Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!

Off The Record

Off The Record

Off The Record: కామారెడ్డి జిల్లా బాన్సువాడ హస్తం పార్టీలో ఎమ్మెల్యే పోచారం-మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరిందంటున్నారు. తాజాగా చేపడుతున్న సొసైటీ ఛైర్మన్ల భర్తీ అంశం… వీళ్ళిద్దరితో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌తో కూడా పంచాయితీ పెట్టిందట. కొద్ది రోజుల నుంచి పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. నేను కాంగ్రెస్‌ను వదిలి ఎక్కడికీ పోను.. ఇక్కడే ఉంటా, ఈసారి బాన్సువాడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు జిల్లా లోకల్‌ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. అటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నామినేటెడ్ పదవులను మొదటి నుంచి కాంగ్రెస్ జెండాలు మోసిన వారికి కాకుండా.. ఇతరులకు కట్టబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వర్గం ఫైరవుతోంది.

పనిలో పనిగా..లోక్‌సభ ఎన్నికల్లో బాన్సువాడలో 23వేల మెజార్టీ ఇవ్వడంవల్లే సురేష్ షెట్కార్‌ గెలుపు సాధ్యమైందని, అయినాసరే… ఆయన ఇక్కడి కార్యకర్తలు నాయకులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఏనుగు రవీంద రెడ్డి, సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై బహిరంగ విమర్శలు చేయడం గురించే ఇప్పుడు బాన్సువాడ రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆయన మాటల వెనుక మర్మం ఏంటనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన పోచారం… కాంగ్రెస్‌లోకి ఎంట్రీతో లోకల్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయింది. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్‌గా అంతర్గత పోరు నడుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీలో.. మాజీ ఎమ్మెల్యే వర్గానికి పోచారం హ్యాండిస్తున్నారన్నది ప్రధాన అభియోగం. 70శాతం పదవుల్ని పాత వాళ్ళకు, మిగతా 30శాతాన్ని కొత్త కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ చేసింది. కానీ… బాన్సువాడలో మాత్రం రవీందర్ రెడ్డి వర్గీయులకు సొసైటీ ఛైర్మన్లుగా అవకాశం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కోపంతో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే… ఎంపీ సురేష్ షెట్కర్ ను జోక్యం చేసుకోవాలంటూ కోరారట. ఐతే ఆయన కూడా సరిగా స్పందించడం లేదని, పైగా పోచారానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏనుగు వర్గం గుర్రుగా ఉందంటున్నారు. ఈ కారణంగానే మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్‌ ఎంపీని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనుకుంటే.. నష్టం జరుగుతోందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఏనుగు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా పోచారం వర్గం చేస్తున్నదేనని అంటున్నారాయన. అందుకే.. బాన్సువాడలోనే ఉంటా, ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గులాబీ పార్టీలోకి రీ ఏంట్రీ ఇస్తున్నారనే ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు ఏనుగు రవీందర్‌రెడ్డి. అయితే, ఆయన తీరుపై ఇటు పోచారం, అటు సురేష్ షెట్కర్ వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో సొసైటీ చైర్మన్లుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారంటూ పోచారంపై ఫిర్యాదు చేస్తానని రవీందర్‌రెడ్డి చెప్పారట. ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు కాస్తా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వయా ఎమ్మెల్యే అన్న తీరుగా మారిందంటున్నారు. ఈ వ్యవహారంలో పాత కాంగ్రెస్ శ్రేణులు సైతం లోలోపల రగిలిపోతున్నాయంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ.. ముగ్గురు నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా చేసిందంటున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు..పార్టీని బలహీనపరుస్తోందని క్యాడర్ ఆవేదన చెందుతోందట. బాన్సువాడ కాంగ్రెస్‌కు అధిష్టానం ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తుందో వేచి చూడాలి.