అడుసు తొక్కనేల-కాలు కడగనేల అన్నది సామెత. ఇప్పుడా మాజీ ఎమ్మెల్యే కాలే కాదు… ఏకంగా నోరు కూడా కడుక్కునే ప్రయత్నంలో ఉన్నారా? ఆయనకు నోటి పోటు గట్టిగా తగిలిందా? సీరియస్‌నెస్‌ను గమనించి సారీతో సరిపెడదామనుకుంటున్నా… పరిస్థితులు అందుకు సహకరిస్తాయా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఆయనకు నోరు ఎలా చేటు తెచ్చింది? కొత్తగా పలుకుతున్న సారీ….గమల సంగతేంటి? రాజకీయ నాయకులు ప్రచారం కోసం పాకులాడటం కామన్. పాజిటివ్ ఆర్ నెగెటివ్… జనం మన గురించి మర్చిపోకుండా మాట్లాడుకుంటూ ఉండాలనుకునే పొలిటికల్ బ్యాచ్‌కు కొదవే లేదు. అయితే… ఆ ఊపులో వాళ్ళు చేసే విన్యాసాలు అప్పుడప్పుటూ రివర్స్ అవుతుంటాయి కూడా. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని అంటున్నాయి రాజకీయవర్గాలు. మొన్న రాక్రీట్ సంస్థపై విజిలెన్స్ కేసులు, నిన్న గన్ మెన్ తొలగింపుపై రగడ .. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఏకంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా వైసీపీ ఆఫీస్ ప్రెస్‌మీట్‌లో తోపుదుర్తి వాడిన భాషపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ రెచ్చిపోయారు తోపుదుర్తి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలోనే “రౌడీ నా డ్యాష్‌లకు కాపలా కాసేదానికి ఖాకీ చొక్కాలు అవసరమా..! ఖాకీ చొక్కా వదిలేసి వాళ్లతో కలసి రండి.. మేమూ ఖద్దరు వేసుకోవడం మానేస్తాం.. మొగోళ్లలా కొట్టుకుందామంటూ సవాల్ విసిరారు. అక్కడితో ఆగారా అంటే.. అదీ లేదు. రాండి ఎదురెదురు కొట్టుకుందాం.. మమ్మల్ని అడ్డుకునేందుకు బెటాలియన్లు తెచ్చుకుంటున్నారు…. అంటూ కొనసాగింపుగా బూతు పదజాలాన్ని తీవ్ర స్థాయిలో వాడేశారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో ఫైరైపోయింది. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తన స్థాయి మరిచి మాట్లాడటం సరికాదంటూ సీరియస్ అయ్యారు. రాత్రింబవళ్లు ప్రజల భద్రత కోసం శ్రమిస్తున్న పోలీసులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి పోలీసులే ఇప్పుడూ ఉన్నారంటూ గుర్తు చేశారు. రాప్తాడులో అసలు నామినేషన్లే వేయలేదా అని ప్రశ్నించిన పోలీస్ అసోసియేషన్…. తన వ్యాఖ్యలపై ప్రకాష్‌రెడ్డి వెంటనే పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు సంఘ నేతలు. అందుకు తగ్గట్టుగానే… ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతోంది. మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసుల పరువుకు భంగం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నాయకులను, ప్రజలను చంపుతానని బెదిరించడం వంటి అంశాలకు సంబంధించి అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో 4 తీవ్రమైన సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు బుక్ అయ్యాయి. వాటికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమైంది. దీంతో… మేటర్ చేయిదాటి పోతోందని గ్రహించిన తోపుదుర్తి ఫైనల్‌గా సారీగమలు పాడారు. పోలీసుల్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే… టీడీపీకి సపోర్ట్‌గా ఉన్న వాళ్ళను ఉద్దేశించి మాత్రమే అలా అన్నానంటూ సన్నాయి నొక్కులు నొక్కారాయన. తనకు వేరే ఉద్దశ్యం లేదంటూ వీడియో విడుదల చేసినా… పోలీస్ అధికారుల సంఘం దీన్ని ఎలా తీసుకుంటుందన్న విషయంలో ఆసక్తి పెరుగుతోంది. ఆ కేసులు ఆలాగే కొనసాగుతాయా? లేక సారీకి సరేనని అంటారా అన్నది జిల్లా రాజకీయవర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మొత్తానికి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే దూకుడు వైఖరి ఒక్కోసారి ఆయనకు కలిసి వచ్చినా…. పాముకు, తేలుకు ఒకటే మంత్రం పనిచేయదన్న పెద్దల మాటల్ని గుర్తు చేస్తున్నారు లోకల్ పొలిటికల్ లీడర్స్. ఫైనల్‌గా నాన్ బెయిల్ కేసుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

