NTV Telugu Site icon

రాజమండ్రిలో పురపోరుపై రాజకీయ వేడి!

గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్‌ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. 

రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా?

గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయం వేడెక్కుతోంది.  విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్‌ పెంచాయి పార్టీలు. మేయర్‌ పీఠం తమదేనని రెండు పార్టీలు భారీ ప్రకటనలు చేస్తున్నాయి. డివిజన్ల వారీగా టికెట్లు ఆశిస్తున్నవారి జంపింగ్‌ జపాంగ్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎవరు ఎప్పుడు కండువా మార్చేస్తారో తెలియడం లేదు. ఉదయం టీడీపీ శిబిరంలో కనిపించిన వారు.. సాయంత్రం వైసీపీ కండువాతో ప్రత్యక్షం అవుతున్నారు. కేడర్‌ వరకు ఎన్నికల ఊపు కనిపిస్తున్నా.. వైసీపీ, టీడీపీ రాజమండ్రి నేతల్లో ఐక్యత లేదన్నది బహిరంగ రహస్యం. అదే ఇప్పుడు రెండు శిబిరాల్లోనూ గుబులు రేపుతోందట.

టీడీపీలో ఆదిరెడ్డి వర్సెస్‌ గోరంట్ల!

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్‌ నుంచి , గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలే భవానీ. రాజమండ్రిలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవానీ భర్త ఆదిరెడ్డి వాసు మేయర్‌ పీఠంపై ఆశ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల జోక్యం చేసుకోకుండా  ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంటోందట. ఈ రెండు వర్గాల పోరుతో విసుగుపుట్టిన టీడీపీ లోకల్‌ నేతలు.. మాజీ కార్పొరేటర్లు సైకిల్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ మళ్లీ పాగా వేయడం అంత సులభం కాదన్నది పార్టీ నేతలు చెప్పేమాట. రాజమండ్రిలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన టీడీపీకి నాలుగోసారి పెద్ద సవాల్‌ ఎదురుకానున్నట్టు చెబుతున్నారు.

వైసీపీలో ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా!

రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య  52కు పెరుగుతోంది. ఒక్కో డివిజన్‌లో పదివేలకు తగ్గకుండా ఓటర్లు ఉండొచ్చని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనరల్‌ ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యే సీట్లు కోల్పోయి.. ఎంపీ సీటును, రాజానగరం ఎమ్మెల్యే స్థానాన్ని గెల్చుకున్న వైసీపీ మొత్తం 52 డివిజన్లలో గెలిచి కార్పొరేషన్‌లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తోంది. రాజమండ్రి వైసీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వచ్చాక పార్టీ దూకుడు పెంచిందని చెబుతున్నారు. రూరల్‌ ఇంఛార్జ్‌ చందన నాగేశ్వరరావు సైతం ఆకులతో కలిసి సాగుతున్నారట. వీరిద్దరూ ఎంపీ భరత్‌ వర్గంగా ముద్ర పడింది.  ఎంపీ పేరు చెబితే రుసరుసలాడుతున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గానికి ఈ పరిణామాలు రుచించడం లేదని సమాచారం. పైకి కలిసి పనిచేస్తున్నట్టు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని చెబుతున్నారు. 

రెండు పార్టీలలో నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా? 

రెండు మూడు నెలల్లో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగొచ్చని అనుకుంటున్నారు. ఇటు చూస్తే వైసీపీ, టీడీపీలలో నాయకులకు పడటం లేదు.  సయోధ్యకు రెండు పార్టీల పెద్దలు ప్రయత్నించినా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేడర్‌ సైతం గందరగోళం పడుతోందట. మరి.. ప్రతికూలతలను అధిగమించి.. రాజమండ్రి కార్పొరేషన్‌లో ఏ పార్టీ  కలిసికట్టుగా సాగుతుందో చూడాలి.