Site icon NTV Telugu

Damodar Raja Narasimha: రాజనర్సింహ పక్క చూపులు.. ఎందుకు మౌనంగా ఉన్నారు ?

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha :కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో అని ఆయన చుట్టూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పక్కచూపులు చూస్తున్నారని భావించారు. దానికితోడు సొంత సెగ్మెంట్‌కు రావడం కూడా మానేశారు. కేడర్‌ అయోమయంలో ఉన్న టైమ్‌లో ట్విస్ట్‌ ఇచ్చారు. మరి.. అనుమానాలను నివృత్తి చేస్తారా? ఎవరా నాయకుడు?

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు దామోదర రాజనర్సింహ. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌ ఎదురీదుతుంటే.. సోదిలో లేకుండా పోయారు ఈ మాజీ మంత్రి. 2014, 2018 ఎన్నికల్లో ఆందోల్‌ నుంచి పోటీ చేసిన నెగ్గుకు రాలేకపోయారు. ఓటమి తెచ్చిన ఇబ్బందో.. కాంగ్రెస్‌లో గుర్తింపు లేదన్న ఆందోళన ఏమో ఆయన ఏం చేస్తున్నారో పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదట. ఆ మధ్య హుజూరాబాద్‌ ఉపఎన్నికలో రాజనర్సింహ చుట్టూ చర్చ జరిగినా.. అక్కడి ఫలితం తర్వాత సైలంట్‌ అయ్యారు.

రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక కొన్ని రోజులు హుషారుగా పనిచేసిన రాజనర్సింహ తర్వాత చల్లబడ్డారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ ఎటువంటి పిలుపు ఇచ్చినా ఉలుకు పలుకు లేదన్నది కాంగ్రెస్‌ వర్గాలు చెప్పేమాట. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండకు దూరంగానే ఉన్నారు ఈ మాజీ మంత్రి. ఇదే సమయంలో రాజనర్సింహ పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరిగింది. వాటిని ఆయన ఖండించినా ఆ దుమారం ఆగలేదు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం.. జంపింగ్‌లు ఊపందుకోవడంతో మరోసారి రాజనర్సింహ పేరు చర్చల్లోకి వస్తోంది.

ఇంతలోనే రూట్‌ మార్చేశారు రాజనర్సింహ. కాంగ్రెస్‌ చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర కోసం ఆందోల్‌లో వాలిపోయారు. వాస్తవానికి రాజనర్సింహ ఆందోల్‌కు వస్తారని పార్టీ కేడర్‌ ఊహించలేదట. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీ విచారణకు హాజరైనప్పుడు పార్టీ చేపట్టిన నిరసనలకు ఆయన వెళ్లలేదు. కేడర్‌ను ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కోరలేదు. దీంతో తాజా పాదయాత్రనే సైతం ఆయన లైట్‌ తీసుకుంటారని భావించారు అనుచరులు. కానీ.. చాలా కాలం తర్వాత ఆందోల్‌లో తళుక్కుమని పార్టీ కేడర్‌తోపాటు.. ప్రత్యర్థి పార్టీలను ఆశ్చర్యపరిచారు.

తాజా పర్యటనతో పక్కచూపుల ప్రచారానికి చెక్‌ పెడతారో.. లేక నిజం చేస్తారో కానీ.. రాజనర్సింహ ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం మునుగోడుపై చర్చ జరుగుతోంది. రాజకీయం అంతా అక్కడే కేంద్రీ కృతమై ఉంది. పార్టీలో సీనియర్‌గా ఉన్న రాజనర్సింహ లేటెస్ట్ ఎపిసోడ్‌పై స్పందిస్తారో లేదో అనే చర్చ ఉంది. మరి.. ఈ మాజీ డిప్యూటీ సీఎం ఆలోచనలేంటో కాలమే చెప్పాలి.

 

Exit mobile version