ఏపీలో పొలిటికల్ మూడ్ ఒకలా ఉంటే ….మా రూటే సెపరేట్ అంటున్నారట అక్కడి నేతలు. ఆరోపణలు వద్దు….అభివృద్ధి మీద ఢీ అంటే ఢీ అని కవ్వించుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. మహా విశాఖ అభివృద్ధి సంస్థ చుట్టూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్‌ల పర్వం మొదలైంది. గ్లాస్ బ్రిడ్జి దగ్గర నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అన్నీ తేల్చేసుకుందామనే లెవల్లో డిస్కషన్ ఊపందుకుంది. ఈ క్రెడిట్ ఫైట్ వెనుక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయా? ధూంధాం వెనుక అధికార పార్టీ ప్లానింగ్ ఏమై ఉంటుంది? కూటమి ప్రభుత్వం ఫోకస్ అంతా అమరావతి మీదే ఉందన్న ఎదురుదాడి ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం బలంగా చేస్తోంది.
బయటపడకపోయినా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకత్వం అదే అభిప్రాయంతో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి మార్క్ ఇప్పటి వరకు పడలేదని భావిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్, పోర్టు వంటివి నమూనాగా కనిపిస్తున్నప్పటికీ విశాఖ చుట్టూ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని బలంగా కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజకీయంగా విపరీతమైన పోటీ ఉండే VMRDA చైర్మన్ నియామకం నుంచి ప్రణాళికల అమలు తీరు వరకు ప్రత్యేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. యువనేతకు నమ్మిన బంటు లాంటి ప్రణవ్ గోపాల్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సొంత పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది…ఉద్ధండులు సారధ్యం వహించిన ఒకప్పటి వుడా ఇప్పటి VMRDA ముళ్ళ కిరీటం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఐతే, ఎమ్మెల్యేల సమన్వయం కలసి రావడంతో కీలక ప్రాజెక్టులు, నిర్ణయాల అమలుతో దూకుడు పెంచుతోంది. ఈ దిశగా VMRDA అభివృద్ధి ప్రణాళికలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాల పై పునఃసమీక్ష ఖాయమనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది కాలంలో సిటీ పర్యాటకానికి కొత్త కొత్త హంగులు తీసుకుని వస్తుంది. కైలాసగిరిపై అడ్వాంచర్ స్పోర్ట్స్., దేశంలో పొడవైన గ్లాస్ బ్రిడ్జ్, బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిటీ నడిబొడ్డున నిర్మించిన ఐకానిక్ బిల్డింగ్ “ది డెక్” ఇవన్నీ ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఆకర్షణీయ ప్రాజెక్టులు కావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవైన “కాంటీలీవర్” బ్రిడ్జ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. “ది డెక్” బిల్డింగ్ స్పేస్ కోసం ఐటీ సహా వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పోటీ ఎక్కువైంది.ఈ క్రేజ్ ను అధికార పార్టీ ఎంజాయ్ చేస్తుండగా….ప్రతిపక్షం సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందిస్తోంది. వైసీపీ హయాంలో మొదలైన ప్రాజెక్టులను తమ ఘనత గా చెప్పుకుంటుందనే విమర్శలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.
దీంతో ఏడాది కాలంలో VMRDA అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నారు చైర్మన్ ప్రణవ్ గోపాల్. మీ హయాంలో చేసిన అభివృద్ధి ఇదిగో అంటూ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను తెరపైకి తెచ్చింది టీడీపీ.ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన ప్రారంభానికి ముందుగానే కొట్టుకుపోయిందని ఎద్దేవా చేస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా మీరంటే….మీరని ఆత్మస్తుతి,పరనింద వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దూకుడును మరింత పెంచాలని VMRDA నిర్ణయించింది. ఇప్పటి కే మాస్టర్ ప్లాన్ రహదారులు విస్తరణ, శాటిలైట్ టౌన్ షిప్స్ అభివృద్ధి మీద ఫోకస్ చేసింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటిస్తోంది. కీలకమైన విశాఖ మెట్రో నిర్మాణానికి అవసరమైన నాలుగు వేల కోట్లు సమకూర్చే ప్రణాళికల ను సిద్ధం చేస్తోంది. ఈ తరహాలోVMRDA పనిచేస్తుంటే సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగడం ఆసక్తికరమైన పరిణామం. నాణేనికి రెండో కోణం కూడా ఉందని రాజకీయ విమర్శలు చూసేవాళ్లకు ఆ దెబ్బతో చెక్ పడటం ఖాయమని అధికార పార్టీ భావిస్తోంది. ఆ దిశగా సరైనా సమయం చూసి VMRDA మాస్టర్ ప్లాన్ 2047మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. వైసీపీ హయాంలో రూపొందించిన ఈ ప్రణాళిక మొత్తం తప్పుల తడకేనని వాదిస్తున్న కూటమి ప్రభుత్వం…..ఇటీవల అభ్యంతరాలను స్వీకరించింది. ఎమ్మెల్యేలు, మాస్టర్ ప్లాన్ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా కీలక మార్పులు చేయడమో లేక రద్దు నిర్ణయం ప్రకటించడమో జరుగుతుందని ప్రచారం కొంత కాలం గా నడుస్తోంది. దీనిని ఫోకస్ చేయడం ద్వారా వైసీపీ హయాంలో లోటుపాట్లు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనేది ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అధికార, విపక్షాల మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ ముదురుతోంది.
