Off The Road: పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతి, ఉపాధ్యక్షుడిగా దత్తి లక్ష్మణరావును నియమించాకే ఈ చర్చ ఊపందుకుందట. ఈ ఇద్దరు నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితులని, నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారన్న టాక్ బలంగా ఉంది. ఇద్దరి మీద అచ్చెన్న వర్గ ముద్ర ఉంది. దీంతో జిల్లా మీద పట్టు బిగించేందుకు మంత్రి వేరేవాళ్ళకు అవకాశాలు రాకుండా… తన మనుషుల్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయంగా ఆయన సామాజికవర్గం కూడా మరింత బలపడుతోందన్న భావనకొంతమంది నేతల్లో ఉందట. ఇది కేవలం పార్టీ పదవుల వ్యవహారం కాదని, భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు పునాది అన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులుగా తామే జిల్లా రాజకీయాలకు కేంద్రంగా ఉండాల్సిన దశలో, తమను పక్కన పెడుతున్నారని, పార్టీ పదవుల రూపంలో కొత్త పవర్ సెంటర్స్‌ను తయారు చేస్తున్నారన్న అసహనం ఎమ్మెల్యేల్లో పెరుగుతోందట. ఇక దీనికి సంబంధించిన మరో కొత్త కోణం గురించి కూడా చర్చ నడుస్తోంది.
Read Also: Smartphones: రూ.20 వేల రేంజ్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..? ఈ మొబైల్స్ పై ఓ లుక్కేయండి
ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కూడా తమ మాట వినకుండా ఎదురుతిరుగుతున్నారన్న అభిప్రాయం కొందరు సీనియర్స్‌లో ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అదే కారణంతోనే తమను ఇబ్బందులు పెడుతున్నారన్న భావన ఎమ్మెల్యేల్లో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి వాళ్ళ సన్నిహిత వర్గాలు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళను పక్కనపెట్టి పార్టీ పదవుల ద్వారా సమాంతర శక్తుల్ని తయారు చేయడం అంతర్గత సమతుల్యతకు ప్రమాదకరమన్న అభిప్రాయం జిల్లా టీడీపీలోని ఒక వర్గంలో ఉందంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో టికెట్ల పంపకం, స్థానిక సంస్థల ఎన్నికలు, పవర్ షేరింగ్ లాంటి విషయాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే… అచ్చెన్న వర్గం వాదన మరోలా ఉంది. పార్టీ నేతల్ని క్రమశిక్షణలో పెట్టడం, సీనియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడమే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడి లక్ష్యమని, అంతకు మించి వేరే ఉద్దేశ్యాలు లేవన్నది మినిస్టర్ సన్నిహితుల మాట. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విశ్వసనీయులైన నాయకుల్ని ముందుకు తెస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి తేజోవతి, దత్తి లక్ష్మణరావు నియామకాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇది కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమేగాక….కులం కలర్ కూడా వచ్చేయడంతో… భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
