Site icon NTV Telugu

మునుగోడు టీఆర్ఎస్‌లో మూడుముక్కలాట..!

ఒకరేమో మాజీ ఎమ్మెల్యే. మిగతా ఇద్దరిదీ అక్కడ టికెట్‌ సంపాదిస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చనే ఆశ. ముగ్గురూ ముగ్గురే. ఎవరి ఎత్తులు వారివే. పార్టీలోని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే అంశం చిక్కితే.. రచ్చరచ్చ చేసి విడిచి పెడుతున్నారు. వారెవరో? ఆ నియోజకవర్గం ఏంటో? లెట్స్‌ వాచ్‌..!

దళిత సర్పంచ్‌ సస్పెన్షన్‌పై మునుగోడు టీఆర్ఎస్‌లో రగడ..!

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచినా.. టీఆర్ఎస్‌ నాయకుల్లో వర్గపోరు పులుపు చావలేదు. నేతలు ఎక్కువ.. వారి మధ్య విభేదాలు ఎక్కువే. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు టీఆర్ఎస్‌ ఇంఛార్జ్‌. ఇదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఓ వర్గం ఉంది. మరో సీనియర్‌ నేత కర్నాటి విద్యాసాగర్‌ సైతం దూకుడుగా వెళ్తున్నారు. ముగ్గురికీ ప్రత్యేకవర్గాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. విపక్ష పార్టీలపై విరుచుకుపడటం ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌లోనే గ్రూప్‌ ఫైట్‌ ఎక్కువ. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోవడం.. ఎదుటివారిని ఎలా ఇరకాటంలో పెట్టాలా అని ఆలోచించడం.. విమర్శలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. తాజాగా ఓ దళిత సర్పంచ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంశం పార్టీలో పెద్ద రచ్చకే దారితీసింది.

కూసుకుంట్ల వర్గం తీరుపై పార్టీలో మిగతావారు భగ్గు..!

నాంపల్లి మండలం టీఆర్ఎస్‌ అధ్యక్షుడిగా కూసుకుంట్ల వర్గానికి చెందిన నేత ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంత చెబితే అంత చేస్తారట. ఇటీవల పార్టీ సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు రావాలని వాట్సాప్‌ సందేశాలు వెళ్లాయి. మొదట్లో మీటింగ్‌ ప్రశాంతంగానే ఉన్నా.. చివర్లో మాత్రం వర్గపోరు బయటపడింది. ఒకరినొకరు తీవ్రస్థాయిలో దూసించుకున్నారు. చివరకు గొడవకు కారణమని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సుంకిశాల సర్పంచ్‌.. దళిత వర్గానికి చెందిన రాములను మరో వ్యక్తిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేశారు. ఈ చర్యతో కూసుకుంట్ల వ్యతిరేక వర్గం భగ్గుమంది. ఏకంగా రోడ్డెక్కి ఆందోళన చేసింది కర్నాటి విద్యాసాగర్‌ వర్గం. వీరికి కర్నె ప్రభాకర్‌ వర్గం కూడా జత కలవటంతో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల తీరును నిరసిస్తూ నినాదాలు హోరెత్తించారు.

ముగ్గరు నేతల మధ్య టికెట్‌ రేస్‌తో రచ్చ రచ్చ..!

ప్రస్తుతం సస్పెన్షన్ల ఎపిసోడ్‌ మునుగోడు టీఆర్‌ఎస్‌లో వ్యక్తిగత దూషణలకు వేదికైంది. పార్టీ కేడర్‌లోనూ చీలిక వచ్చి.. ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే పరిస్థితి. సమస్య ముదురు పాకాన పడి పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. వాస్తవానికి మునుగోడులో ముగ్గురు టీఆర్ఎస్‌ నేతల మధ్య ఆధిపత్యపోరు ఎక్కువగా ఉంది. అందరూ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం ఆశపడుతున్నవాళ్లే. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి.. ఇప్పుడు ఇంఛార్జ్‌గా ఉండటంతో తనకే టికెట్‌ వస్తుందన్న లెక్కల్లో ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. ఎమ్మెల్సీ పదవి పొడిగింపు రాకపోవడంతో.. మునుగోడుపై కన్నేశారు కర్నె ప్రభాకర్‌. ఇక కేటీఆర్‌ ఆశీసులతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ పొందే ఆలోచనలో ఉన్నారు కర్నాటి విద్యాసాగర్‌. దీంతో ఏ చిన్న అంశమైనా అధికారపార్టీలో పెద్ద చర్చగా మారి.. గోల గోలగా తయారవుతోంది. తాజా రగడను అదే కోణంలో చూస్తున్నాయి పార్టీ వర్గాలు. మరి.. మునుగోడు టీఆర్‌ఎస్‌ను గాడిలో పెట్టేందుకు అధిష్ఠానం దృష్టి పెడుతుందో లేదో చూడాలి.

Exit mobile version