OTR : వైసీపీ మేయర్ రేస్‌లో ముగ్గురు వారసురాళ్లు.. ఎవరు ఎక్కడ?

Ycp

Ycp

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఈక్వేషన్స్‌ అండ్‌ కేలిక్యులేషన్స్‌ కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయా? అధికారంలో లేం కాబట్టి హ్యాండ్సప్‌ అనకుండా… గట్టిగా పోరాడాలని నాయకులకు ఇప్పటికే చెప్పేసింది అధిష్టానం. కీలకమైన కార్పొరేషన్స్‌లో పోటీకి వారసురాళ్ళ పేర్లు తెరపైకి రావడం కూడా అందులో భాగమేనా? ఏయే మున్సిపల్‌ కార్పొరేషన్స్‌లో లెక్కలు ఆసక్తికరంగా మారుతున్నాయి? ఎవరా రాజకీయ వారసురాళ్ళు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో…. విశాఖ, గుంటూరు, నెల్లూరు కార్పొరేషన్స్‌ను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. ఈసారి కూడా… ఆ మూడిటి మీద గట్టిగా గురి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు, ప్రమాణాలను పాటించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అనుభవం, దూకుడు తత్వం కలబోతగా అభ్యర్థిని ఖరారు చేస్తే… అధికార కూటమిని గట్టిగా ఢీ కొట్టవచ్చని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. ఆ క్రమంలోనే కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. విశాఖ నుంచి మండ‌లిలో విప‌క్షనేత‌ బొత్స స‌త్యనారాయ‌ణ కుమార్తె అనూష, గుంటూరు నుంచి మాజీమంత్రి అంబ‌టి రాంబాబు కుమార్తె మౌనిక, నెల్లూరు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్దన్ రెడ్డి కుమార్తె పూజిత పేర్లు పరిశీలిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ మేయర్ పీఠం.. వైసీపీకి కీలకమైన స్థానిక రాజకీయ కేంద్రం. అందుకే ఈసారి కూడా ఇక్కడ‌ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కల్లో భాగంగానే బొత్స అనూష పేరు తెరపైకి వచ్చిందట. ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్న అనూషకు.. ఇటీవల భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ. వాస్తవానికి ముందుగా ఆమెను జడ్పీకి పోటీ చేయించే ఆలోచనలో బొత్స ఉన్నారనే చర్చ జరిగింది. కానీ… తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో…. భీమిలి బాధ్యతలు అనూష చేతికి వచ్చాయి. ఈ క్రమంలో… ఓవైపు భీమిలిలో పార్టీని బలోపేతం చేస్తూనే.. విశాఖ మేయర్ రేసులో అనూషను నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ అధిష్టానానికి వచ్చినట్టు సమాచారం. ఒకవైపు కుటుంబ రాజకీయ వారసత్వం.. మరోవైపు ప్రత్యక్షంగా నియోజకవర్గ బాధ్యతలు.. ఈ రెండింటినీ కలిపి చూస్తే.. బొత్స అనూష మేయర్ రేసులో ఉండటం గురించి పెద్దగా ఆలోచించాల్సిందేం లేదని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా… అట్నుంచి రియాక్షన్‌ ఏంటన్నదే ఇక్కడ అసలు పాయింట్‌. ఇక గుంటూరు కార్పొరేషన్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పేరు పరిశీలనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో రాంబాబు ఇంటిపై దాడి.. కేసులు.. అరెస్ట్.. సమయంలో మౌనిక పొలిటికల్‌ స్క్రీన్‌ మీదికి వచ్చారు. అప్పుడు తండ్రికి మద్దతుగా నిలవడమే కాకుండా.. అధికార పక్షానికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. రాంబాబుకు సరైన రాజకీయ వారసురాలు దొరికిందని అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చలు సైతం జరిగాయి. అయితే.. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మౌనిక అంతగా కనిపించడం లేదు. అయినాసరే…గుంటూరు మేయర్ బరిలో దింపితే బాగుంటుందన్నది వైసీపీ లెక్కగా తెలుస్తోంది. అటు నెల్లూరు కార్పొరేష‌న్ విష‌యానికి వ‌స్తే… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేరు పరిశీలనలో ఉందట. గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ సమయంలో పూజిత కూడా తండ్రికి అండగా నిలిచారు.

ఆరోపణలపై రాజకీయంగా స్పందించారు. ప్రస్తుతం వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో ఉన్నారు పూజిత. మిగిలిన ఇద్దరితో పోలిస్తే.. కాకాణి పూజితకు పార్టీ వ్యవహారాల్లోనూ ప్రత్యక్ష రాజకీయ యాక్టివిటీ ఉండ‌టం ప్లస్‌ కావచ్చని అంటున్నారు. ఆ రకంగా మూడు ముఖ్యమైన కార్పొరేషన్స్‌లో ముగ్గురు వారసురాళ్ళను బరిలో దింపితే… కేడర్‌లో కూడా ఉత్సాహం పెరుగుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. తండ్రుల సీనియారిటీకి కూతుళ్ళ దూకుడు తోడైతే… రెండు జనరేషన్ల ఓటర్లను ఆకట్టుకోవచ్చన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురి అభ్యర్థిత్వాలను ఇంకా ఖరారు చేయకపోయినా… ఒకేసారి తెరపైకి తీసుకురావడం వెనుక వైసీపీ వ్యూహమేంటి అన్న డిస్కషన్స్‌ సైతం నడుస్తన్నాయి. ఒకవైపు సీనియర్ నేతల కుటుంబాలకు రాజకీయ ప్రాధాన్యం, మరోవైపు మహిళా నాయకత్వాన్ని పెంచడం, ఇంకోవైపు స్థానిక ఎన్నికలను పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో కేడర్‌కు సంకేతం ఇవ్వడం లాంటి అన్ని లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్లాన్‌లో భాగంగానే… వారసురాళ్ళ పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అటువైపు నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్నది ఆసక్తికరంగా మారింది.రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే ఈ మూడు పేర్లను ముందుకు తీసుకెళ్లే అవకాశమే ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. దాంతో పాటు స్థానిక రాజకీయ సమీకరణలు, కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద పేర్లు వినిపిస్తున్నాయి.. లెక్కలు మారుతున్నాయి. ఇవే తుది లెక్కలైతే గనక స్థానిక ఎన్నికల్లో ఈక్వేషన్స్‌ ఎలా మారతాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.