NTV Telugu Site icon

Off The Record: పెద్దాపురంపై క్లారిటీ వచ్చినట్టేనా?

Sddefault (3)

Sddefault (3)

పెద్దాపురం బరిలో అభ్యర్థులపై క్లారిటీ..! l Off the Record l NTV

ఎన్నికలకు ఏడాది ముందే ఆ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించాయి. కేడర్‌కు క్లారిటీ ఇచ్చినా.. అభ్యర్థులకే డౌట్ కొడుతోందట. దీనికి కారణం స్థానికంగా నెలకొన్న పరిస్థితులేనట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? ఏమా రగడ? లెట్స్‌ వాచ్‌..!

పెద్దాపురం బరిలో అభ్యర్థులపై క్లారిటీ..!
ఇదే ఆ నియోజకవర్గం.. పెద్దాపురం. ఏపీలో ఎన్నికలకు ఏడాదికి ముందే వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చిన నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఆయన టీడీపీ నేత. అధికారపార్టీ వైసీపీకి పెద్దాపురం ఇంఛార్జ్‌గా ఉన్నారు దవులూరి దొరబాబు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం. సొంత సెగ్మెంట్‌ కాకపోయినా.. టీడీపీ అధిష్ఠానం నిర్ణయంతో పెద్దాపురంలో పోటీ చేసి రెండుసార్లు గెలిచారు చినరాజప్ప. ముచ్చటగా మూడోసారి ఆయనే అభ్యర్థి అని ఇటీవలే జిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు అలా అన్నారో లేదో ఆ ప్రకటనకు అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇప్పుడు వైసీపీ ఇంఛార్జ్‌ దొరబాబు వంతు వచ్చింది. దీంతో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చినా పెద్దాపురం రానున్న రోజుల్లో పెద్ద పంచాయితీకే వేదిక అవుతుందని అనుకుంటున్నారు.

దొరబాబే పోటీ చేస్తారన్న ఎంపీ మిధున్‌రెడ్డి…!
చినరాజప్పను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రెండు వారాల వ్యవధిలోనే వైసీపీ నుంచి కూడా ఆ పార్టీ కోఆర్డినేటర్‌ ఎంపీ మిధున్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు. పెద్దాపురం అభ్యర్థి విషయంలో సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న పేర్లు కరెక్ట్ కాదని.. ఇక్కడ అధికారపార్టీ నుంచి పోటీ చేసేది ఇంఛార్జ్‌ దొరబాబేనని మిధున్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి తోట వాణి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త మాజీ మంత్రి తోట నరసింహం. తోట దంపతుల్లో ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకున్నా.. మొన్నటి ఓటమి తర్వాత సైలెంట్‌ అయ్యారు. దాంతో అమెరికా నుంచి వచ్చిన దొరబాబుకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. 2009లోనే పీఆర్పీ, 2014లో టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించి.. చివరకు 2019లో వైసీపీలో చేరారు దొరబాబు. అప్పుడు కూడా టికెట్‌ ఆశించినా వైసీపీలో వర్కవుట్‌ కాలేదు.

వైసీపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు దొరబాబుకు సహకరిస్తారా?
వైసీపీ నుంచి దొరబాబుతోపాటు మరికొందరి పేర్లు చర్చల్లోకి వచ్చాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు.. వీరిద్దరూ కాకపోతే 2014లో పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడు రేస్‌లో ఉండొచ్చని ప్రచారం సాగింది. ఇప్పుడు ఎంపీ మిథున్‌రెడ్డి ప్రకటనతో టికెట్‌ ఆశించిన నేతలు దొరబాబుకు ఎన్నికల్లో సహకరిస్తారా? తోట దంపతులు మళ్లీ యాక్టివ్‌ అయితే.. వారి విషయంలో పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రశ్నలుగా ఉన్నాయి. టీడీపీలో చినరాజప్ప పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పెద్దాపురంలో టీడీపీలోని గుణ్ణం చంద్రమౌళి, బొడ్డు వెంకటరమణ చౌదిరి వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఎదుటే చినరాజప్ప వద్దని నినాదలు చేసింది వీళ్ల వర్గానికి చెందిన వారేనని చెబుతున్నారు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీల శిబిరాల్లో పైకి చెప్పకపోయినా ఓ విధమైన అలజడి మొదలైంది. తమనే అభ్యర్థులుగా ప్రకటించడంతో చిన రాజప్ప, దొరబాబు సంతోషంగా ఉన్నా.. ఆశావహులు.. అసంతృప్త నేతలు ఏం చేస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Show comments