Site icon NTV Telugu

Off The Record : రాజీవ్ గాంధీ సాక్షిగా వరంగల్ కాంగ్రెస్ లో వీధికెక్కిన విభేదాలు

Warangal

Warangal

మారరా… వీళ్ళలో ఇక మార్పు రాదా…? ఎప్పుడూ ఇలాగే తన్నులాటలు, తలకలతో టైంపాస్‌ చేస్తూ… పార్టీకి బొంద పెడతారా అంటూ ఘాటుగా మాట్లాడుకుంటోందట అక్కడి కాంగ్రెస్‌ కేడర్‌. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉన్న ఓరుగల్లు రెండు వర్గాల మధ్య సయోధ్య విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. జిల్లాలో తాజాగా ఏం జరిగింది? కొత్త రచ్చకు కారణాలేంటి? ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగకపోగా… నెక్స్ట్‌ లెవల్‌కు చేరుతోంది. క్రమశిక్షణ కమిటీ క్లాస్‌లు, వార్నింగ్స్‌ ఏమీ పని చేయడం లేదు ఈ విషయంలో. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు పలుమార్లు పీసీసీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నెల క్రితం రెండు వర్గాల పరస్పర ఫిర్యాదులతో పంచాయితీలు మరోసారి బహిర్గతమైంది. పీసీసీ నాయకత్వం జోక్యం చేసుకుని సర్దిచెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించింది. అదంతా జరిగిన వారం రోజుల్లోనే పాత తరహాలో మంత్రి సురేఖకు, మెజార్టీ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు మరింతగా బయటపడ్డాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో మరోసారి ఓపెనైపోయారు నాయకులు. ఇదంతా చూస్తున్న కార్యకర్తలు వీళ్ళిక మారరా? అంతా కలిసి స్థానిక ఎన్నికల్లో పార్టీని ముంచేస్తారా ఏంటని మాట్లాడుకుంటున్నారట.

పీసీసీ నాయకత్వం చెప్పినప్పుడు సరేనని తలలూపేసి తర్వాత ఎవరి స్టైల్‌లో వారు మంట పెట్టుకుంటూనే ఉన్నారు. అయితే… గతంలోలాగా మంత్రిని బహిరంగంగా విమర్శించకుండా ఆమె పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు. ఇటీవలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇదే జరిగింది. ఇక తాజాగా రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా… వరంగల్ ఎంజిఎం సెంటర్‌లో ఉన్న రాజీవ్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించేలా ఏర్పాట్లు జరిగాయి. ఉదయం10 గంటలకు మంత్రి వచ్చేలా ప్రోగ్రాం ఫిక్స్‌ అయింది. అదే సమయంలో కొండా దంపతులతో విభేదిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్థన్నపెట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వచ్చి మంత్రికంటే ముందే నివాళి ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. ఆ టైంలో మంత్రి అనుచరులు జై కొండా అంటూ నినాదాలు చేయడంతో విభేదాలు బయటపడ్డట్టయింది. మంత్రి అనుచరుల నినాదాల మధ్యనే ఈ నేతలంతా… రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే అక్కడి వచ్చిన కొండా సురేఖ… అక్కడ తమ పార్టీ నాయకులు ఉన్నారన్న సంగతిని పట్టించుకోకుండా… డైరెక్ట్‌గా విగ్రహం దగ్గరికి వెళ్ళి తన పని చేసుకున్నారు. దీంతో… ఓరుగల్లు కాంగ్రెస్‌ పోరు ఏ మాత్రం తగ్గలేదన్న విషయం అక్కడున్న వారికి అర్ధమైపోయింది. దీని గురించి మంత్రిని అడిగితే… నో కామెంట్ అంటూనే… వారి విజ్ఞతకు వగిలేస్తున్నానని చెప్పారు.

గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు ప్రోటోకాల్ గురించి తెలియకుండా ఉంటుందా అని రివర్స్‌ ప్రశ్నించడంతో… ఈ విషయంలో ఆమె బాగా హర్ట్‌ అయ్యారన్న విషయం బయటపడింది. ఇదే సమయంలో మంత్రితో కలిసి తాము పనిచేయలేమని రాజీవ్‌గాంధీ సాక్షిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపినట్టయిందన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల మధ్య పంచాయితీని పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం ప్రతిపాదించింది. మంత్రి సురేఖ, ఎమ్మె ల్యేల మధ్య కొత్తగా పంచాయితీలు రాకుండా కొత్త కమిటీ చూసుకోవాలని కూడా పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతున్నందున సత్వరం మరో కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా పీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోందట. క్రమశి క్షణ సంఘం ప్రతిపాదనలు, పీసీసీ నాయకత్వం ఉదాసీన వైఖరిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టం చేసేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ దంపతులను కనీసం హెచ్చరించకపోవడం సరికాదని అంటోందట ఆమె వైరి వర్గం. అందుకే వ్యూహత్మకంగా తమ వ్యతిరేకతను అధిష్టానానికి తెలిసేలా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు.

 

Exit mobile version