సెలబ్రిటీలంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. అవకాశం వస్తే ఫోటో దిగాలని ముచ్చట పడ్డం సహజం. ఇటువంటి సరదానే తీర్చుకున్నారు ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయంగా తమకు ప్రత్యర్థి అయిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో ఓ ఫోటో దిగారు. అది ఏడేళ్ల కిందటి ముచ్చట. ప్రస్తుతం పవన్, వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. రాజకీయవైరం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఈ క్రమంలో పవన్ పై విరుచుకుపడుతున్నారు మంత్రి అమర్నాథ్.
ఇటీవల కౌలురైతుల ఆత్మహత్యలపై పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ విధానాలపైన, సీఎంపైనా కామెంట్స్ చేశారు. దీంతో మంత్రులు అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజాలు రంగంలోకి దిగారు. తీవ్రస్ధాయిలో జనసేనానిపై విరుచుకుపడ్డారు. ముగ్గురు మంత్రులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ వేడే రాజుకుంది. విశాఖలో మీడియా ముందుకొచ్చిన గుడివాడ అమర్నాథ్.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ.. ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని సెటైర్లు వేశారు. పవన్ వ్యక్తిత్వం అందరికంటే రేణుదేశాయ్‌కు ఎక్కువ తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమర్.
మంత్రి కామెంట్స్‌పై జనసైనికులు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ముగ్గురు మంత్రులపై వినూత్న నిరసనలకు దిగారు. అమర్నాథ్ విషయంలో మాత్రం నెట్టింట్లో రఫ్పాడేస్తున్నారు జనసైనికులు. ఇందుకు వాళ్ల చేతికి చిక్కిన ఫోటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్‌తో కలిసి అమర్నాథ్ గతంలో తీసుకున్న ఫోటో. వ్యక్తిగత విమర్శలతో జనసేనానిని డిఫెన్స్‌లో పడేద్దామని భావించిన మంత్రులకు ఇది మింగుడు పడలేదట. ఇదే సమయంలో నెటిజన్లు అమర్, పవన్ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. వాస్తవానికి ఈ ఫోటో లేటెస్ట్ ది కాదు. ఏడేళ్ళ క్రితం నాటి ముచ్చట. 2015లో విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తీసిన ఫొటో. అప్పటికే పవన్ కల్యాణ్ జనసేనను స్ధాపించగా.. అమర్నాథ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. వీఐపీ లాంజ్‌లో సెలబ్రిటీ కనిపించడంతో ఓ ఫోటో క్లిక్ మనిపించారు.
ఇంత కాలం అటువంటి ఫోటో ఒకటి ఉందనే విషయం మంత్రికీ గుర్తులేదట. కాలక్రమంలో అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్‌ను ఎదుర్కోవడానికి అదే సామాజికవర్గానికి చెందిన అమర్నాథ్ ముందు వరుసలో ఉంటున్నారు. దీంతో జనసైనికులు ఫోకస్ ఈ మంత్రిపైకి షిఫ్ట్ అయింది. విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. దీంతో అమర్నాథ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పవన్ తో దిగిన ఫోటో ఒరిజినల్ దేనని అంగీకరిస్తూనే.. అందులోని జనసేన లోగో మాత్రం మార్ఫింగ్ అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చేతులు కట్టుకుని ఉంటే.. తాను స్టైల్‌గా ఉన్న ఫోటో చూస్తే ఎవరు ఎవరితో తీయించుకున్నారో అర్ధం చేసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనని, పవన్ రెండుచోట్ల ఓటమి చెందిన నాయకుడని విమర్శలు చేశారు. దీంతో జనసైనికులకు మళ్ళీ భగ్గుమన్నారు.
విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా వున్నా సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం పవన్, అమర్ ఫోటో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో పవన్ కల్యాణ్ తో ఫోటో వ్యవహారంలో మంత్రి అమర్నా థ్ జాగ్రత్త పడినట్టు భోగట్టా. అప్పట్లోనే పార్టీ పెద్దలకు దీని గురించి చెప్పారని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అప్పుడు కాకపోయినా ఇప్పుడైన ఫోటోకు ఫోజు ఇచ్చినందుకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం మంత్రికి ఒక విధంగా ఇబ్బందికరమనే అభిప్రాయం వుంది. ఐతే, మంత్రికి అనూహ్యంగా పరిస్ధితులు చూసి రాజకీయ ప్రత్యర్ధులు తెగ ఎంజాయ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
