Site icon NTV Telugu

Munugode Assembly : ఉదయం ఒక పార్టీ.. సాయంత్రానికి మరో పార్టీలోకి జంప్.. | మునుగోడు

Munugode Elections

Munugode Elections

ఉపఎన్నిక జరిగే మునుగోడులో చిత్ర విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. మళ్లీ అక్కడి నుంచి ఏ క్షణంలో జంప్‌ అవుతారో అంతు చిక్కడం లేదట. డబ్బులకు కొదవే లేకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే కండువాలు మార్చేస్తున్నారు కొందరు లోకల్‌ లీడర్స్‌. ఈ జంప్‌ జిలానీలను చూసి జనం నవ్వుకొనే పరిస్థితి ఉందట.

మునుగోడు ఉపఎన్నికను రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అదే పనిగా తిరుగుతున్నారు. మునుగోడులోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ లోకల్‌ లీడర్లకు బీజేపీ కండువాలు కప్పేస్తున్నారు కూడా. ఒక్క రాజగోపాల్‌రెడ్డే కాదు.. టీఆర్ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌ నాయకులు సైతం ఆ పనిలోనే ఉన్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి అయ్యే వరకు ఎక్కడో ఒకచోట కండువాలు కప్పడమే పనిగా పెట్టుకుంటున్నారు. కాకపోతే డిమాండ్‌ గట్టిగా ఉండటంతో ఏ పార్టీ వచ్చి అడిగినా చేరడానికి నో చెప్పడం లేదు లోకల్‌ లీడర్స్‌. ఏ మాత్రం మొహమాటం లేకుండా పూటకో పార్టీ కండువా మార్చేస్తున్నారు.

టీఆర్ఎస్‌ సర్పంచ్‌లు.. ఎంపీటీసీలు కొందరు కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళ్లిపోయారు. వాళ్లందరినీ వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు అధికారపార్టీ నేతలు. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉదయం ఒక కండువా కప్పుకొని కనిపిస్తే.. సాయంత్రానికి మెడలో మరో పార్టీ కండువా కనిపిస్తోంది. అదే వ్యక్తి మరుసటి రోజు మెడలో ముచ్చటగా మూడోపార్టీ కండువా దర్శనం ఇస్తోంది. ఇటీవల చండూరు మండలంలో ఓ మాజీ సర్పంచ్ ఉదయం మంత్రి జగదీష్‌రెడ్డిని కలిశారు. సాయంత్రం రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వెళ్లి బీజేపీలో చేరారు. అదే మండలంలోని దొనిపాముల, చొప్పరివారిగూడెం సర్పంచ్‌లు.. వారం క్రితం రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వాళ్లంతా తిరిగి మంత్రి సమక్షంలో గులాబీ గూటికి వచ్చేశారు. ఇది ఒక్క చండూరు మండలానికే పరిమితం కాలేదు. మునుగోడు నియోజక వర్గం అంతా ఇదే పరిస్థితి.

సర్పంచ్.. ఎంపీటీసీ స్థాయి నేతలు పూటకో పార్టీ మారుతుంటే… డబ్బులు బాగానే వెనకేసుకున్నారు అనే టాక్ జనంలోకి వెళ్తోంది. ఒక్క సర్పంచ్ పార్టీ మారితే.. సగటున 15 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ వెనక్కి వస్తే ఐదారు లక్షలు ఇస్తున్నారట. ఇలా ఒక్కో నేత పార్టీ మారితే డబ్బులు… తిరిగి వెనక్కి వేస్తే డబ్బులు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఊరి జనం మాత్రం అలాంటి నేతల తీరు చూసి రుసరుసలాడుతున్నారట. ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు నోట్లు వెనకేసుకుంటున్నారు.. అయినా వాళ్లు చెప్పినోళ్లకు ఓటేయాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.

ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది. వెంట వెంటనే పార్టీ మారుతున్న నేతలపై.. ముందుగా డబ్బులు ఇచ్చిన పార్టీలు కస్సు మంటున్నాయట. అప్పటికే ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నాయట. తొలుత బీజేపీలో చేరి.. తర్వాత టీఆర్ఎస్‌ గూటికి తిరిగి వెళ్లిన వాళ్లపై కమలనాథుల నుంచి ఈ తరహా ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నేతలే లక్షలు పలుకుతున్నప్పుడు.. ఓటర్లకు కూడా భారీగా పార్టీలు ముట్టజెప్పుతాయని అనుకుంటున్నారట. హుజూరాబాద్‌లో ఆరు వేలు ఇచ్చారట.. ఇక్కడ ఇంకా ఎక్కువే ఇస్తారని కొందురు అంచనా వేస్తున్నారట. మరి.. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చి.. పోలింగ్ ముగిసే నాటికి ఏ పార్టీకి ఎంత చమురు వదులుతుందో చూడాలి.

 

Exit mobile version