Site icon NTV Telugu

టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం పార్టీ శ్రేణుల ఎత్తుగడలు

Earth Pedataray

Earth Pedataray

తెలంగాణలో వరసగా మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ టికెట్‌ దక్కించుకుంటే.. గెలుపు ఈజీ అనే ఆలోచనలో ఉన్నారు ఆశావహులు. ఇప్పటికే కొందరు నాయకులు నియోజకవర్గాలపై కర్చీఫ్‌లు వేసే పనిలో బిజీ అయ్యారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించి.. వివిధ కారణాలతో ప్రస్తుతం మరో పదవిలో ఉన్నవారు.. తిరిగి పట్టు సాధించే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో స్వయంగా బరిలో దిగాలని చూస్తున్నారట. వీలుకాకపోతే కుటుంబసభ్యులకైనా టికెట్‌ ఇప్పించుకోవాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నట్టు గులాబీ శిబిరంలో జోరుగా చర్చ జరుగుతోంది.

అవకాశం చిక్కితే డైరెక్ట్‌గానో.. ఇన్‌డైరెక్ట్‌గానో అది తమ అసెంబ్లీ నియోజకవర్గమే అనే సంకేతాలు పంపుతున్నారట నాయకులు. ఈ జాబితాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాస్త యాక్టివ్‌గా ఉన్నారట. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘనపూర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో ఎమ్మెల్సీలు వేస్తున్న అడుగులు సిట్టింగ్‌లను కలవర పెడుతున్నాయట. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమకే అని అనుచరులకు దీమాగా చెబుతున్నారట. నియోజకవర్గాల్లోని కేడర్‌తో.. అనుచరులతో ఎప్పటికప్పుడు టచ్‌ ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా బరిలో దిగాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గతంలోనూ ప్రయత్నించారు. కానీ.. పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్‌ ఇచ్చింది. ఆయన మనసు మాత్రం అసెంబ్లీపైనే ఉందట. స్టేషన్‌ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన కుమార్తెను అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తవారిని పోటీలోకి దించుతారని చర్చ జరుగుతోంది. ఇక తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య పంచాయితీ ఎప్పుడూ కాక మీద ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్‌ అని పట్నం పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీలో మరికొందరు ఎమ్మెల్సీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందట. ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగా ఉండటంలో ఆ కిక్కు వేరనే లెక్కలు వేసుకుంటున్నారు నాయకులు.ఈ వైఖరే నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరుకు దారితీస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆచితూచి వడపోతలు చేపడుతుంటే.. నేతల తీరు మాత్రం మరోలా ఉంది. మరి.. ఈ టికెట్‌ రేస్‌లో ఎత్తుగడలకు టీఆర్ఎస్‌ చెక్‌ పెడుతుందో లేదో చూడాలి.

Exit mobile version