జీవిత కాలపు కోరిక నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆ టీడీపీ సీనియర్ భావిస్తున్నారా? అంత సీన్ లేదని అర్ధమవుతున్నా…. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టుగా దింపుడు కల్లం ఆశలతో ట్రయల్స్ వేస్తున్నారా? అందుకే సీఎం చంద్రబాబు ముఖం చూడ్డానికి ఇష్టపడలేదా? ఒక్క ఛాన్స్… ఇంకొకే ఒక్క ఛాన్స్ అంటూ డిఫరెంట్‌గా నిరసన తెలుపుతున్న ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఏంటా వ్యవహారం? టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీ జెండా తెలియని నాయకుడు యనమల రామకృష్ణుడు. అందుకు తగ్గట్టే పార్టీ కూడా ఆయనకేం తక్కువ చేయలేదు. ఈసారి తప్ప గతంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా… ఆయనకు పదవి గ్యారంటీ. పవర్ లేని సందర్భాల్లో కూడ యనమలకు చాలా ఛాన్స్‌లు ఇచ్చింది టీడీపీ. అయితే… అదంతా గతం. 2024లో తొలిసారి రామకృష్ణుడు లేకుండానే క్యాబినెట్ కూర్పు జరిగిపోయింది. ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. కొత్త తరం రాజకీయాలు జరగాలంటూ…ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. అందుకు అనుగుణంగానా అన్నట్టు… యనమల పెద్ద కూతురుకు తుని ఎమ్మెల్యే గా, చిన్న అల్లుడికి ఏలూరు ఎంపీగా అవకాశం దక్కింది.
వియ్యంకుడు మైదుకూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సరే…. నాకేంటి? అయితే నాకేంటి… అంటున్నారట ఈ సీనియర్. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన కోరిక. ఆ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. సంక్షోభం సమయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని నిలబెట్టానని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కనీసం అందుకు కృతజ్ఞతగా అయినా…. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నది ఆయన వెర్షన్. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక బహిరంగ లేఖలు రాస్తున్నారు. తన కెరీర్ మొత్తంలో ప్రస్తావించని కులాల కంపును కూడా ఆ మధ్య రేపే ప్రయత్నం చేశారు.
అదంతా ఒక ఎత్తయితే…తాజాగా నేరుగా సీఎం చంద్రబాబుకే తన అసంతృప్తిని డైరెక్ట్‌గా తెలియజేసే ప్రయత్నం జరిగిందట. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి గత వారం కాకినాడ వచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా…లేట్ అయి… వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉన్నా… వెనక్కి తగ్గకుండా ఆలస్యంగానైనా వచ్చి నేరుగా అటెండ్ అయ్యారు సీఎం. కానీ… యనమల మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబు నేరుగా జిల్లాకు వచ్చినా… సీనియర్ లీడర్ కనీస ఆహ్వానం పలక్కపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వచ్చే జూన్‌లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది.
ఆ విషయం తెలిసే…యనమల ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో రామకృష్ణుడు పార్టీ కోసం కష్టపడ్డారు, దాన్ని ఎవరూ కాదనలేరుగానీ… అంతకుమించి పార్టీ కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చింది కదా అన్నది టీడీపీలోని ఓ వర్గం వాదన. సీఎం జిల్లాకి వచ్చినా కనీసం కలవక పోవడం కరెక్ట్ కాదు కదా అన్నది వాళ్ళ వాదన. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం రామకృష్ణుడుకు రావడం లేదట. ఒకవేళ కలిసినా ఆయన చెప్పిన విషయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదట.. అలాంటప్పుడు ఫార్మాలిటీగా ఫోటోల కోసం వెళ్లడం ఎందుకన్నది ఆయన అనుచరుల వాదన. మొత్తానికి రాజ్యసభ రేసులో ఉండడానికి యనమల ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.. చంద్రబాబు వచ్చినా సౌండ్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. అట్నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
