OTR : ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ మంత్రులు!

Peshi

Peshi

తెలంగాణ మంత్రులు కొందరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారా? తమకు మచ్చ పడకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నారా? ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి పక్కనే ఉంటున్న వాళ్ళని పక్కకు పెడుతున్నారా? అలాంటి వ్యక్తులు తమ దగ్గర ఉంటే… ముందు ముందు డ్యామేజ్‌ తప్పదని అలర్ట్‌ అవుతున్నారా? ఎవరా వ్యక్తులు? వాళ్ళ విషయంలో మంత్రులు ఎందుకు అటెన్షన్‌ మోడ్‌లోకి రావాల్సి వచ్చింది? తెలంగాణ మంత్రివర్గ సభ్యులు పలువురు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రెండున్నరేళ్ళుగా తమ వద్ద పని చేస్తున్న ఓఎస్డీలను ఒక్కొక్కరుగా పక్కన పెడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో కొందరు మంత్రులు వారి ఓఎస్డీలను తొలగించగా.. మరికొందరు మార్చుకున్నారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం బయటకు లీక్ అవుతున్నట్టు సర్కార్‌ పెద్దలు గుర్తించారట. ఆ కోణంలోనే.. మంత్రులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. మినిస్టర్స్‌ దగ్గర పని చేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలపై నివేదికల్ని ఇంటలిజెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తున్నాయి. సెక్రటేరియట్‌లో, క్యాంపు కార్యాలయాల్లో మంత్రుల దగ్గర పని చేసే వారి విషయంలో అలాంటి రిపోర్ట్స్‌ ఆధారంగానే కొందరు మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గతంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమంత్ ప్రయివేటు వ్యక్తి కావడంతో ఆయన్ను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోస్టులో మంత్రి వేరే ఎవర్నీ నియమించుకోలేదు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఓఎస్డీగా పని చేసిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ విధుల నుంచి వైదొలిగారు. ఆమె ఎందుకు పక్కకు జరిగారన్న విషయమై మంత్రి పేషీకి కూడా స్పష్టత లేదట. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పని చేసిన ఓఎస్డీ యుగంధర్ అకస్మాత్తుగా విధులకు దూరం అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన పీఎస్ చంద్రమోహన్ కూడా మానేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గర పీఎస్ గా ఉన్న పురుషోత్తం రెడ్డి ఇటీవల మానేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గర ఓఎస్డీగా కొనసాగిన పాక రమేష్ సైతం ఈ మధ్యనే అక్కడ విధులు మానేశారు. అలాగే… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర ఓఎస్డీగా పని చేసిన సురేందర్ రెడ్డి కూడా ఇటీవల మరో శాఖకు బదిలీ అయ్యారు. జూపల్లి కృష్ణారావు దగ్గర ఓఎస్డీగా పని చేసిన రాజేందర్‌ ఓ నామినేటెడ్ పోస్టులో నియమితులయ్యారు. ఇలా మంత్రుల దగ్గర పని చేసిన ఓఎస్డీలంతా ఒక్కొక్కరుగా మానేయడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధులకు దూరంగా ఉంటున్న ఒకరిద్దరు వ్యక్తిగత కారణల రీత్యా తాము మానేసినట్టు చెబుతున్నారు. కానీ… అసలు సంగతి వేరే ఉందన్నది ఇంటర్నల్‌ టాక్‌. కొందరిపై మంత్రులకు ఫిర్యాదులు రావడంతో వారిని తొలగించి వేరే వారిని నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీస్‌ పేరుతో… కొందరు బాగా స్పెషల్‌గా వ్యవహరిస్తున్నారని, వాళ్ళ చర్యలు చివరికి నియమించుకున్న మంత్రులకే తలనొప్పిగా మారాయని చెప్పుకుంటున్నారు. ఇక ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ ఆధారంగా ముఖ్యమంత్రి అలర్ట్‌ చేయడంతో… మంత్రులంతా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారంటూ సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది.

×
×
Ad