Site icon NTV Telugu

Off The Record : మంత్రులకు సంబంధం లేకుండా సీఎంవోలో నిర్ణయాలు జరుగుతున్నాయా ?

Tg

Tg

తెలంగాణ సచివాలయంలో ఏదో… ఏదేదో… జరిగిపోతోందా? మంత్రులకు తెలియకుండానే శాఖల్లో కీలకమైన ఫైళ్లు కదిలిపోతున్నాయా? ఫైళ్లదాకా ఎందుకు… పెద్ద ఆఫీసర్స్‌ నియామకాలు, బదిలీలు కూడా వాళ్ళకు తెలియకుండా జరుగుతున్నాయా? అసలు మినిస్టర్స్‌కు తెలియకుండా వాళ్ళ డిపార్ట్‌మెంట్స్‌లో వేళ్ళు పెడుతున్నది ఎవరు? కేబినెట్‌లో అసహనం ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ క్యాబినెట్‌లోని మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు తమకెందుకులే అన్న ధోరణితో ఉంటే.. మరికొందరు మాత్రం మాకు తెలియకుండా మా శాఖల్లో ఎందుకు తల దూరుస్తున్నారని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా మంత్రులకు తెలియకుండా ఆయా డిపార్ట్‌మెంట్స్‌లో అధికారులను నియమించడం, ఉన్నవాళ్ళను తొలగించడం చేస్తున్నారని ఓ మంత్రి తీవ్రంగా రగిలిపోతున్నారట. ఆయన శాఖ పరిధిలోని ఓ కార్పొరేషన్ ఎండీని తనకే తెలియకుండా నియమించారు. సదరు ఎండీ ఇప్పటి వరకు మర్యాదపూర్వకంగా కూడా మంత్రిని కలువ లేదని తెలుస్తోంది. ఇటీవల ముగ్గురు మంత్రులు జిల్లాల్లో పర్యటించినా ఆ అధికారి మాత్రం వెళ్లలేదట. అసలా కార్పొరేషన్ లో ఏం జరుగుతోందో మంత్రికి తెలియని పరిస్థితి. అసలా నియామకం ఎలా జరిగిందని మంత్రి ఆరా తీస్తే…. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్న ఆన్సర్‌ విని అవాక్కయ్యారట మినిస్టర్‌.

అధికారుల తొలగింపు, నియామకాల్లాంటి వాటిని కూడా సీఎం ఆఫీస్‌ అధికారులే చూస్తే…ఇక మంత్రిగా నేనేం పని చేయాలని అసహనంగా ఉన్నారట ఆయన. అలాగే… కొద్ది రోజుల క్రితం ఓ మంత్రికి చెందిన శాఖ పరిధిలోని టెండర్ల విషయం చినికి చినికి గాలివానలా మారింది. ఆ ఎపిసోడ్‌లో ఓ ఐఏఎస్ ను బలి పశువును చేసినట్టు మాట్లాడుకుంటున్నాయి సచివాలయ వర్గాలు.

ఆ విషయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఇద్దరికి సీఎంవో అధికారులు ఫోన్ చేసి టెండర్ల విషయంలో తాము చేసిన సూచనలతో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారట. దానిమీద పెద్ద దుమారం చెలరేగడంతో మంత్రి కాస్త లోతుగా విచారిస్తే సీఎంవో అధికారులు తమ శాఖ ఆఫీసర్స్‌ మీద ఒత్తిడి తెచ్చినట్లు తెలిసిందట. దీంతో మంత్రి ఏం చేయలేక సైలెంట్ అయిపోయినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రికి తెలియకుండా డిపార్ట్‌మెంట్‌లో అధికారుల డిప్యుటేషన్లు, ప్రమోషన్లు జరిగిపోయాయి. అనర్హులకు పదోన్నతులు ఎలా ఇస్తారని కొందరు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో కంగు తిన్నారట ఆయన. ఇక్కడ కూడా సేమ్‌ టు సేమ్‌… సీఎం ఆఫీస్‌ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలిందట. ఇటీవల సంచలనం సృష్టించిన ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ సామాజిక వర్గానికి ఇబ్బంది కలిగేలా నిర్ణయం ఉందని… ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే… ఆ నిర్ణయం తాను కానీ, క్యాబినెట్ కానీ తీసుకోలేదని వివరణ ఇచ్చారాయన. ఈ నిర్ణయాన్ని కూడా సీఎంవో అధికారులే తీసుకుని కొన్ని పత్రికలకు లీకులు ఇచ్చినట్టు మంత్రి దృష్టికి వచ్చిందట. ఒక్క మాట కూడా తనకు చెప్పకుండా సీఎంవో అధికారులు నిర్ణయం ఎలా తీసుకుంటారని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.

క్యాబినెట్ లో సీనియర్ మంత్రి ఒకరికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలుస్తోంది. మంత్రి శాఖలో కీలకమైన పనుల టెండర్లు, కీలక అధికారుల నియామకం కూడా అలానే జరుగుతున్నాయని గ్రహించారట. కొన్ని జిల్లాల్లో కీలక పనుల టెండర్లు, కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, జాప్యం విషయంలో ఆ సీనియర్ మంత్రి హర్ట్ అయ్యారని సెక్రటేరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ మంత్రులకు తెలియకుండా సీఎంవో అధికారులు ఏ దైర్యంతో నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నది ఇప్పుడు తెలంగాణ కేబినెట్‌లో హాట్‌ టాపిక్‌. కొందరు మంత్రుల ను డమ్మీలుగా భావించి నిర్ణయం తీసుకుంటున్నారా? లేక తాము ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రులకు చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా ? అన్న చర్చ జరుగుతోంది. మంచి పేరు వస్తే తమ ఖాతాలో వేసుకుని… అదే బూమ్ రాంగ్ అయితే మంత్రి మీదకు తోసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు సీఎంవోలో జరుగుతున్నాయని సదరు మంత్రులు చర్చించుకుంటున్నారట.

Exit mobile version