Off The Record : సడన్గా ఏదో బలమైన శక్తి వీళ్ళందర్నీ కలిపిందా?

Warangal

Warangal

నిన్నటిదాకా…. ఉప్పు నిప్పులా చిటపటలాడిపోయారు. అసలు ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ… ఇప్పుడు అలయ్‌ బలయ్‌ అంటూ పాలు నీళ్ళలా కలిసిపోయారు. కలిసి భోజనాలు చేసేశారు. ఇదంతా చూస్తుంటే… అసలు వీళ్లు వాళ్ళేనా అని డౌట్‌ కొడుతోందట చాలా మందికి. స్టాక్‌ మార్కెట్‌ సూచీలాగా… అంత ఓలటైల్‌ రిలేషన్స్‌ ఉన్న ఆ నేతలు ఎవరు? వాళ్ళ మధ్య శత్రుత్వానికి ఫుల్‌ స్టాప్‌ పడినట్టేనా…? లేక జస్ట్‌ కామా మాత్రమేనా? ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు తాజాగా కలిసి భోంచేశారు. మంచీచెడు మాట్లాడుకున్నారు. దీని గురించే ఇప్పుడు జిల్లా పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. విభేదాల కథకు ఇది ఫుల్‌ స్టాపా..? లేక కామా మాత్రమేనా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి కొందరికి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్‍ ఆఫీసులో నేతలందరికీ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ విందు సమావేశం కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొదటిసారి నాయిని నివాసానికి వచ్చారు. అలాగే…ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మే.ర్‌ గుండు సుధారాణి.. ఇలా చాలా మంది హాజరయ్యారు.ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగగా తీర్మానించుకున్నారట.

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం ఇలాంటి సమావేశాలు ఇక ముందు కూడా జరుగుతాయని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలకు, కొండా దంపతులకు మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ విందు సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. కొండా కుటుంబానికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మధ్య అయితే చెప్పే పనేలేదు. మరోవైపు కడియం శ్రీహరి మీద మంత్రి భర్త కొండా మురళి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ వ్యవహారాలు అలా కొనసాగుతుండగానే.. భూపాలపల్లి నియోజకవర్గంలో పట్టు కోసం కొండా కుటుంబం ప్రయత్నించింది. దాంతో అక్కడి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా ఈ ఫ్యామిలీ మీద గుర్రుగా ఉన్నారు. అలాగే…. దేవాలయాల కమిటీల ఏర్పాటు, ఇతరత్రా రకరకాల అంశాల్లో కొండా దంపతుల జోక్యం పెరిగిపోయిందంటూ….. ఎమ్మెల్యేలంతా రివర్స్‌ అయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బసవరాజు సారయ్యతో మొదటి నుండి కొండ కుటుంబానికి గ్యాప్ ఉంది. ఇక జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఎర్రబెల్లి స్వర్ణకి వాళ్ళతో అసలే పొసగదు.

ఈ క్రమంలో…అప్పట్లో ఏకంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, నాటి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఇంటిదగ్గర కొండా కుటుంబానికి వ్యతిరేకంగా నేతలంతా సమావేశమయ్యారు. చర్యల కోసం పార్టీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చారు. దాంతో… ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కొండా కుటుంబం ఒకవైపు, మిగిలిన నేతలు అందరూ ఒకవైపు అన్నట్టుగా మారిపోయింది. అంతటి తీవ్రమైన వర్గ విభేదాలు ఉన్న ఈ నేతలంతా ఒక్కసారిగా కలిసిపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు నిజంగానే తొలిగిపోయాయా..? లేక వేరే ఏదైనా బలమైన శక్తి వీరిని కలిపిందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అదే నిజమైతే… ఆ శక్తి ఏంటన్న విశ్లేషణలు సైతం నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అభివృద్ధితో పాటు త్వరలో జరగబోతున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యత ఉంది. అది జరగాలంటే… అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే… అధిష్టానం సూచన మేరకే అందరూ కలిశారన్న అభిప్రాయం ఉంది. తాజా పరిస్థితుల్ని అర్ధం చేసుకున్న మంత్రి కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి వేశారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నందున రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అందరి సహకారం అవసరమనే విషయాన్ని గుర్తించిన కొండా దంపతులు కలిసి పోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి అయిఉండి కూడా…. ఇప్పటివరకు కేవలం వరంగల్ తూర్పు నియోజకవర్గానికే పరిమితమవుతున్న కొండా సురేఖ… ఇప్పుడు అందరితో కలవడం వల్ల పరిస్థితులు మారతాయని అంచనా వేస్తున్నారు. ఆమెకు మరింత ప్రాధాన్యత పెరగవచ్చంటున్నారు. అంతా కలిసికట్టుగా విపక్షాలను ఎదుర్కొంటున్నారన్న సంకేతాలు కేడర్‌లోని వెళ్తే…పార్టీకి సైతం ఊపు వస్తుందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊపు పెంచుతున్న బీఆర్ఎస్‌ను తట్టుకోవాలంటే నేతలందరూ కలిసి పని చేయక తప్పన్న అభిప్రాయానికి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు కొందరు. అయితే…. ఇదంతా నాణేనికి ఒకవైపేనని, మరోవైపు మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలు ఎప్పటికీ సమసిపోవని అనే వాళ్ళు సైతం ఉన్నారు జిల్లాలో. అవసరమైనప్పుడు కలుసుకోవడం, ఆ తర్వాత కొట్టుకోవడం వాళ్ళకు అత్యంత సహజమని సింపుల్‌గా కొట్టిపారేస్తున్నారు. ఏది కరెక్టో తేలాలంటే…. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అయ్యేదాకా చూడాల్సిందే.