NTV Telugu Site icon

Rajam TDP Leaders Clashes.. Off The Record: సమన్వయం లేదు.. ఓన్లీ ఇగో

Maxresdefault

Maxresdefault

మాజీ మంత్రులైన ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నా.. ఇగోలు వీడటం లేదట. సమన్వయం లేకపోవడంతో గతంలో ఓడిపోయారు. అయినా వారు స్పృహలోకి రాలేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?

సీనియర్లు అయినా ఒకరికొకరికి పడదు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం.. ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఒకదానితో ఒకటి ముడిపడినట్టు ఉంటాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం రాజాం. అది ఎస్సీ రిజర్వ్డ్‌గా మారిన తర్వాత ఆయన ఎచ్చర్లకు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి రాజాంలో ప్రతిభా భారతి.. కొండ్రు మురళి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ సమయంలో మంత్రిగా పనిచేసిన మురళీ.. తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో రాజాంలో ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019లో రాజాంలో ఎమ్మెల్యేగా గెలిచింది వైసీపీ నేత కంబాల జోగులే. ప్రస్తుతం రాజాం టీడీపీ ఇంఛార్జ్‌గా మురళీ కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరినప్పుడు ఆ పార్టీ కేడర్‌ మాజీ మంత్రిని అనుసరించకుండా.. వైసీపీలోకి వెళ్లిపోయింది. రాజాం టీడీపీలో కళా వెంకట్రావు.. కొండ్రు మురళీ.. మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కీలకం. సీనియర్లు అయినప్పటికీ వీళ్లకు అస్సలు పడదు. అదే నియోజకవర్గంలో పార్టీని బలహీన పరుస్తోందని తమ్ముళ్ల అభిప్రాయం.

రాజాంలో కళాకు పట్టు.. ఇతర నేతలకు చిక్కు
కళా వెంకట్రావు.. ప్రతిభా భారతి మధ్య సఖ్యత లేకపోవడంతో 2019లో మురళీకి టికెట్‌ ఇచ్చింది టీడీపీ. కళాతో ఉన్న గ్యాప్‌ కారణంగా మురళీ ఓడిపోయారనేది తమ్ముళ్ల మాట. దాంతో ఇద్దరు మాజీ మంత్రులు గ్యాప్‌ పాటిస్తున్నారు. వాస్తవానికి రాజాంలో కళాకు గట్టి పట్టుంది. నియోజకవర్గంలోని రాజాం.. సంతకవిటి, రేగిడిఆమదాలవలస, వంగర మండలాల్లో ఆయనకు బంధుత్వాలతోపాటు అనుచరగణం ఘనంగానే ఉంది. రేగిడి, రాజాం మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీలుగా కళా మనుషులే పోటీ చేస్తారు. నియోజకవర్గంలో కళా మద్దతు లేకపోతే నెగ్గుకు రాలేమని మురళీకి తెలియంది కాదు. ఇప్పుడు 2024 ఎన్నికలకు పార్టీ సన్నద్ధం అవుతుంది. టీడీపీ నుంచి మరోసారి పోటీకి మురళీ, ప్రతిభా భారతి ఇద్దరూ ఆసక్తితో ఉన్నారు. వీళ్లకు కళా మద్దతు లేకపోతే 2019 ఫలితమే రిపీట్ అవుతుందనేది తెలుగు తమ్ముళ్ల మాట.

ఓ వర్గం మురళీతో అంటీముట్టనట్టు ఉంటోందా?
రాజాంలో టీడీపీ నుంచి మరొకరు పాగా వేయకుండా కళా ఎత్తులు వేయడానికి కారణాలు ఉన్నాయట. సొంత నియోజవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్‌ అయినా.. వచ్చే నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్‌గా మారుతుందని లెక్కలు వేస్తున్నారట. అప్పుడు సొంత సీటుకు తిరిగొచ్చి మళ్లీ జెండా ఎగరేయాలన్నది కళా కలగా చెబుతున్నారు. అందుకే సొంత పార్టీ నేతలు బరిలో ఉన్నా.. రాజాంలో వారికి కళా హ్యాండిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాం టీడీపీ ఇంఛార్జ్‌గా బాదుడే బాదుడు కార్యక్రమంలో మురళీ పాల్గొంటున్నారు. కానీ.. నియోజకవర్గం టీడీపీలోని ఒక వర్గం ఆయనతో అంటీముట్టనట్టు ఉంటోందట. ఈ విషయం టీడీపీ అధిష్ఠానానికి తెలిసినా చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదట. దీంతో గ్రూపులు పెరిగి.. ఇగోలు ఎక్కువై గోతులు తీసుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు నాయకులు. మరి.. ఈ ప్రతికూలతలను టీడీపీ అధిగమిస్తుందో లేదో చూడాలి.