Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014, 18, 23లో వరుసగా… బీఆర్ఎస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ… 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. అక్రమ మైనింగ్ కేసులు ఓ వైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు… ఇలా అష్ట దిగ్బంధనంతో…. ఉక్కిరిబిక్కిరయ్యారు ఎమ్మెల్యే. ఆ పరిస్థితుల్లో… 2024 జులైలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మహిపాల్‌రెడ్డి.
READ ALSO: Yadagirigutta : యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 5 కొత్త సేవలు.!
కేసుల బాధ నుంచి ఉపశమనం పొందుదామని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే… అక్కడ కూడా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి ఆయనకు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌తో రాజకీయ విబేధాలు ఒక సమస్య అయితే…, పార్టీ ఫిరాయింపుల కేసు ఇంకో టెన్షన్. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారాయన. ఒకవేళ వెళ్దామని ఆయన అనుకున్నా… లోకల్ కాంగ్రెస్ లీడర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలిసింది. ఓ సందర్భంలో అయితే… అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టుండించారు. ఇలా ఎటూ పాలుపోక, అటు ఇటు కాని మనసుతో ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి… తాను గెలిచిన బీఆర్ఎస్‌తో ఇప్పటికీ టచ్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉంటే… ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావుతో కలిసి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కొల్లూరులో ఎన్నికల ప్రచారం చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇక నియోజవర్గంలోని కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్, నీలం మధుతో ఎమ్మెల్యేకు అస్సలు సఖ్యత లేదు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహకు, మహిపాల్ రెడ్డికి మధ్య విబేధాలు రావడంతో అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని మధనపడిపోతున్నారట. తాను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని, ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేయలేదాయన. ఎక్కడా ప్రచారం చేయలేదు. మరికొన్ని రోజుల్లో మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో… ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. అందుకే తన అనుచరులతో ఓ సమావేశం పెట్టారట.
ఏ పార్టీలో ఉండాలన్న పాయింట్ మీదే సమావేశం జరిగిందట. మెజార్టీ అనుచరగణం మాత్రం ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో…. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్ట్‌లో ఉంటడంతో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారట ఎమ్మెల్యే. ఈ అనిశ్చితికి కొన్ని రోజుల్లోనే తెరపడుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కేసు నడుస్తున్నందున తిరిగి ఘర్ వాపసీ అంటే… సమస్యలు వస్తాయా? లేక మహిపాల్ రెడ్డి పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చినందున అడ్డంకి తొలిగిపోయినట్టేనా అన్న మీమాంసలో ఉన్నారట. లీగల్ ఒపీనియన్ తర్వాత త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే… ఆయన వ్యవహారం మనిషి ఒకచోట, మనసు మరో చోట అన్నట్టుగా ఉందని చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
READ ALSO: India Defence Deal: భారత్ భారీ డీల్.. రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
