సింగరేణిలో సమ్మె సైరన్ మోగడంతో.. కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయి. ఒక్కరోజు సమ్మె కాస్తా.. మూడు రోజులకు పెరిగింది. అయితే ఈ సమ్మె ఎవరి కోసం? సమ్మె వెనక ఇంకేదైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా? బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు చెబుతున్నా.. కార్మిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో 3 రోజుల సమ్మె..!
తెలంగాణలో నల్లబంగారు గనులు రాష్ట్రానికి సిరులు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో పదకొండు ఏరియాల్లో విస్తరించిన గనుల్లో 45 వేలమందికి పైగా పనిచేస్తున్నారు. కోలిండియా స్థాయిలో మొత్తం 88 బోగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటీకరణ కానున్న బొగ్గు బ్లాకుల్లో తెలంగాణకు చెందిన నాలుగు ఉన్నాయి. ఇందులో సింగరేణికి రావాల్సిన కల్యాణ్ ఖని బ్లాక్6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బొగ్గు గనులు ప్రైవేట్‌పరం కాబోతున్నాయి. ఈ అంశంపై ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చాయి. కార్మికుల ఆగ్రహానికి భయపడ్డారో ఏమో.. సమ్మె నోటీస్ ఇచ్చింది TBGKS. ఈ సంఘం ఒక్క రోజు సమ్మెకే నోటీసు ఇచ్చింది. అయితే ఐదు జాతీయ కార్మిక సంఘాలు ముందుకు రావడంతో సమ్మెను మూడు రోజులకు పెంచారు. గేట్ మీటింగ్‌లు మొదలయ్యాయి.
కేంద్రం దగ్గరున్న వాటాను రాష్ట్రమే తీసుకోవాలన్నది సంఘాల డిమాండ్..!
ప్రైవేటీకరణపై సంఘాలు ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండటంతో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది గుర్తించిన TBGKS దిద్దుబాటు చర్యలు చేపట్టిందని టాక్. ఈ సంస్థే సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంది. త్వరలో కార్మిక సంఘం ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ మైలేజ్ సాధించడం కోసమే రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం దగ్గర ఉన్న వాటాను రాష్ట్రమే తీసుకుని.. ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్నది కార్మికుల డిమాండ్. అయితే TBGKS సమ్మె నోటీస్‌లో ప్రస్తావించిన డిమాండ్స్‌పై చర్చ మొదలైంది. ఐదు డిమాండ్లలో ఒక్కటి మినహా మిగతావి యూనియనే పరిష్కరించుకునే వీలుందట. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపైనే ఇప్పుడు సమ్మెకు వెళ్లడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయట.
యూనియన్ల లక్ష్యం గుర్తింపు సంఘాల ఎన్నికలేనా?
ఈ అంశాలను పసిగట్టిన జాతీయ కార్మిక సంఘాలు కొత్త ఎత్తుగడ వేసినట్టు సమాచారం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గినా లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా.. అందరి లక్ష్యం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలే అన్నది అందరూ చెప్పేమాట. 2017లో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఇన్నాళ్లూ TBGKS సైలెంట్‌గా ఉన్న విషయాన్ని జాతీయ సంఘాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయట. అప్పట్లోనే జాతీయ కార్మికులు సమ్మె చేస్తే.. ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరో అందరికీ తెలుసు అని గుర్తు చేస్తున్నారట. మరి.. సమ్మె పేరుతో సాగుతున్న ఈ పోరుబాటలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. ఎవరు కార్మికుల్లో బలం పెంచుకుంటారో చూడాలి.
