ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా… కింది స్థాయిలో మాత్రం కంగారు పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న కొత్త చర్చలు మొదలయ్యాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. అదేంటి..? కీలకమైన స్థానిక ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందన్నది కామన్‌గా వచ్చే ప్రశ్న. దానికి సమాధామంగా… మీ డౌట్స్ కరెక్టేగానీ… వాస్తవ పరిస్థితులు వేరని అంటున్నారట ఈ చర్చలు పెడుతున్న వారు. అధికార పక్షంగా… కూటమికి ఈ ఎన్నికలు చాలా కీలకం. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి మా బలం ఏ మాత్రం తగ్గలేదు…. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవడానికి ఆ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. అందుకే కూటమి పెద్దలు ఇప్పట్నుంచే ఆ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పోలీస్ సహా… వివిధ విభాగాల్లో తమ అనుకూల అధికారుల్ని ఇప్పట్నుంచే మోహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న వైసీపీ కేడర్ మాత్రం… ఈ పరిస్థితుల్లో మనం పైచేయి సాధించగలుగుతామా? స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ముందు నిలబడగలుగుతామా అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. ఇంకా చెప్పాలంటే… పవర్‌లో ఉన్నవాళ్ళు ప్రయోగించే రకరకాల అస్త్రాలను తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదన్న చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో… తాము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేయకుండా దూరంగా ఉన్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారట. అప్పట్లో టీడీపీ నేరుగా బరిలో దిగలేదు.
తమకు బలం ఉందనుకున్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులను నిలిపి వాళ్ళకు మద్దతిచ్చింది. ఇప్పుడు మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కింది స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగినా… 95 శాతం స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ. అధికారంలో ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో సహజంగానే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో ఉండే విస్తృతాభిప్రాయం. దాని ప్రకారమే…. ఏం జరుగుతుందో ఏమో… పైగా ఇప్పుడు బరిలో దిగి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్న మాటలు వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్నాయట. స్థానిక ఎన్నికల్లో పోరాడాల్సింది కూడా వాళ్ళే కావడంతో… ఆ అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. కానీ… అదే సమయంలో మరో రకమైన డౌట్స్ కూడా వస్తున్నాయట పార్టీ నాయకులకు. చర్చలు జరిగినా, గుసగుసలు వినిపించినా… అవన్నీ కింది స్థాయిలోనేగాని, అధిష్టానం మనసులో ఏముందో ఇంతవరకు తెలియదు. అసలు పార్టీ అధ్యక్షుడు జగన్ మనస్తత్వం ప్రకారం.. అలా వెనకడుగు వేయడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట మరి కొందరి నుంచి.
151 సీట్ల భారీ విజయం నుంచి 11 సీట్ల ఘోర పరాజయానికి పడిపోయినా… వెంటనే తేరుకున్న పార్టీ అధ్యక్షుడు… బూత్ లెవల్ నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నారని, అదంతా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే కావచ్చన్నది కొందరు వైసీపీ నేతల అభిప్రాయం. అత్యంత కీలకమైన పీఏసీ కమిటీల నుంచి అనుబంధ విభాగాల వరకు పార్టీ పదవులన్నిటిని ఓడిన ఏడాదిన్నరకే భర్తీ చేశారంటే… అదంతా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మీద పట్టు బిగించడానికేనన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఇలా… పార్టీలోనే రెండు రకాల అభిప్రాయాలున్న క్రమంలో… అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీ సర్కిల్స్‌లో. ఎన్నికల బరిలో నిలుస్తుందా.. లేక అస్త్ర సన్యాసం చేస్తుందా..? అదిఇదీ కాదని గతంలో టీడీపీ చేసినట్టుగా ఇండిపెండెంట్ అభ్యర్థులతు వెనుక నుంచి మద్దతు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
