Site icon NTV Telugu

Off The Record : జగనన్నకు జై కొట్టిన చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయా?

Rajini

Rajini

ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్ళు జగనన్నకు జై కొట్టిన ఆ చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయన్న ప్రచారంలో నిజమెంత? తరచూ నియోజకవర్గాలు మారుస్తూ తనతో పొలిటికల్‌ షటిల్‌ సర్వీస్‌ చేయిస్తున్నారన్న అసహనం ఆమెలో పెరుగుతోందా? నేను వైసీపీని వదలబోనని సదరు నేత చెబుతున్నా ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు? లోగుట్టు ఏంటి? విడ‌ద‌ల ర‌జ‌ని….ఏపీ పొలిటికల్‌ స్క్రీన్‌ మీద త‌క్కువ టైంలోనే ఎక్కువ పాపులర్‌ అయిన లీడర్‌ కమ్‌ ఎక్స్‌ మినిస్టర్‌. ఆమె వివాదాల జోలికి వెళ్తారా? లేక అవే ఈ వైసీపీ లీడర్‌ని వెదుక్కుంటూ వచ్చి వాలిపోతాయా? అన్న సంగతి పక్కనబెడితే… ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీతో ఆమె విషయంలో హాటు ఘాటు చర్చలు జరుగుతుంటాయి. ఈ పరంపరలోనే… తాజాగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే… ఇన్నాళ్ళు జరిగిన వాటిని మించిపోయింది. అవునా…? నిజమా…? అలా జరిగే అవకాశం కూడా ఉందా అంటూ… స్వయంగా వైసీపీ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయట. అది నిజమా, లేక ఉద్దేశ్యపూర్వకంగా ఇస్తున్న లీకులా అంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ మేటరేంటంటే… విడదల రజని త్వరలోనే వైసీపీకి బైబై చెప్పేస్తున్నారని ఇటీవల సోషల్‌ స్ట్రీట్స్‌లో గాసిప్స్‌ గుప్పుగుప్పుమంటున్నాయి. విడదల పార్టీ మారతారా లేదా అన్న సంగతి కాసేపు అలా ఉంచితే… అవన్నీ ఆమె సన్నిహితులు ఇస్తున్న లీకులన్న సంగతి అంతకు మించి ప్రచారంలోకి వచ్చింది.

దీంతో… బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటా అని కూపీ లాగుతున్న వాళ్ళకు ఏవేవో కొత్త కొత్త సంగతులు తెలిసిపోతున్నాయట. 2019లో వైసీపీ త‌ర‌ఫున‌ చిలకలూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిచి… జగన్‌ కేబినెట్‌లో మంత్రి అయ్యారు రజని.
పల్నాడులో పార్టీకి చాలామంది సీనియర్స్‌ ఉన్నా… అందర్నీ కాదని ఆమెకు మంత్రి పదవి దక్కడం, అందులోనూ… అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇక 2024 ఎన్నికల టైం వచ్చేసరికి రజనీని గుంటూరు వెస్ట్‌కు షిఫ్ట్‌ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…పార్టీ ఓడిపోయాక… జరిగిన ప‌రిణామాల్లో తిరిగి చిలకలూరిపేటకు షిఫ్ట్‌ అయిపోయారామె. మార్పు తర్వాత కూడా… మొదట్లో సైలెంట్ గానే ఉన్నా.. ఆ త‌ర్వాత కేసులు న‌మోదవడం, మారిన పరిస్థితులతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా…. పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో మీడియా స‌మావేశాల‌ు పెడుతూ… ఉనికి చాటుకుంటున్నారు మాజీ మంత్రి. మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా కూడా…మాజీ వైద్య ఆరోగ్య శాఖమంత్రి హోదాలో ఇటీవల రెగ్యుల‌ర్‌గా వాయిస్‌ వినిపిస్తున్నారు. అంత వరకు బాగానే ఉందని అనుకుంటున్న టైంలో…. ఆమెకు పిడుగులాంటి వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. చిల‌క‌లూరిపేట నుంచి ఈసారి రేప‌ల్లెకు షిఫ్ట్ చేస్తారంటూ అక్కడ టాక్‌ మొదలైంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఎదుర్కోవాలంటే… దీటైన వ్యక్తి కావాలని, అందుకే ఆమెను అటు షిఫ్ట్‌ చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందన్నది ఆ ప్రచారం సారాంశం. సరిగ్గా… ఇక్కడే కథలో మలుపులు, రజనీ పార్టీ మార్పు ప్రచారాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఒకసారి గుంటూరు వెళ్ళి దెబ్బతిన్న విడదల…. ఇంకోసారి నియోజకవర్గం మారి ఇబ్బంది పడటం ఇష్టంలేకే సన్నిహిత వర్గాల ద్వారా సోషల్‌ మీడియాలో పార్టీ మార్పు ప్రచారం చేయించుకుంటున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయట పొలిటికల్‌ సర్కిల్స్‌లో. వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా రజనీ హవా నడిచినా అదే స్థాయిలో అప్పుడు పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో వివాదాలు కూడా పెరిగాయి.

ఆ దశలో పార్టీ అధిష్టానం ర‌జనీకే స‌పోర్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ… వైసీపీలో లేరు. ఇక ఆ విధంగా… పేటలో పాతుకుపోదామనుకుంటున్న టైంలో…రేపల్లె ప్రచారం మాజీమంత్రి వర్గానికి మింగుడుపడటం లేదట. ఆ క్రమంలోనే పార్టీ మార్పు ప్రచారం షురూ అయి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఆ ప్రచారం ఒకింత గట్టిగా జరిగి పార్టీ పెద్దల దృష్టికి వెళితే… ఇక కదిలించబోరన్న ఉద్దేశ్యంతోనే రజనీ సన్నిహిత వర్గాలు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తుండవచ్చని అంటున్నారు. సాధారణంగా… ఒక పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు… కనీసం కొన్నాళ్ళయినా ఇనాక్టివ్‌గా ఉంటారు. టైం చూసి జంప్‌ కొట్టేస్తారు. కానీ… ఇప్పుడు రజనీ మాత్రం వైసీపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అలాగే ఆందోళన వద్దని కేడర్‌కు చెబుతున్నారని, ఇదంతా చూస్తుంటే… అధిష్టానానికి మరో ఆలోచన రాకుండా వత్తిడి తెచ్చే వ్యూహం ఉండి ఉండవచ్చంటున్నారు. తాను వైసీపీని వీడేది లేద‌ని, కొంద‌రు కావాల‌నే త‌న విష‌యంలో త‌ర‌చూ నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని మాజీ మంత్రి అంటున్నారన్నది ఇంకో వెర్షన్‌. అదే నిజమైతే… ఈ సోషల్‌ మీడియా రచ్చ మొత్తం ఎవరు చేస్తున్నట్టు? రజనీ పార్టీ మారినా, పేట నుంచి రేపల్లెకు షిఫ్ట్‌ అయినా….లాభం ఎవరికన్నది బిగ్‌ క్వశ్చన్‌. అయితే… విడదల రజని మరోసారి నియోజకవర్గం మారితే గెలుపు కష్టమని, అదృష్టాన్ని పరీక్షించుకునే బదులు గ్యారంటీ ఉన్న సీట్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ లీకులు ఇప్పిస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయట. రేపల్లె గురించి అధిష్టానం అడక్కముందే తన మనసులోని మాటను వాళ్ళకు చెప్పే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి..? పార్టీ మార్పు ప్రచారంలో నిజమెంత? దీనికి తెర దించేది ఎవరన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version