పార్టీ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ గేర్ మార్చారా? జీరో టాలరెన్స్ పేరుతో జనసేన ఎమ్మెల్యేలకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వబోతున్నారా? పార్టీ అధ్యక్షుడి వైఖరితో శాసనసభ్యుల్లో గుబులు మొదలైందా? ఇంతకీ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం? నా నంబర్ కూడా వస్తుందా అంటూ… వాళ్ళెందుకు టెన్షన్ పడుతున్నారు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… పార్టీ వ్యవహారాల పరంగా గేరు మార్చి.. స్పీడ్ పెంచారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా ఆయన యాక్షన్ ఉండబోతోందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రత్యేకించి క్రమ శిక్షణ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట ఆయన. అందులోనూ… పార్టీ ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో… పవన్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ మిగతా ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. వాళ్ళకు అంత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు…. మరి మన బాగోతాలు బయటపడితే పరిస్థితి ఏంటంటూ కొందరు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ విషయమై చాలా రోజులు మౌనంగా ఉన్న పవన్…త్రీ మెన్ కమిటీ నివేదిక ఆధారంగా రెండు రోజులు ముందు చర్య తీసుకున్నారు. ఆయన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేయించారు. మరోవైపు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న పోలవరం శాసనసభ్యుడు బాలరాజుకు సైతం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారట పార్టీ అధ్యక్షుడు. నాలుగు వారాల్లోగా పద్ధతి మార్చుకొని.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వాస్తవానికి ఇప్పటివరకు చాలా సార్లు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.. కానీ మొదటిసారి ఎవరు ఊహించని విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలను నేరుగా సచివాలయానికి పిలిచి మాట్లాడడం, తీరు మార్చుకోవాలి హెచ్చరించడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మమ్మల్ని పట్టించుకోవడంలేదులే… ఏం చేసినా చెల్లుబాటవుతుందని ఇన్నాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరించి, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలిన కొందరు జనసేన ఎమ్మెల్యేల్లో ఈ దెబ్బకు వణుకు మొదలైనట్టుతెలుస్తోంది.
ప్రస్తుతానికి ఇద్దరు అయిపోయారు… తర్వాత ఎవరి వంతు అంటూ ఎవరికి వారు టెన్షన్ పడుతున్నారట. అంతేకాదు, పార్టీ కార్యాలయంలో ఉన్న తమ ఉన్న సోర్స్ ద్వారా.. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరిని పిలవబోతున్నారంటూ ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే అవినీతి వంటి అంశాలపై వార్నింగ్ ఇచ్చారు. దీంతో… ఇప్పుడు లిస్టులో మా పేరు ఉందా అని ఆరా తీస్తున్నారట. నియోజకవర్గాల్లో స్థానికంగా వస్తున్న ఆరోపణలే ఎమ్మెల్యేలు ఇంత టెన్షన్ పడటానికి కారణం అంటున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ శాసనసభ్యుడి మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. తన నియోజకవర్గంలోని పరిశ్రమల్లో వాటాలు అడుగుతున్నారని, కలెక్షన్ కింగ్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే ధోరణితో ఓ కంపెనీ కూడా నియోజకవర్గం నుంచి వెనక్కి వెళ్లిపోయిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మట్టి మాఫియాతో అంటకాగుతున్నారట.
ఆయన తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి కూడా. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే స్థానిక కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం, సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టడం లాంటి వ్యవహారాల్లో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు కోనసీమ ప్రాంతానికి చెందిన మరో జనసేన ఎమ్మెల్యే మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అసలు కంటే కొసరు ఎక్కువన్నట్టు ఎమ్మెల్యే తమ్ముడే షాడోలా మారి మొత్తం నడిపిస్తున్నారట. స్థానికంగా ఇసుక, వసూళ్లు అన్నీ షాడో పర్యవేక్షణలోనే నడుస్తున్నాయన్నది ఓపెన్ టాక్. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కొడుకు, అల్లుడు…నియోజకవర్గాన్ని పంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకరు ఇసుక వ్యవహారాలు చూసుకుంటే… మరొకరు మిగతా పనుల్ని మేనేజ్ చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఆ నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అంటూ సొంత పార్టీ నాయకులే సెటైర్స్ వేసుకుంటున్నారు. ఇలా… జనసేన శాసనసభ్యులు చాలామంది మీద ఆరోపణలున్నాయి. ఇప్పుడిక వీటన్నిటికీ సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి సెట్ చేసే పని మొదలుపెట్టారట డిప్యూటీ సీఎం. నమ్మి సీటు ఇస్తే… అటు పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఇబ్బంది మచ్చ తెచ్చేలా కొంతమంది వ్యవహరిస్తున్నారంటూ పవన్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఇకపై మౌనాన్ని వదిలేసి… ఇవ్వాల్సిన రీతిలో ఎమ్మెల్యేలకు వార్నింగ్స్ ఇస్తారన్నది పార్టీ టాక్. తాను డైరెక్ట్‌గా ఫోకస్ పెడితే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తారని అంటున్నారు. మొత్తానికి పవన్ మొదలు పెట్టిన ఈ డిసిప్లిన్ ట్రీట్‌మెంట్‌కు జాగ్రత్తపడేవాళ్ళు పడతారు, లేదంటే డోస్ పెరగవచ్చన్నది జనసేన వర్గాల మాట.
