Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ సీఎస్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందా?

Cs

Cs

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగిస్తారా ? సీనియర్ ఐఏఎస్‌లకు…సీఎస్ అయ్యే అవకాశం ఇస్తారా? సీఎస్ రేసులో ఎవరెవరు ఉన్నారు ? చీఫ్ సెక్రటరీ పదవీ కోసం లాబీయింగ్ చేస్తున్నదెవరు ? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు పదవీ కాలం…ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు…సీఎస్‌ అయి మూడు నెలలే అయింది. ఆయన పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తుందా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…సీఎస్‌గా ఎవరి పేర్లను డీఓపీటీకి పంపిస్తారనే దానిపై ఉత్కంఠ బ్యూరోక్రాట్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం…ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

పదవీ విరమణ చేసిన ఏ ఉద్యోగిని, అధికారిని మళ్ళీ పదవిలోకి తీసుకోవద్దని…పదవీకాలాన్ని పొడిగించ వద్దని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. దీంతో సీఎస్ రామకృష్ణారావుకు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర సీఎస్‌గా కనీసం ఆరు నెలలు కూడా రామకృష్ణారావు పని చేయలేదు. కాబట్టి మరో మూడు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే డీఓపీటీకి కూడా అర్జీ పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలంటే…ఒక స్పెషల్ సీఎస్ పేరును రెండు పర్యాయాలుగా డీఓపీటీకి పంపవచ్చని తెలుస్తోంది. అయితే రామకృష్ణారావు సేవలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలనుకుంటే మూడు నెలల కోసం డీఓపీటీకి పంపిస్తుంది. లేదంటే మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు కేంద్రానికి సిఫార్సు చేస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు ఒకట్రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

కాళేశ్వరం బ్యారేజిల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్…తన విచారణ పూర్తి చేసి నివేదికను అందించింది. ఈ నివేదికలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. ముందుగా బ్యూరోక్రాట్స్ కు కాళేశ్వరం కమిషన్ నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. గడిచిన పదేళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణను సీఎస్ రామకృష్ణరావు ఎదుర్కొన్నారు. త్వరలో నివేదిక బహిర్గతమయితే రామకృష్ణారావు నిబంధనలు ఉల్లంఘించిన విషయం తేటతెల్లం అవుతుందని బ్యూరోక్రాట్స్ చర్చించుకుంటున్నారు. దీంతో సీఎస్ గా రామకృష్ణారావును కొనసాగించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. 1990, 1991, 1992 బ్యాచ్‌కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు… సీఎస్ రేస్‌లో ముందు వ‌రుస‌లో ఉన్నారు.

1990 బ్యాచ్‌కు చెందిన శ‌శాంక్ గోయ‌ల్‌, 1991 బ్యాచ్‌కు చెందిన అర‌వింద్ కుమార్, 1992 బ్యాచ్ అధికారుల‌లో సంజ‌య్ జాజు, జయేశ్‌ రంజన్‌, వికాస్‌రాజ్‌ ఉన్నారు. సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్ కు చెందిన శశాంక్ గోయల్ ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన అర‌వింద్ కుమార్‌ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచార‌ణ‌ ఎదుర్కొంటున్నారు. ఇటీవల మరో కేసు కూడా నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. మరి వీరిలో ఎవరికి సీఎస్ గా అవకాశం దొరుకుతుందో వేచి చూడాలి.

 

Exit mobile version