్దార్థ అనే యువకుడి హత్య జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సిబ్బందితో ఉన్న పాత పరిచయాల కారణంగా నిందితుడికి రాచమర్యాదలు చేశారట. వాటికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లుపై వేటు వేశారు. ఈ ఘటన తర్వాత విచారణకు వచ్చిన పోలీసులను గ్రామశివారుల్లోనే అడ్డుకున్నారు స్థానికులు.

ఇందల్వాయి ఎస్‌ఐపై ఆరోపణలు.. వేటు!

ఇందల్వాయి ఎస్‌ఐ శివప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలు మరో ఎత్తు. ఓ మహిళా కానిస్టేబుల్‌ భర్త ఆత్మహత్యకు ఎస్‌ఐ కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు శివప్రసాద్‌పై వేటు వేశారు. కేసూ నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లాలో ఇసుక లారీల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ కొందరు పోలీసులు అడ్డంగా బుక్కయిపోయారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు కానిస్టేబుళ్లపై వేటు వేశారు జిల్లా ఎస్పీ.

సస్పెండైన కానిస్టేబుళ్ల వెనక ఉన్నవారి పరిస్థితి ఏంటి?

ఇవన్నీ కేవలం బయటకు తెలిసి.. విచారణ జరిపి చర్యలు తీసుకున్న ఉదంతాలు. బయటకు రాకుండా డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది బ్లాక్‌షీప్‌లు ఉన్నట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారట. వారి చిట్టా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇటీవల సస్పెండైన కానిస్టేబుళ్లు వెనక కొందరు అధికారుల పాత్రను గుర్తించారట. వారిపై చర్యలు తీసుకుంటారా.. మందలించి వదిలిపెడతారా అన్నది తెలియాలి.

డీజీపీ ప్రత్యేకంగా నిఘా పెట్టారా?

తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే జనాల్లోకి రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుందనే అభిప్రాయం కొందరు ఉన్నాతాధికారుల్లో ఉందట. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పోలీస్‌ యంత్రాంగంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై డీజీపీ సైతం నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి కూడా కొన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అక్రమార్కుల్లో గుబులు మొదలైందట. మరి.. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి.

Exit mobile version