Site icon NTV Telugu

చంద్రబాబు దీక్షకు పిలుపునిస్తే పదవులు అనుభవించినవారు పత్తా లేరా?

ఏపీలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో రోడ్డెక్కే ప్రయత్నం చేశారు టీడీపీ చీఫ్‌. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నేతలు.. కార్యకర్తల్లో చురుకు పుట్టించాలని అనుకున్నారు. కానీ.. అధినేత ఒకటి తలిస్తే.. జిల్లాల్లో తమ్ముళ్లు చేసింది మరొకటి. పవర్‌లో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో అధికారం అనుభవించిన వారు.. రోడ్డెక్కేవేళ పత్తా లేకుండా పోయారట. అదే టీడీపీ శిబిరంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

175 నియోజకవర్గాల్లో దీక్షలకు టీడీపీ ప్లాన్‌

కోవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో టీడీపీ ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కొందరు ముఖ్య నేతలతో కలిసి చంద్రబాబు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేయాలన్నది కాన్సెప్ట్‌. అధికారం కోల్పోయిన తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకుని టీడీపీ చేపట్టిన పెద్ద నిరసన ఇదే. దీక్షలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయో లేదోకానీ పార్టీ వర్గాల్లో మాత్రం చర్చకు దారితీశాయి.

పదవులు అనుభవించిన వారు పత్తా లేరు!

చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని భారీ స్థాయిలో నిరసనకు పిలుపిస్తే.. టీడీపీలో సీనియర్లుగా గుర్తింపు పొందిన వారు కొన్నిచోట్ల దీక్షల్లో కనిపించలేదు. కోవిడ్‌ సమయంలో ఈ ప్రోగ్రామ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అని చెప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నమైన టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ ఇచ్చే పిలుపులకు నేతల నుంచి సరైన స్పందన లభించేది కాదు. కానీ.. స్వయంగా చంద్రబాబు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో మిగతా నాయకులు కూడా ఒళ్లు వంచుతారని భావించారట. గత ప్రభుత్వంలో మంత్రులుగా.. ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా తెరమీదకు వస్తారని లెక్కలేసుకుంటే.. కొందరు తుస్‌ మనిపించారని టీడీపీ శిబిరంలో వినిపిస్తున్న టాక్‌.

కుప్పం, పుంగనూరుల్లో దీక్షల ఊసే లేదా?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో.. పోరాటాలు మాకు అవసరమా అన్నట్టుగా టీడీపీ కేడర్‌ తీరు ఉందట. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి మొదలుకొని నియోజకవర్గ ఇంఛార్జ్‌లు దీక్షలకు డుమ్మా కొట్టేశారు. కొందరైతే మీడియా కవరేజ్‌ అయిపోగానే నిరసన శిబిరాల నుంచి గాయబ్‌ అయ్యారట. నాయకులు వస్తారు.. తమ బాధలు చెప్పుకోవడానికి కొంత సమయం కేటాయిస్తారని ఆశించిన కేడర్‌ అసంతృప్తిలో మునిగిపోయింది. సత్యవేడులో వర్గాలుగా విడిపోయిన ఇంఛార్జ్‌ జేడీ రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే హేమలతలు పోటాపోటీగా దీక్షలు చేపట్టారు. జీడీ నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, చంద్రగిరిలో సందడి లేదని.. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, అలాగే పుంగనూరుల్లో దీక్షల ఊసే లేదని చెబుతున్నారు.

కృష్ణా జిల్లాలో స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లిన టీడీపీ నేతలు!

టీడీపీకి బలమైన జిల్లాగా చెప్పుకునే కృష్ణాజిల్లాలోనూ దీక్షలపై పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దర్పం వెలగబెట్టిన వారు స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లారని తమ్ముళ్లు కామెంట్స్‌ చేసుకునే పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపిస్తే.. లీడ్‌ తీసుకుని నిరసనలు చేసేవారు కరువయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారు రాజకీయంగా డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తానికి అధినేత ఏదో అనుకుంటే.. నియోజకవర్గాల్లోని నాయకులు, తమ్ముళ్లు దానికి భిన్నంగా వెళ్లడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రోడ్డెక్కి ఇరుకున పడటం ఎందుకని అనుకున్నారో ఏమో దీక్షలకు డుమ్మా కొట్టేశారు.

Exit mobile version