Site icon NTV Telugu

YCP : యువనేతలకే రాజమండ్రి వైసీపీ బాధ్యతలు?

Pedda Sawaly

Pedda Sawaly

రాజమండ్రి వైసీపీలో ఇటీవల ఊహకందని చిత్రం పొలిటికల్ తెరపై కనిపించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ మార్గాని భరత్‌.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు దోస్త్‌ మేరా దోస్త్‌ అన్నట్టుగా కలిసిపోయారు. ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు యువ నేతలు అనేకసార్లు రచ్చకెక్కారు. పార్టీ అధిష్ఠానం సైతం సయోధ్యకు విఫలయత్నం చేసింది. భరత్‌, రాజాలు కలవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ.. విభేదాలను పక్కన పెట్టేసినట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

వైసీపీలో సంస్థాగతంగా చేపట్టిన మార్పులు రాజమండ్రిలో వర్గపోరుకు చెక్‌ పడేలా చేశాయట. రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ బాధ్యతలు జక్కంపూడి రాజాకు అప్పగించారు. అలాగే పార్టీ ఇంఛార్జులుగా ఎంపీలు మిధున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు వచ్చారు. వాళ్ల ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై సమావేశం నిర్వహించడానికంటే ముందుగానే భరత్‌, రాజాలు ఐక్యతారాగం వినిపించడం కీలక పరిణామం. ఎమ్మెల్యే రాజా ఎంపీ భరత్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన తర్వాత సమస్యలు కొలిక్కివచ్చాయి. అయితే రాజమండ్రి సిటీలో సరైన నేత ఇంఛార్జ్‌గా లేక అక్కడ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి అక్కడ ఎలాంటి మంత్రం వేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.

2019 ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్‌ను ఇంఛార్జ్‌గా తప్పించారు. తర్వాత వచ్చిన శివరామ సుబ్రమణ్యం ఎక్కువ కాలం ఇంఛార్జ్‌గా లేరు. మూడో ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆ ప్రయోగం కూడా కలిసి రాలేదు. ఏడాదిన్నరగా ఆకుల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇంఛార్జ్‌ లేకుండా పోయిన రాజమండ్రిలో పాతవారికి పట్టం కట్టలేక.. కొత్తగా బలమైన నాయకుడిని తీసుకురాలేక ఇబ్బందులు పడుతోంది అధికారపార్టీ. తాజాగా ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజాలు చేతులు కలిపినా.. రాజమండ్రిలో వైసీపీ కోఆర్డినేటర్‌ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సైతం రాజమండ్రిలో ఒక్క వార్డుకే పరిమితం అయ్యింది. వైసీపీలో తగిన గౌరవం దక్కడం లేదని రౌతు సూర్య ప్రకాష్‌రావు కినుక వహించారు. పార్టీ సమావేశాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఇక ఎమ్మెల్యే టికెట్‌పై భరోసా ఇస్తేనే ఇంఛార్జ్‌గా పగ్గాలు చేపడతానంటున్నారట శివరామ సుబ్రమణ్యం. అనారోగ్యం కారణాలతో సైలెంట్‌ అయిన ఆకుల సత్యనారాయణ తిరిగి యాక్టివ్‌ అవుతానని పార్టీకి వర్తమానం పంపారట. అయితే ఇంఛార్జ్‌ ఎంపిక విషయంలో గతంలో చేసిన పొరపాట్లకు తావు లేకుండా ఆచితూచి వ్యవహరించే పనిలో ఉంది వైసీపీ. ఇప్పట్లో ఇంఛార్జ్‌ను నియమించకపోవచ్చని చెబుతున్నారు.

విభేదాలను పక్కన పెట్టి.. చేతులు కలిపిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకే రాజమండ్రి వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్‌. 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగే ఎలక్షన్స్‌ ఇద్దరికీ సెమీఫైనల్‌గా వర్ణిస్తున్నారు. ఇద్దరూ ఇక్కడ సక్సెస్‌ అయితే.. ఆ తర్వాతే కొత్త ఇంఛార్జ్‌ వస్తారని అనుకుంటున్నారు. మరి.. ఈ సవాల్‌ను యువనేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.

 

 

Exit mobile version