సీతయ్య…. ఎవ్వరి మాటా వినడన్నట్టుగా ఉందట ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు. జిల్లాలోని మిగతా శాసనసభ్యులంతా ఒక్క తీరుగా ఉంటే… ఆయన మాత్రం నేను నేనే… నాకు నేనే. నా రూటే సపరేటు అంటున్నారు. ఎవరా మోనార్క్ ఎమ్మెల్యే? ఎందుకు అలా ఉంటున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరే వేరుగా ఉంటుంది. ఒకరు చెబితే నేను వినేదేంది అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. గతంలో సీఎం రేవంత్ రెడ్డినే లైట్ తీసుకున్న దొంతి…. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం సఖ్యతగానే ఉంటున్నారాయన. అయితే…. ముఖ్యమంత్రితో పాజిటివ్‌గా ఉంటున్న ఎమ్మెల్యే…. ఆయన ప్రధాన అనుచరుడు వేం నరేందర్ రెడ్డికి వరంగల్‌లో నిర్వహించిన సన్మానకార్యక్రమానికి దూరంగా ఉండడం చర్చనీయంశమైంది. దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా కలిసిన ఉన్న ఈ వేదిక మీద నర్సంపేట ఎమ్మెల్యే మాత్రం ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నలు జిల్లా పార్టీ వర్గాల్లో తలెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా పార్లమెంట్ పరిధిలో జరిగిన కార్యక్రమం కాబట్టి దూరంగా ఉన్నారని అనుకుందామంటే… అటు మహబూబాబాద్ ప్రోగ్రామ్‌కు డుమ్మా కొట్టారు. వరంగల్ జిల్లాలో పట్టున్న నేతల్లో ఒకరు దొంతి మాధవరెడ్డి. 2014లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కక ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వియం సాధించారు. ఆ తర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రాకపోయినా తిరిగి సొంత గూటికే చేరారాయన. పార్టీ పట్ల నిబద్ధతతో ఉండే దొంతి అంటే హైకమాండ్‌కు కూడా కాస్త సాఫ్ట్ కార్నర్. కానీ…. జిల్లాలోని మిగతా నేతలతో కలవకపోవడం, నా రూటే సపరేటు,నేను అలగ్ అన్నట్టు ఉండటం పార్టీ వర్గాలకు మింగుడు పడ్డం లేదట.
ముఖ్యంగా తాజాగా జరిగిన వేం నరేందర్‌రెడ్డి సన్మాన కార్యక్రమానికి హాజరవకపోవడం గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. దొంతితో పాటు అయన ప్రధాన అనుచరుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సైతం అటెండ్ అవకపోవడం చర్చకు దారి తీసింది. వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ పరిధి నాయకులు మాత్రమే సన్మాన కార్యక్రమం నిర్వహించారు కాబట్టి మాధవరెడ్డి హాజరవలేదని అనుకుందామంటే….. అంతకు ముందు ఈ నెల 12న మహబూబాబాద్ జిల్లాలో అక్కడి నాయకులు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కూడా వెళ్ళలేదు. అంతే కాదు… వరంగల్ ప్రోగ్రామ్‌కి వస్తున్న వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి జిల్లా నేతల అనుచరులు పోటీలు పడి స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు. కానీ… నర్సంపేట ఎమ్మెల్యే అనుచరుల ఫ్లెక్సీలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా ఎందుకంటే… ఆ వర్గం వాదన కాస్త డిఫరెంట్‌గా ఉంది. జిల్లాలో ఉన్న ముఖ్య నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారట దొంతి. అందుకే వాళ్ళు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళలేదని చెబుతున్నారు. పార్టీ పటిష్టకు పాటు పాడాల్సిన నేతలు ఆధిపత్యపోరుతో జిల్లాలో కాంగ్రెస్‌ని దెబ్బతీస్తున్నారన్న కోపంతోనే మానేత దూరంగా ఉంటున్నారని కూడా అంటున్నారు దొంతి అనుచరులు. మంత్రి కొండా దంపతులు పాత కాంగ్రెస్ కంటే టిడిపి నుంచి పార్టీలో చేరిన వారికే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారని, అలాగే ఉమ్మడి జిల్లాలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారనేది దొంతి వర్గం వాదన. ఈ క్రమంలో గత మున్సిపల్ ఎన్నికల్లోనూ తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారాయన. ఇటీవల జిల్లా నేతలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న డిన్నర్ మీటింగ్‌కు కూడా నర్సంపేట ఎమ్మెల్యే హాజరవలేదు. దీంతో… ఎవ్వర్నీ పట్టించుకోడు, ఎవ్వరి మాటా వినడు, నాకునేనే అన్నట్టుగా ఉంటారన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి వరంగల్‌లో. మొత్తంగా వేం నరేందర్‌రెడ్డి సన్మాన కార్యక్రమానికి మాత్రం ఆయన మీద వ్యతిరేకత కంటే… జిల్లాలోని మిగతా నాయకుల తీరుతోనే అటెండ్ అవలేదన్న విశ్లేషణలు ఉన్నాయి.
