Site icon NTV Telugu

బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్‌బై చెప్పబోతున్నారా?

బీజేపీలో ఈటల చేరికతో రుసరుసలాడుతోన్న ఆ కమలనాథుడు.. పార్టీతో తెగతెంపులు చేసుకోబోతున్నారా? పక్కచూపులు చూస్తున్నారా? కమలానికి గుడ్‌బై చెప్పడమే మిగిలిందా? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి?

బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?

బీజేపీలో కొత్తగా చేరిన వెటరన్స్ పక్కచూపులు చూస్తున్నారట. పార్టీ నుండి జారుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన కమల పార్టీని వదిలేసినట్టేనని బీజేపీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయట. కాషాయ కండువా తీసేసి త్వరలోనే అధికారపార్టీకి చెందిన గులాబీ కండువా కప్పుకొంటారనే చర్చ జోరందుకుంది.

ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డి

బీజేపీలో కొత్తగా చేరిన వారు కాషాయ శిబిరంలో ఇమడలేక సతమతం అవుతున్నారట. ఏదో సర్దుకుపోదాం అని కొందరు భావిస్తుంటే.. మరికొందరు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా పెద్దిరెడ్డి పేరు బయటకు వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వస్తున్నారని ప్రచారం మొదలైనప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు పెద్దిరెడ్డి. బీజేపీలో చేరిక గురించి తనకు మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆయన ఫైర్‌ అయ్యారు. ఆ ఎపిసోడ్‌ స్టార్టింగ్‌ నుంచి బీజేపీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు.

read also : రాజేంద్రనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు

ఇంత వరకు కలిసి మాట్లాడుకోని ఈటల, పెద్దిరెడ్డి

బీజేపీని వదిలేస్తున్నట్టు సంకేతాలు ఇవ్వనప్పటికీ.. పెద్దిరెడ్డి వ్యవహార శైలి మాత్రం ఏదో చేయబోతున్నట్టుగా అనుమానిస్తున్నారు పార్టీ నేతలు. హుజురాబాద్‌ నియోజకవర్గానికే చెందిన ఈటల రాజేందర్‌, పెద్దిరెడ్డిలు ఇంత వరకు కలిసి మాట్లాడుకోలేదు. పైగా ఈటలకు వ్యతిరేకంగా కామెంట్స్‌ చేశారు పెద్దిరెడ్డి. ఇది స్థానికంగా బీజేపీకి కొంత ఇబ్బందిగా ఉన్నా.. పార్టీ నేతలు పైకి మాట్లాడటం లేదు. కాకపోతే హుజురాబాద్‌ ఉపఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పెద్దిరెడ్డి ఎపిసోడ్‌ వారికి మింగుడు పడటం లేదని టాక్‌.

టీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలకు పెద్దిరెడ్డి ఓకే చెప్పారా?

బీజేపీలోని కొందరు పెద్దలు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని బుజ్జగించే యత్నం చేస్తున్నారట. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయనతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కలిసి పనిచేద్దామని చెప్పారట. ఇదే విధంగా బీజేపీ ముఖ్య నేతలు ఆయనతో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల కాలం చేశారు. పరామర్శకు బీజేపీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్తున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ వెళ్లి మాట్లాడారు. కొందరు టీఆర్‌ఎస్‌ సీనియర్లు కూడా పెద్దిరెడ్డిని పరామర్శించారట. ఆ సందర్భంగా పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గులాబీ నేతల ప్రతిపాదనలకు ఆయన సానుకూలంగా స్పందించారట. భేషరతుగా గులాబీ కండువా కప్పుకొంటానని కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.

త్వరలోనే కారెక్కేస్తారని ప్రచారం!

ఈ పరిణామాలను గమనించిన రాజకీయ వర్గాలు పెద్దిరెడ్డి ఎంతో కాలం బీజేపీలో ఉండబోరని.. త్వరలోనే కారెక్కేస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. హుజురాబాద్‌ ఉపఎన్నిక వేడి రాజుకున్న సమయంలో కండువాల మార్పు ఉంటుందని అనుకుంటున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version