పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. బలమైన నాయకులు ఉన్నా.. అక్కడ పార్టీ బలంగా లేదు. స్వపక్షంలోని ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి.. తెరవెనుక గోతులు తవ్వడానికే వారికి సమయం సరిపోవడం లేదట. వరుసగా ఓటమి పలకరిస్తున్నా సీన్‌లో ఎలాంటి మార్పు లేదన్నది తమ్ముళ్ల మాట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
2009 ఎన్నికల నుంచి సాలూరులో టీడీపీ కుదేలు
ఇదే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ రాజకీయాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే భంజదేవ్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి వర్గాల మధ్య అస్సలు పడటం లేదు. కత్తులు నూరుకోవడానికి ఎంత సమయం అయినా కేటాయిస్తారు కానీ.. సాలూరులో కలిసి సాగడానికి.. టీడీపీ బలోపేతానికి ఇద్దరూ అస్సలు టైమ్ ఇవ్వరని నెత్తీనోరూ కొట్టుకుంటారు తెలుగు తమ్ముళ్లు. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచిన పీడిక రాజన్నదొర ప్రస్తుతం డిప్యూటీ సీఎం. 2009 నుంచి మారిన పరిణామాలతో సాలూరులో టీడీపీ కుదేలైంది. అప్పటి వరకు వరుసగా సాధించిన విజయాలు చరిత్రగా మారిపోయాయి.
1994, 1999, 2004లో గెలిచిన భంజదేవ్
భంజదేవ్ 1994, 99, 2004లో సాలూరులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో కుల ధృవీకరణ విషయంలో భంజదేవ్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దాంతో 2009లో భంజదేవ్‌కు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన గుమ్మడి సంధ్యారాణి ఆ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భంజదేవ్ వర్గం సహకరించ లేదనే విమర్శలు వచ్చాయి. ఇంతలో కుల ధృవీకరణ వివాదం నుంచి బయట పడటంతో 2014లో తిరిగి భంజదేవ్‌కు టీడీపీ టికెట్ ఇచ్చింది. సంధ్యారాణిని అరకు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇద్దరూ ఓడిపోయారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సంధ్యారాణిని ఎమ్మెల్సీని చేసింది టీడీపీ. 2019లో ఆమె టికెట్ ఆశించినా టీడీపీ పార్టీ భంజదేవ్ వైపే మొగ్గు చూపించింది. మళ్లీ టీడీపీకి ఓటమే పలకరించింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారు.
ఓటముల నుంచి గుణపాఠం లేదా?
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో భంజదేవ్, సంధ్యారాణి వర్గాల్లో మెల్లగా కదలికలు కనిపిస్తున్నాయి. అయితే గత ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఎవరికివారే అన్నట్టు ఇద్దరూ కత్తులు దూస్తున్నారట. భంజదేవ్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటే.. సంధ్యారాణికి టీడీపీ పొలిట్‌బ్యూరోలో చోటు ఇచ్చారు. పార్టీ పరంగా ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్నప్పటికీ ఆ మేరకు సాలూరులో టీడీపీ పురోగతి లేదన్నది కేడర్ చెప్పేమాట. 2009 ఎన్నికల్లో బీజం పడ్డ వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఆ వర్గంలో ఉన్నవారిని ఈ వర్గంవారు దగ్గరకు రానివ్వడం లేదు. వచ్చే ఎన్నికలు రాజకీయంగా కీలకమని.. కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలకు టీడీపీ అధిష్ఠానం చెబుతున్నా.. అవి పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ఇటీవల టీడీపీ అధినేత జిల్లా పర్యటనలోనూ భంజదేవ్, సంధ్యారాణి వర్గాలు ఎవరికి వారుగానే కనిపించారు.
సంధ్యారాణిపై భంజ్‌దేవ్ అధిష్ఠానానికి ఫిర్యాదు?
ఆ మధ్య టీడీపీని వీడి బీజేపీ తదితర పార్టీల్లోకి వెళ్లిన నాయకులు తిరిగి వస్తామంటే ఇద్దరు నేతలు పట్టించుకోవడం లేదట. మక్కువ మండలంలో బలమైన నాయకులను పక్కన పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈరెండు అంశాల్లో సంధ్యారాణి వైఖరిని ప్రశ్నిస్తూ.. పార్టీ పెద్దలకు భంజదేవ్ ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ సమస్యలపై.. రాజకీయంగా కలిసి వచ్చే అంశాలను ఇద్దరూ క్యాచ్ చేయడం లేదని కేడర్ కుత కుత లాడుతోందట. మరి.. ఇక్కడి అంశాలను సెట్ చేయడానికి పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో అని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారట.

