Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ బీజేపీకి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోందా..?

Bjp

Bjp

తెలంగాణ కమలం పార్టీకి అగ్ని పరీక్ష ఎదురు కాబోతోందా? ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అని డైలాగ్స్‌ చెప్పడం కాదు, చేసి చూపించండని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు సీరియస్‌గా చెప్పారా? ప్రత్యేకించి బీజేపీ ప్రజా ప్రతినిధులకు రాబోయే రోజులు సవాల్‌గా మారబోతున్నాయా? ఏ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నారు పార్టీ పెద్దలు? ఎందుకలా? తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కనీసం ఆరు శాతం గ్రామాల్ని కూడా గెల్చుకోలేక, కొన్ని చోట్ల అసలు పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు లేక ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెల్చుకున్నామని రాష్ట్ర నాయకులు సంబరపడ్డారు. కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న పార్చీకి మరీ… అంత అల్ప సంతోషమైతే ఎలాగన్నది ఎక్కువ మంది ప్రశ్న.

అదే ప్రశ్న బీజేపీ పెద్దలు వేస్తే… ఇప్పుడు ఎన్నికలు జరిగింది గ్రామాల్లో, మనకు పట్టణాల్లో ఫుల్‌ పట్టుంది, రేపు మున్సిపల్‌ ఎన్నికల్లో చూస్కోండి మా తడాఖా అన్నారట కొందరు తెలంగాణ నేతలు. ఆ మాటనే గుర్తు చేస్తూ… ఇక చూపండి మీ సత్తా ఎంతోనని ఢిల్లీ పెద్దలు అంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. అవి పార్టీ సింబల్స్‌ మీదే జరుగుతాయి కాబట్టి అన్ని ప్రధాన పక్షాలకు సవాలే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా… పట్టణ పార్టీ ముద్ర ఉన్న బీజేపీకి ఇది నిజంగా అగ్ని పరీక్షేననని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంటే సరేనని సర్దిచెప్పుకోవచ్చుగానీ…. మున్సిపాలిటీల్లో కూడా పనితీరు సరిగా లేకపోతే… కేడర్‌లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, రేపు అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళని సిద్ధం చేయడం కష్టమవుతుందన్న అభిప్రాయం పార్టీలోనే వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తన ఉనికి చాటు కోవాలంటే ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్స్‌లో పాగా వేయగలగాలన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

గత ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్‌లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అలాగే పార్టీ ఎంపీలకు కూడా తమ పరిధిలోని కార్పొరేషన్స్‌లో పాగా వేయడం ప్రెస్టీజ్‌ ఇష్యూగా మారబోతోంది. బండి సంజయ్‌కి కరీంనగర్, ధర్మపురి అరవింద్‌కు నిజామాబాద్‌, డీకే అరుణకు మహబూబ్ నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ అగ్నిపరీక్షేనని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. మూడు చోట్ల పార్టీకి పట్టున్నందున ఆయా కార్పొరేషన్లలో జెండా ఎగరేయగలిగితేనే… పార్టీకి కూడా గౌరవప్రదంగా ఉంటుందన్నది విస్తృతాభిప్రాయం. మహబూబ్‌నగర్‌లో అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక నిజామాబాద్‌లో అయితే సిట్టింగ్ శాసనసభ్యుడు బీజేపీనే. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ కొద్ది ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు అది వేరే సంగతి. ఈ పరిస్థితుల్లో… ఆ మూడు కార్పొరేషన్స్‌ని కైవసం చేసుకుంటేనే పార్టీ గౌరవం నిలబడుతుందని కాషాయ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. అందుకో ఉదాహరణ కూడా చెబుతున్నారు. కేరళలో తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌నే కైవసం చేసుకున్నప్పుడు ఇక్కడ గెలవలేమా అన్నది కేడర్‌ క్వశ్చన్‌. ఇక మిగతా మూడిటి విషయానికొస్తే… మంచిర్యాల, రామగుండంలో అంతో ఇంతో ప్రభావం చూపగలిగినా, కొత్తగూడెంలో నామ మాత్రమే. అందుకే… కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో గెలవడం అన్నది పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ప్రతిష్టాత్మకమేనన్న అభిప్రాయం బలపడుతోంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్మల్ మున్సిపాలిటీ ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యేలకు కూడా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెల్చుకోవడమన్నది నిజంగా సవాలేనంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే… బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో 45 దాకా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ ఉన్నాయి. వీటిలో ఎన్నిటిని కాషాయ దళం స్వాధీనం చేసుకోగలుగుతుందన్నది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ సబ్జెక్ట్‌.

Exit mobile version