కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌కు కొత్త నేత అవసరం వచ్చిందా? వనమా రాఘవ వ్యవహారంతో జలగం అక్కడ మళ్లీ యాక్టివ్ అవుతారా? ఆ నియోజకవర్గంపై కన్నేసిన గులాబీ నేతలు ఎవరు? మారిన పరిణామాలు ఎవరికి ఆశలు రేకెత్తిస్తున్నాయి?
కొత్తగూడెం టీఆర్‌ఎస్ పరిణామాలపై ఆసక్తి
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో.. రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు జైలు పాలయ్యారు. ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఒకవైపు వనమా రాఘవను టీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యే వనమా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే వనమా.. తన కుమారుడు రాఘవను నియోజకవర్గానికి దూరంగా పెడతారని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ తర్వాత కొత్తగూడెం టీఆర్‌ఎస్‌లో జరిగే పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరిని బరిలో దించుతుంది?
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమా గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో చేరారు వనమా. అప్పటి నుంచి కొత్తగూడెంలో జలగం..
వనమా గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. రాఘవ ఎపిసోడ్ తర్వాత.. ఇక వనమా కుటుంబం రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న వాదన ఉంది. ఇటు టీఆర్‌ఎస్ కూడా విపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ నిర్ణయం ఏంటన్నది పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారింది.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు యాక్టివ్ అవుతారా?
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా కుటుంబం రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది. ఈ సమయంలో జలగం కొత్తగూడెంలో యాక్టివ్ అవుతారా లేదో అనే చర్చ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే సత్తా ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే మరో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం వనమా రగడ తర్వాత కొత్తగూడెంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మరి.. వచ్చే ఎన్నికల్లో జలగానికే గులాబీ పట్టం కడుతుందో.. కొత్తనేతను కొత్తగూడేనికి పంపుతుందో చూడాలి.