Site icon NTV Telugu

Off The Record: తుంగతుర్తిని డిసైడ్ చేసేదెవరు?

Maxresdefault

Maxresdefault

తుంగతుర్తిలో కాంగ్రెస్ టిక్కెట్ కావాలంటే వాళ్ళ ఆశీస్సులు ఉండాల్సిందేనా..? | OTR | Ntv

ఆ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ కావాలంటే వాళ్ళిద్దరి ఆశీస్సులు ఉండాల్సిందేనా? కాదు.. కూడదని సొంత పలుకుబడిని వాడుకుంటే… వెంటనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేస్తారా? వాళ్ళకు, వాళ్ళకు మధ్య ఎంతున్నాసరే… ఈ సెగ్మెంట్‌ విషయానికి వచ్చేసరికి ఒక్కటై పోతారా? అక్కడ పోటీ చేయాలనుకునే వారికి వాళ్ళిద్దరంటే ఎందుకంత భయం? ఇంతకీ… ఎక్కడుందా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు?

నల్గొండ జిల్లా…. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం….. జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ నేతలు పట్టు బిగించిన రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్‌ ఇది. ఇక్కడ కాంగ్రెస్‌ టిక్కెట్‌ రావాలన్నా… అభ్యర్థి గెలవాలన్నా… వాళ్ళిద్దరి ఆశీస్సులు తప్పకుండా ఉండాల్సిందేనట. నిన్న మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దర్ని ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ళ వానలు కలిపాయట. ఆ ఇద్దరే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.

చాలాకాలం తర్వాత ఒకే వేదిక మీదికి కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డి
చాలా కాలం తర్వాత వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఒకే వేదిక మీదికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వడగళ్ళ వాన బాధితుల్ని ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్‌ విఫలమైందంటూ ఏక స్వరం వినిపిస్తున్నారు ఇద్దరూ. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఒక్కటవడం తుంగతుర్తిలో హాట్‌ టాపిక్‌ అయింది. ఇద్దరికీ ఈ నియోజకవర్గం మీద పట్టున్నందున ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిని కలిసి డిసైడ్‌ చేస్తారా? లేక వేరెవరైనా చెయ్యి వేస్తారా అన్న చర్చ జోరందుకుంది. ఈ కలయిక స్థానిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేసులో ఉన్న సీనియర్‌ లీడర్‌ అద్దంకి దయాకర్‌కి చెమటలు పట్టిస్తోందట. ఇద్దరూ ఒక మాట మీదికి వస్తే.. ఈసారి దయాకర్‌కు టిక్కెట్‌ దక్కదేమోనన్న డౌట్స్‌ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయట.

2014, 2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అద్దంకి
2014, 2018 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన అద్దంకి దయాకర్ మరోసారి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. కొద్ది నెలల క్రితం ఓ వేదిక నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద రచ్చకు దారితీశాయి. మరో నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మీద గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అద్దంకి దయాకర్‌. దీంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి ఏం డిసైడ్‌ చేస్తారోనన్న టెన్షన్‌ దయాకర్‌ అనుచరుల్లో పెరుగుతోందట. ఓడిపోయిన రెండు సార్లు తనకు దామోదర్ రెడ్డి సహకరించకపోవడం వల్లేనని దయాకర్‌ చెప్పడం, ఆ మాటలను మాజీ మంత్రి ఖండించడం జరిగాయి. ఆ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుని తన బలంగా ప్రొజెక్ట్‌ చేసుకున్నారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. అదే సమయంలో ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కూడా కీలకం కావడంతో…. ఆ ఇద్దరి ఆశీస్సులు ఉంటేనే తుంగతుర్తిలో సీటు వచ్చేదైనా, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచేదైనా అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆశావహులంతా హైదరాబాద్‌లోని ఆ ఇద్దరి ఇళ్ళకు క్యూ కడుతున్నారట.

ఆ ఇద్దరినీ ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్‌ ఆశావహులు
క్యాడర్ బలంగా ఉన్నా… లీడర్ స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం… పోటీలో ఉండే అభ్యర్థి స్థానికేతరుడు కావడం వల్లే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్న అభిప్రాయం సైతం ఉంది.2018లో టికెట్ ఆశించి భంగపడి… ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి.. సస్పెండ్‌ అయ్యారు వడ్డేపల్లి రవి. కొన్నాళ్ళ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారాయన. అయితే రవి మీద పార్టీ ఆరేళ్ళ పాటు వేటు వేసింది. ఇంకా సస్పెన్షన్‌ ఎత్తేయలేదు. ఇప్పుడు ఆయనతో పాటు రాష్ట్ర పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం, మరికొందరు నేతలు రేసులో ఉన్నారు. అంతా ఎవరి స్థాయిలో వారు ఆ ఇద్దర్నీ ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఇన్నాళ్ళు ఎంపీ, మాజీ మంత్రికి పడకపోవడంతో ఒకరు అవునంటే.. మరొకరు కాదంటారేమోనన్న టెన్షన్‌ ఈ ఆశావహుల్లో ఉండేదట.

కానీ…తాజాగా ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించడంతో… ఆ టెన్షన్‌ తప్పిందని తెగ సంబరపడిపోతున్నారట ఆశావహులు. వాళ్లిద్దరూ కలిసి ఒక మాట అనుకుంటే… ఇక తుంగతుర్తిలో తిరుగే ఉండదని అనుకుంటున్నారు కాంగ్రెస్‌ టిక్కెట్‌ రేసులో ఉన్న నాయకులు. ఇద్దరితో ఇక్కట్లు లేకుంటే ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా… గెలిచేస్తామన్న ఆనందంలో ఉన్నారట. అయితే ఇప్పుడు ఉన్నది ఒకటే క్వశ్చన్‌. ఈసారి కాంగ్రెస్‌ టిక్కెట్‌ విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఇప్పుడున్న ఆశావహుల్లో ఒకరిని ఎంపిక చేస్తారా? లేక కొత్తగా ఎవరినైనా ప్రతిపాదిస్తారా అన్నది తేలాలి. అదే జరిగితే… అద్దంకి దయాకర్‌ పరిస్థితి ఏంటి? రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎంతో కొంత కేడర్‌ ఉంటుంది. ఆ కేడర్‌ కొత్త అభ్యర్థికి ఎంత వరకు సహకరిస్తుందో తేలాలి. మొత్తంగా చూస్తే… ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఫలితాన్ని ఇద్దరు ఓసీ నేతలు డిసైడ్‌ చేయడం కొసమెరుపు.

Exit mobile version