Off The Road: పదవుల పందేరం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోందట. మెజార్టీ పోస్ట్‌లను ఒకే కులానికి కట్టబెడుతున్నారంటూ మిగతా నాయకులు అసహనంగా ఫీలవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సీనియర్ లీడర్స్‌కు ఇది అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందట. అధికారం లేనప్పుడు అన్ని సామాజిక వర్గాల నేతలు కష్టపడి పనిచేసినా… ఇప్పుడు మాత్రం ఒకే కులానికి పెద్ద పీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధిష్టానం బీసీ మంత్రం జపించడం బాగానే ఉన్నా… అందులోనూ ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేసి మిగతా వాళ్ళని విస్తరించడం ఏంటంటూ లోలోపల రగిలిపోతున్నారట. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను ఇచ్చినప్పుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత పామర్రుకి చెందిన వీరంకి గురుమూర్తికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇక కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కూడా అదే సామాజిక వర్గానికి, ప్రత్యేకించి అదే వీరంకి గురుమూర్తికి ఇవ్వడంపై మిగతా నాయకులు మండిపడుతున్నారు. బీసీలకే ఇవ్వాలనుకుంటే ఆయన తప్ప జిల్లాలో ఇక బీసీ నాయకులు ఎవరూ లేదా అన్నది అసంతృప్తుల క్వశ్చన్. దీంతో పదవుల పంపకం జిల్లాలో కులాల చిచ్చు రేపుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చాక ఆ పోస్ట్ కోసం కమ్మ సామాజిక వర్గం నుంచి కొందరు సీనియర్ లీడర్స్ తీవ్రంగా ప్రయత్నించారు. తమ పలుకుబడిని అన్ని రకాలుగా వాడినా ఉపయోగం లేకపోయింది. టీడీపీ అధిష్టానం కమ్మ నేతల్ని పక్కనబెట్టి అప్పటికే ఒక పదవి ఉన్న, గౌడ సామాజిక వర్గానికి చెందిన గురుమూర్తి వైపే మొగ్గింది. దీంతో ఒకే నాయకుడికి రెండు పదవులు ఎలా ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. మరోవైపు జిల్లాలో పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గౌడ సామాజిక వర్గానికే చెందిన కాగిత కృష్ణ ప్రసాద్ ఉన్నారు .ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె అనురాధను ఎంపిక చేయడంతో… కృష్ణా పోస్ట్ కూడా తమకే ఇస్తారని కృష్ణా కమ్మ నాయకులు ఆశించినా నిరాశే మిగిలింది.
ఇదే సమయంలో ఆల్రెడీ ఒక నామినేటెడ్ పదవి ఉన్న వీరంకి గురుమూర్తికే పార్టీ పోస్ట్ కూడా ఇవ్వడం ఏంటంటూ….కృష్ణా టీడీపీ సీనియర్స్ అంతా లోలోలప తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్ని పదవుల్ని ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం ఏంటన్నది కొందరి క్వశ్చన్. కూటమి ధర్మంలో భాగంగా ఇప్పటికే జనసేన బిజెపి నుంచి కూడా పోటీ పెరగడంతో చాలా చోట్ల అవకాశాలు కోల్పోతున్నామని, అలాంటప్పుడు ఉన్న కొద్ది ఛాన్స్‌లు కూడా ఒకే కులం కోటాలో ఇచ్చేసి మిగతా వాళ్ళని ఎండగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఒకరిద్దరు సీనియర్స్ అయితే…. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రస్తుత పదవుల పంపకానికి, రాబోయే స్థానిక ఎన్నికల్లో సీట్లకు ముడి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ, నామినేటెడ్ పదవుల పరంగా ప్రస్తుతం అన్యాయం జరిగిన వారి వర్గానికి రేపు స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర తేల్చుకోవాలనుకుంటున్నారట కొందరు సీనియర్స్. తీవ్ర అసంతృప్తి ఉన్నా… ఇన్నాళ్లు బయటపడకుండా ఉన్న నేతలు ఇక ఓపెనైపోయి… స్థానిక ఎన్నికల నాటికి జాగ్రత్త పడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం పెద్దలు ఎలా స్పందిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
